తాజా ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే గురి?!
తాజా ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే గురి?! తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై మాజీ ఎమ్మెల్యే, వైసిపి రాష్ట్ర యుజవన విభాగం అధ్యక్షుడు…
తాజా ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే గురి?!
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై మాజీ ఎమ్మెల్యే, వైసిపి రాష్ట్ర యుజవన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా గురి పెట్టినట్లు కనిపిస్తోంది. నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ కార్యకలాపాలపై రాజా ప్రత్యేక నిఘా వేశారు. నియోజకవర్గంలో ఇసుక, మద్యం, ఉద్యోగుల బదిలీలు తదితర అంశాలతో పాటు, అభివృద్ధి పనుల్లో అవినీతి, అక్రమాలు దొరుకుతాయోమోనని రాజా ప్రత్యేకంగా ఓ కన్నేసి ఉంచారు. కలవచర్లలో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలపై నిఘా ఉంచి, స్వయంగా పట్టించేయడమే ఇందుకు తార్కాణంగా కనిపిస్తోంది. రాజా తన సోదరుడు జక్కంపూడి గణేష్ తో కలిసి అర్థరాత్రి కలవచర్లకు వెళ్లి మట్టి తవ్వకాలను అడ్డుకుని ఇందుకు వినియోగిస్తున్న ప్రొక్లయిన్, లారీలను పోలీసులకు పట్టించారు. దీనిపై ఆయన పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు, పోలవరం అథారిటీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.
అధికార పార్టీ అండదండలతో అక్రమ గ్రావెల్ వ్యవహారం సాగుతోందని రాజా ఆరోపించారు. కలవచర్ల గ్రామంలో రెండు నెలలుగా అక్రమ గ్రావెల్ తరలింపు జరుగుతోందన్నారు. రాజానగరం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అవినీతి,అక్రమాలు తప్ప అభివృద్ధి శూన్యమని ధ్వజమెత్తారు. అత్యవసర పనుల కోసం కాటవరంలో నిల్వ ఉంచిన లక్షల టన్నుల ఇసుకను రాత్రికి రాత్రే దోచేశారని ఆరోపించారు. నియోజకవర్గానికి సంబంధించి వివిధ శాఖల అధికారుల దగ్గర లక్షల రూపాయ లంచాలు తీసుకుని ఇక్కడ పోస్టింగులు ఇస్తున్నారని జక్కంపూడి రాజా ఆరోపించారు. రాజా తీరు చూస్తే గత ఎన్నికల్లో ఓడిపోయినా…రాజానగరాన్ని తన శాశ్వత కార్యక్షేత్రంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈనేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆచితూచి అడుగులు వేయడంతో పాటు, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.