- November 25, 2024
రాజమహేంద్రవరంలో విధుశేఖర భారతీ మహాస్వామి విజయ ధర్మయాత్ర
సనాతన ధర్మం గురించి హిందువులతో పాటు అందరికీ అవగాహన కల్పించాలన్న సంకల్పంతో శ్రీ శృంగేరి శారదా పీఠాధీశులు జగద్గురు అనంతశ్రీ విభూషిత శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి…
సనాతన ధర్మం గురించి హిందువులతో పాటు అందరికీ అవగాహన కల్పించాలన్న సంకల్పంతో శ్రీ శృంగేరి శారదా పీఠాధీశులు జగద్గురు అనంతశ్రీ విభూషిత శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి ఈనెల 26నుంచి 29వ తేదీ వరకు రాజమహేంద్రవరంలో విజయధర్మయాత్ర చేపట్టనున్నారు. గోదావరి గట్టున ఉన్న శ్రీశృంగేరి శంకర మఠం, శ్రీ త్యాగ రామనారాయణ దాస సేవా సమితి ప్రాంగణాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కార్యక్రమాల కన్వీనర్లు ప్రముఖ ఆడిటర్ విశ్వనాథం భాస్కరరామ్, ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు, శంకరమఠం ధర్మాదికారి వేలూరి బాలాజీ, ప్రముఖ చార్టెడ్ అక్కౌంటెంట్ వేదుల శేషగిరి వరప్రసాద్, గౌతమీ నేత్రాలయం సిఇఓ వి.విజయకుమార్ తెలియజేశారు. 26వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు శృంగేరి మఠం వద్దకు జగద్గురువుల ఆగమనం, పూర్ణకుంభ స్వాగతం, 6.30 గంటలకు వేదస్వస్తి, నాదస్వరం, నామ సంకీర్తనలతో శోభాయాత్ర శంకరమఠం నుంచి త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణం వరకు, 7 గంటలకు శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ దంపతులచే ధూళిపాద పూజ, విశ్వనాధం భాస్కరరామ్ దంపతులచే ఫల సమర్పణ, హోతా సీతారామ శాస్త్రి దంపతులచే వస్త్ర సమర్పణ జరుగుతుంది. రాత్రి 7:30 గంటలకు స్వాగత సభకు ప్రాచార్య శలాక రఘునాథ శర్మ స్వాగత పత్ర సమర్పణ అనంతరం జగద్గురువుల అనుగ్రహ భాషణం, మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి శృంగేరి పీఠ వైభవ ప్రవచనం, శ్రీ చంద్రమౌళీశ్వర పూజ (శ్రీత్యాగరాజ ప్రాంగణంలో) జరుగుతాయి. 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంట లకు సమితి ప్రాంగణంలో శ్రీ చంద్రమౌళీశ్వర పూజ, 9 గంటలకు శ్రీ శారదాంబ, శ్రీ శంకరాచార్య శ్రీ దత్తాత్రేయ స్వామి వారల విగ్రహ ప్రతిష్టలు, కుంభాభిషేకం, శిఖరాభిషేకం, 1910 సంవత్సరంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ప్రతిష్టించిన దత్త పాదుకల పునఃప్రతిష్ట శ్రీ శృంగేరి శంకర మఠంలో జరుగుతాయి. 10:30 గంటలకు త్యాగ రాజ ప్రాంగణంలో శ్రీ జగద్గురువుల సమక్షాన వేదసభ భక్తులకు దర్శనం, 5 గంటలకు శ్రీ త్యాగరాజ ప్రాంగణంలో జగద్గురువుల సమక్షాన శతావధాని గన్నవరం లలితాదిత్య అష్టావధానం, పండిత సత్కారం, గురువందన సభ, శ్రీ చంద్రమౌళీశ్వర పూజ, ప్రసాద వితరణ జరుగుతాయి. 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు సమితి ప్రాంగణంలో శ్రీ చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు డాక్టర్ ముప్పవరపు సింహాచల శాస్త్రి భాగవతార్ హరికథా గానం, 7 గంటలకు త్యాగరాజ ప్రాంగణానికి జగద్గురువుల ఆగమనం, శ్రీ చంద్రమౌళీశ్వర పూజ, ప్రసాద వితరణ జరుగుతాయి. 29వ తేదీ ఉదయం 8 గంటలకు సమితి ప్రాంగణంలో శ్రీ చంద్రమౌళేశ్వర పూజ, ఉ. 9 గంటలకు విరించి వానప్రస్థాశ్రమం సందర్శన, గురువందన సభ, జగద్గురువుల అనుగ్రహ భాషణం, శ్రీ శృంగేరీ పీఠం అడ్మినిస్ట్రేటర్, సిఇఓ పిఎ మురళీకి గౌరవ సత్కారం జరుగుతాయి. గౌతమి నేత్రాలయం ఆధ్యర్యంలో స్వామి వారి ఆశీస్సులతో ఆధునాతన ఆసుప్రతి నిర్మాణం, పరిశోధన కేంద్రం, పిల్లల అంధత్వ నివారణ, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మహాపాశుపతి రుద్రహోమం, పిల్లలకు నేత్రవైద్య శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటలకు స్వామివారు కొంతమూరు శ్రీ దత్తాత్రేయ వేదగురుకులాన్ని సందర్శిస్తారు. 11:30 గంటలకు శ్రీ త్యాగరాజ ప్రాంగణంలో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8 గంటలకు శ్రీ త్యాగరాజ ప్రాంగణంలో దీపోత్సవం, గురువందన సభ చందమౌళీశ్వర పూజ, ప్రసాద వితరణ జరుగుతాయి. భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవాలని కన్వీనర్లు పిలుపునిచ్చారు.
““