డిగ్రీల్లో అర్థశతకం సాధించిన నిత్యవిద్యార్థి….శతకం దిశగా ప్రస్థానం!
కర్రి రామారెడ్డి పేరు చెబితేనే ఎన్నో విశేషణాలతో పాటు, వెనుక సంవత్సరానికి కొన్ని చొప్పున డిగ్రీలు, డాక్టరేట్లు తగిలించాల్సి ఉంటుంది. రాజమహేంద్రవరంనకు చెందిన నిత్యవిద్యార్థి, ప్రముఖ మానసిక…

కర్రి రామారెడ్డి పేరు చెబితేనే ఎన్నో విశేషణాలతో పాటు, వెనుక సంవత్సరానికి కొన్ని చొప్పున డిగ్రీలు, డాక్టరేట్లు తగిలించాల్సి ఉంటుంది. రాజమహేంద్రవరంనకు చెందిన నిత్యవిద్యార్థి, ప్రముఖ మానసిక వైద్యులు, డాక్టర్ బీసీ రాయ్ పురస్కార గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి డిగ్రీల పరంపరలో మరో మైలురాయిని అధిగమించారు. తాజాగా దేశంలోని ప్రముఖ ఐఐటిలతో కూడిన ఎన్ పిటెల్, ఎన్ పిటెల్ ప్లస్ నిర్వహించే పరీక్షల్లో ఒకే సెమిస్టర్ లో 13 కోర్సులు పూర్తిచేసి, అందులో ఆరు కోర్సులలో టాపర్స్ లో ఒకరిగా నిలవడం విశేషం. ఈకోర్సులను పూర్తి చేయడం ద్వారా డిగ్రీల్లో అర్థశతకం పూర్తి చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. మూడు డాక్టరేట్లు, ఐదు ఎల్ఎల్ ఎం లు, ఎంబిఏ, ఎంసిఎ, ఎంఎటిక్, ఎంఏ, ఎంకామ్…ఇలా ఆయన పూర్తి చేసిన కోర్సులు కూడా దేనికవి విభిన్నంగా ఉండటం మరింత విశేషం. కొన్నింట్లో బంగారు పతకాలు కూడా సాధించారు.
డిగ్రీల సాధనలో ఇప్పటికే ప్రపంచరికార్డును సాధించిన కర్రి రామారెడ్డి ఏదో పేరుకోసమో….గొప్పల కోసమో డిగ్రీలు చదవడం లేదు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో…బుర్ర పోషణకు, మానసిక ఉత్తేజానికి చదువు కూడా అంతేనని, అందుకే తాను పరీక్షలు రాసి మరీ డిగ్రీలు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. నిత్యం బిజీగా ఉండే రామారెడ్డి దినచర్య తెల్లవారుజామున 3గంటలకే మొదలవుతుంది. అంత బిజీలోనూ వీలుచేసుకుని రోజుకు కనీసం 5గంటలు విద్యాభ్యాసంలో గడుపుతానని ఆయన వివరించారు. ప్రస్తుతం 70వ పడిలో ఉన్న రామారెడ్డి రానున్న రోజుల్లో వయస్సును మించిన డిగ్రీలు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది నాటికి ఎన్ పిటెల్ ద్వారా ఒకే సెమిస్టర్ లో 12 కోర్సులు, ఆపై ఏడాది మరో 12 కోర్సులు పూర్తి చేసి, వయస్సుకు మించిన డిగ్రీలు సాధిస్తానని చెప్పారు. డిగ్రీల సాధనలో హాఫ్ సెంచరీ సాధించిన సందర్భంగా మానస ఆసుపత్రిలో మాజీ ఎంపీ జివి హర్షకుమార్, ఆర్ ఆర్ ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, ఐ ఎం ఏ నగర అధ్యక్షుడు డా గురుప్రసాద్, పివిఎస్ కృష్ణారావు లతో కల్సి విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే సెమిస్టర్ లో ఏదైనా మూడు కోర్సులకు టాపర్ గా వస్తే ఎన్ పిటిఈఎల్ సూపర్ స్టార్ విభాగం లో చేరుస్తారని, ఆరు కోర్సులకి టాపర్ గా వచ్చిన తాను ఆ కేటగిరీకి అర్హత సాధించడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. అన్నికోర్సుల్లో 90శాతం మార్కులతో డిస్టింక్షన్ సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఊపిరి ఉన్నంతవరకు నా విద్యా ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుందని డాక్టర్ రామారెడ్డి పేర్కొంటూ డిగ్రీల్లో సెంచరీ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.
మాజీ ఎంపి జివి హర్షకుమార్ మాట్లాడుతూ సరస్వతీ పుత్రుడైన ఇలాంటి వ్యక్తి మన రాజమండ్రికి చెందడం మనందరికీ , ఊరికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. రామారెడ్డికి పద్మశ్రీ పురస్కారం రావాలని ఆకాంక్షించారు. డా గురు ప్రసాద్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి రామారెడ్డి విజయాలను చూసి ఎదిగానని , ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఉండడం అందరికీ గర్వకారణ మని పేర్కొన్నారు. ఈసారి తప్పకుండా పద్మశ్రీ రావాలని అయన ఆకాంక్షిం చారు. ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ జ్ఞానసంపన్నుడైన రామారెడ్డి మహాభారతంలో భీష్ముడి వంటివారని అభివర్ణించారు.