సిందూర్ సంబరాలేవీ?!

ఆపరేషన్ సిందూర్ లో భారతదేశం పూర్తిస్థాయి విజయం సాధించిందా?..ఒకవేళ సిందూర్ విజయవంతమైతే 1971 యుద్ధం, కార్గిల్ విజయాల నాటి విజయోత్సాహం భారతీయుల్లో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కార్గిల్…

 సిందూర్ సంబరాలేవీ?!

ఆపరేషన్ సిందూర్ లో భారతదేశం పూర్తిస్థాయి విజయం సాధించిందా?..ఒకవేళ సిందూర్ విజయవంతమైతే 1971 యుద్ధం, కార్గిల్ విజయాల నాటి విజయోత్సాహం భారతీయుల్లో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కార్గిల్ విజయదివస్ పేరిట ఇప్పటికీ బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుతారు. సిందూర్ తరువాత ఆపరిస్థితులు కనిపించకపోవడం విశేషం. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని భారతీయులంతా ఆలయాల్లో పూజలు జరిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా…సైనికులకు మద్దతుగా ర్యాలీలు తీశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ తో యుద్ధానికి దేశంలోని రాజకీయ, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. అయితే ఆపరేషన్ సిందూర్ ముగిసిన తరువాత మాత్రం విజయోత్సవాలు జరపకపోవడం గమనార్హం. పహల్గాం ఉగ్రదాడి తరువాత భారతదేశం తీవ్రంగా స్పందించి ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు సరిహద్దులకు ఆవల ఉన్న పాకిస్థాన్ లోకి కూడా భారతీయ సేనలు దూసుకెళ్లి ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేయడం భారతీయుల్లో చెప్పలేని సంతోషాన్ని కలిగించింది. అయితే పేదరికంతో కూనారిల్లుతున్న ఉగ్రదేశం పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధంగా లేదని, చేసిన తప్పుకు తేలుకుట్టిన దొంగలా కామ్ గా ఉంటుందని భావించారు. అందుకు విరుద్ధంగా పాకిస్థాన్ డ్రోన్లతో సరిహద్దు ప్రాంతాల్లో దాడికి దిగగా భారత్ సైనికులు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టారు. మరోవైపు పాకిస్థాన్ నక్కజిత్తులతో భారత్ కు ధీటైన జవాబు ఇచ్చామని సోషల్ మీడియాలో పోస్టులతో జెట్ ఫైటర్లు, డ్రోన్లను భారత కోటలు దాటించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ పూర్తిస్థాయి యుద్ధానికి సన్నద్ధమైంది.
భారతదేశంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్థాన్ కు గట్టి బుద్ధి చెబుతుందని, ఆదేశంలోని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ వంటి నగరాలను ధ్వంసం చేస్తుందని భావించారు. దీర్ఘకాలంగా భారతీయుల కలగా ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలని కూడా భారతీయులు కోరుకున్నారు. ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకులు కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ దేనని పదేపదే ప్రకటించడాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అయితే హఠాత్తుగా కాల్పుల విరమణకు అంగీకరించడం సగటు భారతీయులతో పాటు, కరుడుగట్టిన హిందుత్వ, బిజెపివాదులకు కూడా రుచించడం లేదు. కాల్పుల విరమణ వేళ మెజార్టీ భారతీయులు ఈవిషయమై అసంతృప్తిని ప్రకటించడం విశేషం.
అమెరికా జోక్యంతోనే భారత్-పాక్ ల మధ్య కాల్పుల విరమణ జరిగిందని, ఆదేశ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, సౌదీ అరేబియా వంటి దేశాల మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణ జరిగిందన్న వార్తలు కూడా వచ్చాయి. భారత్ మాత్రం ద్వైపాక్షికంగానే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. కాల్పుల విరమణ వెనుక ఎవరున్నారన్నది కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చలకు దారితీస్తోంది. కాల్పుల విరమణకు గల కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చిందా..ఆదేశంపై జాలి తలిచి వదిలేసిందా… లేక ఇతర దేశాల ఒత్తిడితో భారత్ ఈఒప్పందానికి అంగీకరించిందా అన్నది యుద్ధానికి మద్దతు ప్రకటించిన సగటు భారతీయుడికి అర్థం కాకుండా ఉంది.
మరోవైపు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కాల్పుల విరమణ తాము సాధించిన విజయంగా అభివర్ణించడం గమనార్హం. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే ఒప్పందానికి పాకిస్థాన్ తూట్లు పొడుస్తూ ఇప్పటికీ కాల్పులకు తెగబడటం భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఇప్పటికీ దాని బుద్ధి మారలేదన్నది స్పష్టమవుతోంది. భవిష్యత్ లో ఇంకెప్పుడూ ఉగ్రవాదాన్ని, మత వాదాన్ని ప్రోత్సహించకుండా భారత్ పాకిస్థాన్ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలని..తద్వారా భవిష్యత్ లో ఆపరేషన్ సిందూర్ ను కూడా విజయోత్సవాలకు చిహ్నంగా మార్చాలని భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply