- May 18, 2025
ఎపిలో కుంటుపడిన అభివృద్ధి….ఎందుకంటే….
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాజధాని అమరావతి నిర్మాణంతో సహా, రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి జోరందుకుందని కూటమి నాయకులు, ఎల్లో మీడియా గొప్పగా…

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాజధాని అమరావతి నిర్మాణంతో సహా, రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి జోరందుకుందని కూటమి నాయకులు, ఎల్లో మీడియా గొప్పగా ప్రచారం చేస్తున్నారు. కానీ సొంత ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నది బిల్డర్లు, లైసెన్సుడు సర్వేయర్లు చెబుతున్న మాట. సాధారణంగా వేసవి కాలంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వంటి కారణాల వల్ల భవన నిర్మాణాలు జోరుగా సాగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. భారీ భవనాలు, అపార్ట్ మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి కానీ…ప్రజలు సొంత భవనాలను, గ్రూపు హౌసింగ్ ల నిర్మాణం కుంటుపడింది. అప్పులు, బ్యాంకు రుణాలు తెచ్చుకుని ఇళ్లు నిర్మించుకోవాలనుకున్న మధ్య తరగతి ప్రజల ఆశలు నెరవేరడం లేదు. గత మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాల్లో ఇళ్లు, భవన నిర్మాణాల ప్లాన్ల ఆమోదం కోసం నెలకు వేలాది సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి. గత మూడు నెలలుగా ఈసంఖ్య పదుల సంఖ్యకు పరిమితమైంది. దీనికికంతటకీ జిఓ 20యే కారణమని చెబుతున్నారు.
ఈజిఓ ప్రకారం ఇళ్లు, భవన నిర్మాణాలు ప్లాన్లకు విరుద్ధంగా జరిగితే అందుకు లైసెన్సుడు సర్వేయర్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎవరైనా లైసెన్సుడు సర్వేయర్ ఇంటి ప్లాను కోసం దరఖాస్తు చేస్తే పునాది నుంచి పై కప్పు వరకు దశల వారీగా ఫొటోలు తీసి నిర్ధేశిత పోర్టల్ లో అప్ లోడు చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు నిర్మాణం పూర్తయ్యే వరకు లైసెన్సుడు సర్వేయర్లే పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమోదించిన ప్లానుకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగితే అందుకు లైసెన్సుడు సర్వేయర్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకు గాను ఐదేళ్ల పాటు సర్వేయర్ లైసెన్సును రద్దు చేయడంతో పాటు, భారతీయ న్యాయసంహిత చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే జిఓ 20ని సర్వేయర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేసులు, లైసెన్సుల రద్దు భయంతో ఇళ్లు, భవన నిర్మాణాలకు ప్లాన్లు దరఖాస్తు చేయడం మానుకున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఇళ్లు, నిర్మాణాలు దాదాపు స్తంభించిపోయాయి. వేల సంఖ్యలో వచ్చే దరఖాస్తులు పదుల సంఖ్యకు పరిమితమయ్యాయి. అయితే 300 చదరపు గజాలు దాటిన, ఐదంస్తులకు పైబడి నిర్మాణాలకు కొత్త నిబంధనలు వర్తింపజేయకపోవడంతో భారీ భవనాలు, అపార్ట్ మెంట్ల నిర్మాణానికి ఇబ్బందులు లేవని చెబుతున్నారు. జిఓ 20లోని లైసెన్సు రద్దు, క్రిమినల్ కేసుల వంటి నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కొంతమంది లైసెన్సుడు సర్వేయర్లు కోర్టులను కూడా ఆశ్రయించారు. ప్లాన్ల అనుమతి వరకు మాత్రమే తమ పని అని, భవన యజమానులు ఇష్టానురీతిలో నిర్మాణాలు చేపడితే తమను బాధ్యులను చేయడం ఎంతవరకు సబబని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారుల వాదన వేరుగా ఉంది. అనుమతి పొందిన ప్లాన్లకు అనుగుణంగా నిర్మాణాలు జరిపితే సర్వేయర్లకు ఎందుకు ఇబ్బందులు వస్తాయని, వారే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని టౌన్ ప్లానింగ్ అధికారులు చెబుతున్నారు. మొన్నటి వరకు సర్వేయర్ల ప్రోత్సాహం…టౌన్ ప్లానింగ్ అధికారుల అండతోనే అక్రమ నిర్మాణాలు జరిగాయన్నది వాస్తవం. ఈవిషయంలో నేడు పూర్తిస్థాయిలో సర్వేయర్లనే బాధ్యులను చేయడం ఎంతవరకు సబబు అన్న వాదన వినిపిస్తోంది.