పుష్ప ది కాంట్రవర్సీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ మూడేళ్ల క్రితం పెద్దగా హడావుడి లేకుండా విడుదలై దేశవ్యాప్తంగా కలెక్షన్ల మోత మోగించింది. ఆతరువాత సినీ,…

 పుష్ప ది  కాంట్రవర్సీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ మూడేళ్ల క్రితం పెద్దగా హడావుడి లేకుండా విడుదలై దేశవ్యాప్తంగా కలెక్షన్ల మోత మోగించింది. ఆతరువాత సినీ, రాజకీయ పరిణామాలు మారిపోవడంతో మూడేళ్లలో అనూహ్య మార్పులు సంభవించాయి. అదే పుష్ప-2(రూల్) సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. గత సార్వత్రిక ఎన్నికల్లో తన మామయ్య, జనసేనాని పవన్ కల్యాణ్ తెలుగుదేశం, బిజెపితో కూటమి కట్టి వైసిపి ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధం కాగా, అటు వైపు కూడా చూడని  అల్లు అర్జున్ ప్రత్యర్థి పార్టీకి చెందిన తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా నంద్యాలలో ప్రచారం చేయడం కూటమి నేతలకు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు కోపం తెప్పించింది. ఆ ప్రభావం పుష్ప-2పై పడింది. దాని పర్యవసానమే పుష్ప-2 అస్సలు బాగోలేదని,  ఫ్లాప్ అయ్యిందన్న ప్రచారం. ధియేటర్లలో జనాలే లేరని మెగాస్టార్ అభిమానులు, కూటమి కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఒక దశలో మెగాస్టార్ అభిమానులు ఈసినిమా చూడకపోవడం వల్లే ఫ్లాప్ అయ్యిందన్న ప్రచారాన్ని సాగించారు. ఈసినిమాలో అల్లు అర్జున్ చెప్పిన ఎవడ్రా బాసు…నేనే అందరికీ బాస్ అన్న డైలాగ్ ను కూడా మెగాస్టార్ కు వ్యతిరేకంగా చెప్పారని సూత్రీకరించారు.  పుష్ప దర్శకుడు సుకుమార్, నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిసినప్పుడు కూడా అల్లు అర్జున్ దూరంగా ఉన్నారు. దీంతో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య ఏదో జరిగిందన్న ప్రచారం జోరందుకుంది.  అదే సమయంలో సినిమా ప్రివ్యూ సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య ధియేటర్ వద్ద ఒక మహిళా అభిమాని తొక్కిసలాటలో మృతి చెందడంతో పుష్ప సినిమా మరిన్ని చిక్కుల్లో పడింది.  ఈసంఘటనపై అల్లు అర్జున్ తో పాటు, ఆయన సెక్యూరిటీపై కేసు నమోదు చేయగా, ఈకేసులో ఇద్దరిని తెలంగాణా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధిక ధరలకు బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అనుమతివ్వడంతో  టిక్కెట్ ధరలపై కూడా సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం నడిచింది. తాజాగా ఈసినిమాలో ఇనస్పెక్టర్ షెకావత్ పాత్ర ద్వారా క్షత్రియ సామాజిక వర్గాన్ని కించపరిచారంటూ, చిత్రంలో ఆపేరును తొలగించాలని  రాజ్ పుట్ సామాజికవర్గం నిర్మాతలను డిమాండ్ చేస్తోంది. సహజంగానే శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లు పుష్ప ప్రచార బాధ్యతలను వైసిపి నాయకులు, నీలి మీడియా ప్రతినిధులు భుజాన వేసుకున్నారు. వివాదాలకు ముగింపా అన్నట్లు అల్లు అర్జున్ ఇటీవలే సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ పుష్ప సినిమా విడుదలకు, బెన్ ఫిట్ షోకు సహకరించిన తెలంగాణా, ఆంధ్రా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేకంగా బాబాయ్ పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు అని వ్యాఖ్యానించడంతో ప్రత్యర్థి పక్షం కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. అయితే ఈవివాదాలేవీ పుష్ప సినిమాపై ప్రభావం చూపించలేదన్నది కలెక్షన్లను బట్టి తెలుస్తోంది. పుష్ప విడుదలైన ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 900కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

Leave a Reply