ఉన్నది ఉన్నట్టు….క్రెడిట్ కోసం పట్టు!

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎపి కేబినెట్ తీర్మానించింది. ఈవిషయంలో ఘనత తనదంటే తనదంటూ తెలుగుదేశం పార్టీలో ప్రత్యర్థులుగా కొనసాగుతున్న…

 ఉన్నది ఉన్నట్టు….క్రెడిట్ కోసం పట్టు!

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎపి కేబినెట్ తీర్మానించింది. ఈవిషయంలో ఘనత తనదంటే తనదంటూ తెలుగుదేశం పార్టీలో ప్రత్యర్థులుగా కొనసాగుతున్న సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పరస్పరం పోటీ పడటం హాస్యాస్పద చర్చకు దారితీస్తోంది. తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరంలోనే కొనసాగించాలని కేబినెట్ తీర్మానించినట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఆ వెంటనే వాసు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, రాజమహేంద్రవరానికి తెలుగు విశ్వవిద్యాలయాన్ని సాధించిన ఘనత తనదేనంటూ ప్రకటించుకున్నారు. 2024లో హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణా విద్యార్థుల ప్రవేశాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారని, దీంతో తాను యువనేత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి విశ్వవిద్యాలయం అస్థిత్వతంపై ఆందోళన వ్యక్తం చేసి, పరిస్థితిని వివరించి, వినతిపత్రాన్ని కూడా సమర్పించినట్లు చెప్పుకొచ్చారు. తన విజ్ఞప్తికి స్పందనగానే తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటైందని చెప్పారు. దీంతో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని బొమ్మూరులో ఉన్న తెలుగువిశ్వవిద్యాలయం ఘనత వాసు ఖాతాలో చేరుతుందేమోనన్న ఉద్దేశంతో అమెరికాలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అక్కడి నుంచే ఆగమేఘాల మీద ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని తాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యా, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ లను కలిసి పలుసార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
అయితే ఈవిషయంలో ప్రభుత్వం గానీ, ఘనత కోసం పోటీపడుతున్న ఎమ్మెల్యేలుగా గానీ సాధించింది ఏమీ లేదని చరిత్ర తెలిసిన వారు ఎద్దేవా చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని తెలుగు సాహిత్య పీఠాన్ని ప్రధాన కేంద్రంగా మార్చారంతేనని విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి జాబితాలో ఉన్న సంస్థలు, ఆస్తులను 10వ షెడ్యూల్ లో చేర్చారు. తెలుగు విశ్వవిద్యాలయం కూడా అదే జాబితాలో ఉంది. 10వ షెడ్యూల్ లోని ఆస్తుల పంపకంపై తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రాల మధ్య పంచాయితీ ఇప్పటికీ తేలలేదు. తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు కాగా, రాజమహేంద్రవరం సహా ఉభయ రాష్ట్రాల్లో చోట్ల ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తరువాత సాహిత్య పీఠం అస్థిత్వంపై ఆందోళన వ్యక్తమైంది. ప్రవేశాలు నిలిచిపోయాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగువిశ్వద్యాలయ ఆస్తులను పట్టాలుగా పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సహా తెలుగు భాషాభిమానులు, రాజకీయ నేతలు జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో 10వ షెడ్యూల్ లోని ఆస్తుల పంపకాన్ని తేల్చాల్సి ఉంది. దీనిలో భాగంగానే తెలుగు విశ్వవిద్యాలయాన్ని సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. అంతే తప్ప ఎక్కడో ఉన్న లేదా ఎక్కడికో తరలిపోతున్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరానికి రప్పించేందుకు ప్రజాప్రనిధులు చేసిందేమీ లేదని తెలుగు భాషాభిమానులు, చరిత్ర తెలిసిన వారు విమర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే ప్రవేశాలను పునరుద్ధరించి, తెలుగుభాష, సంస్కృతి పరిరక్షణకు అవసరమైన కోర్సులు ప్రవేశపెట్టి, విద్యార్థులకు అవసరమైన మరిన్ని వసతులు కల్పించి, తెలుగు విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

Leave a Reply