నటనలో ఎస్వీఆర్ కు సాటిరారెవరూ…

తనదైన ఆంగికం..వాచకంతో తెలుగుతెరకు నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన సామర్ల వెంకట రంగారావు అనే ఎస్వీ రంగారావు తెలుగు చిత్రసీమలో చెరగని ముద్రవేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నటులనే…

 నటనలో ఎస్వీఆర్ కు సాటిరారెవరూ…

తనదైన ఆంగికం..వాచకంతో తెలుగుతెరకు నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన సామర్ల వెంకట రంగారావు అనే ఎస్వీ రంగారావు తెలుగు చిత్రసీమలో చెరగని ముద్రవేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నటులనే తన పాత్రాభినయంతో ఢీకొట్టి, ఔరా అనిపించారు. పౌరాణిక ప్రతినాయక పాత్రల్లో ఎన్టీ రామారావుకు ధీటుగా నటించి, మెప్పించారు. అలాగే కళ్లు చెమర్చే విషాదకర పాత్రల్లో కూడా ఆయన జీవించారు. కొన్ని పాత్రల్లో ఎస్వీ రంగారావు తప్ప మరో నటుడ్ని ఊహించుకోలేని విధంగా నటనా ప్రతిభను కనపరిచారు. ఎస్వీ రంగారావు కృష్ణా జిల్లా లోని నూజివీడులో, 1918 జూలై 3 వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించారు. రంగారావు కొద్ది రోజులు మద్రాసులోనూ, తర్వాత ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో వేషాలు వేసేవారు. 1936 లో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాలలో రంగారావు బళ్ళారి రాఘవ, గోవిందరాజు సుబ్బారావు లాంటి ప్రఖ్యాత నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నారు. కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. అక్కడ అంజలీదేవి, రేలంగి, ఆదినారాయణరావు, వంటి వారితో పరిచయం ఏర్పడింది.
చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించారు. రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలలోనే కాక, అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశారు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల వంటి చిత్రాలు ఆయన నటనా ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు పొందడం విశేషం. ఆయన నటనకు మెచ్చి ప్రేక్షకులు విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ వంటి బిరుదులు ఇచ్చారు.
ఎస్.వి.రంగారావు నటుడిగానే కాక కథా రచయితగా కూడా రాణించారు. ఆయన కథలు ఆంధ్రపత్రిక, యువ, మనభూమి వంటి పత్రికలలో 1960-64 మధ్యకాలంలో ప్రచురింపబడ్డాయి. ఈ కథలతో ఎస్.వి.రంగారావు కథలు అనే పుస్తకం వెలువడింది.
సహృదయుడైన యస్వీఆర్ ఒకరకంగా వేదాంతి. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. తానే స్వయంగా కొన్ని రచనలు కూడా చేశారు. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చారు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు. తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చారు. పెంపుడు జంతువులంటే రంగారావుకు ఎంతో ఇష్టం. ఆయన ఇంటిలో జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన రెండు కుక్కలుండేవి. వేట అంటే కూడా ఆసక్తి ఉండేది. కానీ కొద్దికాలం తర్వాత ఆ అలవాటు మానేశారు. రంగారావు నటించిన బంగారుపాపలో రంగారావు నటనను చూసిన ప్రఖ్యాత హాస్యనటుడు చార్లీ చాప్లిన్ ఈచిత్రం మూల కథను అందించిన ఇలియట్ బతికుంటే ఎంతో సంతోషించేవారని వ్యాఖ్యానించడం విశేషం. రంగారావు మన దేశంలో పుట్టడం మన అదృష్టం. కానీ ఆయనకు దురదృష్టం. ఆయన ఏ పశ్చిమ దేశాల్లోనో జన్మించి ఉంటే ప్రపంచంలోని ఐదుమంది ఉత్తమ నటుల్లో ఒకడయ్యుండే వారు అని ప్రముఖ నటుడు గుమ్మడి కితాబునిచ్చారు.
రంగారావు శతజయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధ్యక్షతన 2018 జూలై 3లో హైదరాబాదులో జరిగాయి. 2018 జూలై 3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ సందర్భంగా ఎస్వీ రంగారావు పేరిట ప్రభుత్వం తపాళా బిళ్లను విడుదల చేసింది.
1974 ఫిబ్రవరిలో హైదరాబాదులో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు ఆరోగ్యవంతుడై తిరిగి ఇంటికి చేరుకున్నారు. వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు. నటుడిగా చక్రవాకం యశోద కృష్ణ ఆయన చివరి చిత్రాలు. యశోద కృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళాలనుకున్నారు. కానీ ఈ లోపే 1974 జూలై 18వ తేదీన మద్రాసులో మళ్ళీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశారు. ఇప్పటి వరకు ఎస్వీఆర్ లాంటి నటుడు చిత్రసీమకు రాలేదు…వస్తారనే ఆశ కూడా లేదు. ఆయన నటన శిఖరాయమానం….ఎస్వీఆర్ జయంతి వేడుకలను రాజమహేంద్రవరం గోదావరిగట్టున ఉన్న ఆయన కాంస్య విగ్రహం వద్ద ప్రతీ ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు, చిరంజీవి అభిమానులు, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈవేడుకల్లో పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, చిరంజీవి, ఎస్వీఆర్ అభిమానులు హాజరవుతారు.

ఎస్వీఆర్ జయంతి సందర్భంగా…..

Leave a Reply