- October 19, 2024
రాజకీయాల నుంచి గోరంట్ల నిష్క్రమణ!…రాజకీయ వారసులెవరూ లేరట!
సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజకీయాల నుంచి స్వచ్చందంగా నిష్క్రమించనున్నారు. 2024 ఎన్నికల్లోనే పోటీకి దూరంగా ఉండాలని భావించినా అధికార వైసిపిపై అలుపెరగని పోరాటం చేసిన ఆయన…
సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజకీయాల నుంచి స్వచ్చందంగా నిష్క్రమించనున్నారు. 2024 ఎన్నికల్లోనే పోటీకి దూరంగా ఉండాలని భావించినా అధికార వైసిపిపై అలుపెరగని పోరాటం చేసిన ఆయన చివరి దశలోనైనా మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతో పట్టుపట్టి మరీ రాజమహేంద్రవరం రూరల్ నుంచి పోటీ చేసి, గెలిచారు. అయితే మంత్రి పదవి దక్కకపోవడంతో నిరాశ చెందారు. ఇటీవల సిసిసి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గత ఎన్నికల్లోనే పోటీ చేయరాదని భావించానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. తనకు రాజకీయ వారసులెవరూ లేరని, తన సోదరుడి కుమారుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ వైద్యవృత్తిలో బిజీగా ఉండటంతో పాటు, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు ద్వారా సామాజిక సేవల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారని, అయితే రవిరామ్ తన ఆశయాలకే తప్ప రాజకీయాలకు వారసుడు కాదని స్పష్టం చేశారు.
రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది ఆయన ఇష్టమని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి రాకపోవడంపై స్పందిస్తూ ప్రతిపక్షంలో ఉండగా దయ్యం లాంటి వైసిపి ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశానని, మంత్రి పదవి లభిస్తుందని తాను, తనతో పాటు, అభిమానులు ఆశించామన్నారు. తనకు మంత్రి పదవి రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందారన్నారు. తాను మాత్రం బాధపడటం లేదన్నారు. జనసేన, బిజెపితో పొత్తులు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో తనకు పదవి దక్కలేదని విశ్లేషించారు.