వీరీ వీరీ గుమ్మడిపండు వీరి భవిష్యత్ ఏమిటీ?!

  సార్వత్రిక ఎన్నికల తరువాత కొంతమంది ప్రతిపక్ష వైసిపి, కూటమి నేతల భవిష్యత్ ఏమిటన్నది అంతుబట్టకుండా ఉంది. వారికి కోరుకున్న నామినేటెడ్, కనీసం పార్టీ పదవులైనా దక్కుతాయా……

 వీరీ వీరీ గుమ్మడిపండు వీరి భవిష్యత్ ఏమిటీ?!

 

సార్వత్రిక ఎన్నికల తరువాత కొంతమంది ప్రతిపక్ష వైసిపి, కూటమి నేతల భవిష్యత్ ఏమిటన్నది అంతుబట్టకుండా ఉంది. వారికి కోరుకున్న నామినేటెడ్, కనీసం పార్టీ పదవులైనా దక్కుతాయా… పార్టీలు మారే ఆలోచనలో ఉన్నారా  అన్నది చర్చనీయాంశంగా మారింది. నామినేటెడ్ పదవుల జాబితా సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. 80శాతం తెలుగుదేశం, 20 శాతం జనసేన, బిజెపి నాయకులకు నామినేటెడ్ పదవులు కల్పిస్తామని తెలిపారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నామినేటెడ్ పదవుల జాబితాను ఇప్పటికే అధిష్టానానికి పంపినట్లు చెప్పారు. అయితే కొంతమందికి ఇసుక, మద్యం వ్యాపారాల్లో ఇప్పటికే ప్రయోజనం చేకూరుతోంది. అటు పదవి, ఇటు వ్యాపారం లేని వారి పరిస్థతి ఏమిటన్నది ప్రశ్నార్థకం.

 

రాజమహేంద్రవరంనకు చెందిన వైఎస్సార్ సిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మొన్నటి వరకు రుడా చైర్మన్ గా పనిచేసిన రౌతు సూర్యప్రకాశరావు భరత్ వర్గంలో చేరగానే ఆయనకు రుడా చైర్మన్ పదవి దక్కింది. తరువాత వచ్చిన ఎన్నికల్లో రౌతు భరత్ కు మద్దతుగా గట్టిగానే పనిచేశారు. ఇటీవల ప్రకటించిన పార్టీ పదవుల్లో రౌతుకు ఏ పదవీ దక్కలేదు. అయినా ఆయన ప్రజల్లో చురుగ్గానే తిరుగుతున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది రౌతు వర్గీయులతో పాటు, కార్యకర్తల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

మాజీ ఎంపి భరత్ కు రాజకీయంగా బద్ధశత్రువైన ఎపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యంను సిటీ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పించాక క్రియాశీలక రాజకీయాలకు దూరమై…వ్యాపారాల్లో బిజీగా మారిపోయారు. ఎన్నికలకు ముందు వరకు స్తబ్దుగా ఉన్న శివరామసుబ్రహ్మణ్యం ఎన్నికల సమయంలో   రాజమహేంద్రవరం మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో వైశ్యులతో సమావేశాలు నిర్వహించి, వైసిపికి మద్దతుగా ప్రచారం చేశారు. ఎన్నికల తరువాత మళ్లీ వ్యాపారాల్లో బిజీ అయిపోయారు. వైసిపిలో ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదు. మరోవైపు ఆయన వర్గీయులు ఆయనను ఎమ్మెల్యేగా చూడాలని ఆశపడుతున్నారు. ఇందుకోసం ఆయన అనుసరించే రాజకీయ వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. అధికారం కోల్పోయిన వైసిపిలోనే కొనసాగుతారా? లేక పార్టీ మారే అలోచనలో ఉన్నారా అన్నది అంతుబట్టకుండా ఉంది.

ఇక తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమి నాయకులు నామినేటెడ్ పదవులపై ఆశలుపెట్టుకున్నారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎంపి, ఎమ్మెల్యే సీట్ల కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన నామినేటెడ్ లేదా రాజ్యాంగబద్ధ పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆయన శిష్యుడు బిజెపి జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు మేయర్ లేదా రుడా చైర్మన్ స్థాయి పదవులపై ఆశలు పెట్టుకున్నట్ల ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఎమ్మెల్యే, మేయర్, ఎమ్మెల్సీ  పదవులకు పోటీ పడిన టిడిపి నాయకుడు యర్రా వేణుగోపాలరాయుడు ఇటీవల ప్రకటించిన రాష్ట్రస్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ పదవితో సరిపెట్టుకోవాల్సి రావచ్చు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు నాటి నుంచి కనీసం పంచాయితీ కూడా ఎన్నిక కాలేకపోయావని దెప్పిపొడిపించుకున్న దాదాపు 70ఏళ్లకు పైగా వయస్సున్న గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ కనీసం ఒక్కసారైనా చట్టసభలోకి అడుగుపెట్టాలని ఆశించినా కనుచూపుమేరలో ఆ అవకాశం కనిపించడం లేదు. ఈనేపథ్యంలో ఆయన మేయర్ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. మరోవైపు కూటమి భాగస్వామి అయిన జనసేన నగర ఇన్చార్జి అత్తి సత్యనారాయణ కూడా మేయర్ గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. రుడా చైర్మన్ పదవి ప్రస్తుతం ఖాళీగానే ఉంది. ఈపదవి కూటమికి చెందిన ఏ నేతకు దక్కుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. కూటమిలోని  చిన్నా చితకా నాయకులు కూడా పదవుల కోసం తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. వీరంతా ఇప్పడు పదవులు దక్కించుకోలేకపోతే మరో నాలుగేళ్ల పాటు వేచిచూడాల్సిందే.

 

Leave a Reply