తల్లీ..చెల్లిపై జగన్ కేసు వెనుక ఇదా కథ?!

తల్లీ..చెల్లిపై జగన్ కేసు వెనుక ఇదా కథ?!   మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ బహుమతిగా రాసిచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకుంటూ  తన తల్లి,…

 తల్లీ..చెల్లిపై జగన్ కేసు వెనుక ఇదా కథ?!

తల్లీ..చెల్లిపై జగన్ కేసు వెనుక ఇదా కథ?!

 

మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ బహుమతిగా రాసిచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకుంటూ  తన తల్లి, చెల్లిపైనే జాతీయ లా ట్రిబ్యునల్ లో కేసు వేశారని ఎల్లో మీడియా పత్రికలు కోడై కూశాయి. అదే వార్త ఆయనకు చెందిన నీలి పత్రికలో అసలు రానేలేదు. జగన్ కు, ఆయన తల్లీ విజయలక్ష్మి, చెల్లి, ప్రస్తుతం పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు మధ్య ఆస్తుల పంచాయితీ ఎప్పటి నుంచో నడుస్తోంది. ఆస్తుల పంపకంలో తేడాల వల్లే  వారు దూరమయ్యారని, చెల్లి ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా మారారన్న ప్రచారం కూడా ఉంది.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే జగన్, షర్మిల మధ్య కొన్ని ఆస్తులు పంపకాలు పూర్తయ్యాయని, కొన్ని పెండింగ్ లో ఉన్నాయని చెబుతారు. తన చెల్లిపై ఉన్న ప్రేమ, అనుబంధంతో సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో 49శాతం వాటాలను  రాసిచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. నేరుగా తన చెల్లికి ఆస్తులు బదలాయించేందుకు చట్టపరంగా అవకాశం లేకపోవడంతో 2019లో తన తల్లి పేరిట గిఫ్ట్ డీడ్ రాసినట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులు తేలిన తరువాత ఆస్తులు బదిలీ చేస్తానని జగన్ తన చెల్లికి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ గిఫ్ట్ డీడ్ నే రద్దు చేయాలని జగన్ ఎన్ఎల్ సిటిని ఆశ్రయించారు. సరస్వతీ సంస్థల్లో అప్పటికే  ఇందులో ఆయన తల్లి విజయమ్మకు 1శాతం వాటా ఉంది. అయితే అక్రమాస్తుల కేసులో భాగంగా ఈఆస్తులు సిబిఐ, ఈడి అటాచ్ మెంట్ లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈకేసులు విచారణ దశలో ఉన్నాయి. కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులను పంచుకోవడం కుదరదు.

ఈనేపథ్యంలో 2021లో సరస్వతీ పవర్‌లో జగన్‌ తన తల్లి పేరిట ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను ఆధారంగా చేసుకుని షర్మిల ఆస్తులను తన పేరిట రాయించుకున్నారని తెలుస్తోంది. కోర్టు విచారణలో ఉన్న ఆస్తులను పంచుకోవడం వల్ల న్యాయపరంగా ఇబ్బందులు తెచ్చిపెడుతుందన్న న్యాయవాదుల హెచ్చరికల నేపథ్యంలో తాజాగా వాటిని రద్దు చేయాలని జగన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించినట్లు సమాచారం. చట్టవిరుద్ధంగా జరిగిన షేర్ల లావాదేవీల వల్ల న్యాయపరంగా చిక్కులు ఎదురవడటంతో పాటు, ఈకేసుల్లో తన బెయిల్ కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ జగన్ తల్లికి, చెల్లికి లేఖ రాశారు. దీనిపై చర్చించేందుకే ఇటీవల బెంగుళూరులో సమావేశం అయినట్లు తెలుస్తోంది. దీనిపై వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే ఎన్ ఎల్ సి టిని ఆశ్రయించినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా వైఎస్సార్ కుటుంబంలో నెలకొన్న ఆస్తుల వివాదం రాజకీయంగా ప్రత్యర్థులకు మేలు చేసేలా కనిపిస్తోంది.

 

 

 

 

 

 

Leave a Reply