• October 25, 2024

వైద్య నారాయణుడికి వందనం…కానీ…!

వైద్యో నారాయణో హరి అన్న నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ తేతలి వెంకటేశ్వరరావు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంతో మంది పేదలకు ప్రాణదానం చేసి…వైద్యరంగంలో వందలాది మందిని…

 వైద్య నారాయణుడికి వందనం…కానీ…!

వైద్యో నారాయణో హరి అన్న నిర్వచనానికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ తేతలి వెంకటేశ్వరరావు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంతో మంది పేదలకు ప్రాణదానం చేసి…వైద్యరంగంలో వందలాది మందిని నిపుణులుగా తీర్చిదిద్దిన నిజమైన ప్రజావైద్యుడు తేతలి వెంకటేశ్వరరావుకు కడపటి వీడ్కోలు జరిగిన తీరు విచారకరం. మంగళవారం రాత్రి ఆయన కన్నుమూశారు. బుధవారం  జరిగిన ఆయన అంత్యక్రియలకు వేళ్ల మీద లెక్కించే సంఖ్యలో వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. మాజీ ఎంపి జివి హర్షకుమార్, ఒకరో ఇద్దరో వైద్యులు, ఆయనతో వ్యక్తిగత అనుబంధం ఉన్న పాత్రికేయులు మినహా పెద్దగా ఎవరూ వెంకటేశ్వరరావు అంత్యక్రియల్లో పాల్గొనకపోవడం నేటి మానవ సంబంధాలు, విలువలకు అద్దం పడుతోంది. ఆయన  తీర్చిదిద్దన వైద్యులు, మెడికల్ కళాశాలల యాజమాన్య ప్రతినిధులు, ఐఎంఏ ప్రతినిధులు,  వైద్య వ్యాపారాల్లో బిజీగా ఉండి గురువుకు అంతిమ వీడ్కోలు పలికే కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం సందేశాలు పెట్టి సరిపెట్టారు. వైద్యులకు గురువు, పేదల పాలిటి దేవుడు వంటి తేతలి వెంకటేశ్వరరావును ఈస్థాయిలో గౌరవించడం సమంజసమేనా అన్న చర్చ జరుగుతోంది.

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ గా, ఆంద్ర ప్రదేశ్ వైద్యవిధానపరిషత్ ఉమ్మడి తూర్పు గోదావరిజిల్లా వైద్యసేవల సమన్వయ అధికారిగా సేవలందించిన  డాక్టర్ తేతలి వెంకటేశ్వరరావు జిల్లాలో వైద్యరంగం అభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. ఆపరేషన్లు చేయడంలో ఆయన చేయితిరిగిన వైద్యుడు. పాలనాపనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఎంతో చులగ్గా రోజుకు పదుల సంఖ్యలో ఆపరేషన్లు ఇట్టే చేసేవారు. 79 సంవత్సరాల వెంకటేశ్వరరావు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.  పుట్టిన ఊరంటే ఆయనకు మక్కువ ఎక్కువ. అందుకే తాడేపల్లిగూడెంనకు చెందిన ఆంధ్రభూమి ఫొటోగ్రాఫర్ దివంగత శ్రీహరిని ఎంతో ఆప్యాయంగా పలకరించి, వైద్యసేవలు అందించేవారు. ప్రతి బుధవారం తాడేపల్లిగూడెంలోని తన నివాసంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించేవారు. నేడు వైద్యవృత్తి వ్యాపారాత్మకంగా మారింది. ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తూనే ప్రైవేటు ప్రాక్టీసు వైపే వైద్యులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తేతలి వెంకటేశ్వరరావు సూపరింటెండెంట్ గా పదవీ విరమణ చేసిన తరువాతే నామమాత్రపు ఫీజుతో గాయత్రీ క్లీనిక్ పేరిట ప్రైవేటు ప్రాక్టీసును ప్రారంభించారు. అక్కడే పేదల కోసం ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించేవారు.

కర్నూలు వైద్యకళాశాలలో ఉన్నత  విద్య నభ్యసించిన ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాసుపత్రిలో సివిల్ సర్జన్ గా సేవలు ప్రారంభించి తణుకు,కొయ్యలగూడెం ,కాకినాడ ఆసుపత్రులలో వైద్యుడిగా పనిచేసి వేలాదిమంది పేదలకు వైద్యసేవలు అందించారు.కాకినాడ లోని రంగరాయ ప్రభుత్వ మెడికల్ కళాశాల లో ప్రొఫెసర్ గా పనిచేసి న డాక్టర్ తేతలి అనేక మంది వైద్యులను తీర్చిదిద్దారు. జిల్లాలోని పేరెన్నికగన్న వైద్య కళాశాలల్లో కూడా ఔత్సాహిక వైద్యులకు  ఆయన శిక్షణ ఇచ్చారు. వైద్య, పాలనా పనుల్లో ఎంత బిజీగా ఉన్నా అందరితో ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ అజాత శత్రువుగా పేరొందారు.

Leave a Reply