- October 26, 2024
తూర్పుగోదావరి జిల్లాలో కొత్త టూరిజం ప్యాకేజీకి శ్రీకారం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆరు ప్రముఖ పుణ్య క్షేత్రములను కలుపుతూ ఒకరోజు పుణ్యక్షేత్రాల దర్శనయాత్ర బస్సును పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లాలోని…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆరు ప్రముఖ పుణ్య క్షేత్రములను కలుపుతూ ఒకరోజు పుణ్యక్షేత్రాల దర్శనయాత్ర బస్సును పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లాలోని ప్రజాప్రతినిధులు శనివారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ప్రతీ శనివారం ఉదయం కోరుకొండ – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, అన్నవరం – శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం , సామర్లకోట – శ్రీ కుమార భీమేశ్వర స్వామి వారి దేవస్థానం , ద్రాక్షారామం – శ్రీ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం , వాడపల్లి – శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, చివరగా రాజమహేంద్రవరం పుష్కరాలరేవు వద్ద జరిగే గోదావరి హారతి సందర్శనకు ఈబస్సును ఏర్పాటు చేశారు. పెద్ద లకు వెయ్యి, 10ఏళ్ల లోపు పిల్లలకు 800 టిక్కెట్ గా నిర్ణయించారు. తొలిరోజున 20 మందితో బస్సు బయలుదేరింది. ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర టూరిజం బోర్డ్ సభ్యులు గంటా స్వరూప దేవి, కూటమి నాయకులు, టూరిజం ఆర్డీ వి స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ ఈయాత్రను ఆదివారం కూడా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధ్యాత్మిక పర్యాటక యాత్రలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త టూరిజం పాలసీ అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. ఇప్పటికే కొత్త టూరిజం పాలసీకి సంబంధించిన కార్యాచరణ సిద్దం చేశామని పేర్కొన్నారు. అటవీశాఖ, దేవదాయ శాఖ, పర్యాటక శాఖల సమన్వయంతో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, దీనిలో భాగంగా ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైందని పేర్కొన్నారు.