సీజ్ ది షిప్ కాదు….అసలు స్కీమ్ నే సీజ్ చేస్తే……?
నిజంగా షిప్ సీజైందో లేదో కానీ…జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినీఫక్కీలో ది షిప్ అంటూ చేసిన వ్యాఖ్యలపై మూడు రోజులుగా రాష్ట్రంలో చౌక బియ్యంపై…
నిజంగా షిప్ సీజైందో లేదో కానీ…జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినీఫక్కీలో ది షిప్ అంటూ చేసిన వ్యాఖ్యలపై మూడు రోజులుగా రాష్ట్రంలో చౌక బియ్యంపై చౌకబారు రాజకీయాలు జరుగుతున్నాయి. అయితే ఇది బుమరాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాకినాడ పోర్టు నుంచి స్టెల్లా నౌకలో పశ్చిమాఫ్రికాకు అక్రమంగా తరలి వెళుతున్న చౌక బియ్యాన్ని కాకినాడ కలెక్టర్ సీజ్ చేయడం…ఆతరువాత జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నౌకను పరిశీలించి, సీజ్ ది షిప్ అనడం తెలిసిందే. ఆపక్కనే ఉన్న కెన్ స్టార్ నౌకలో ఎపి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడికి చెందిన పట్టాభి ఆగ్రో సంస్థ ద్వారా అక్రమంగా ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యాన్ని ఎందుకు సీజ్ చేయలేదని వైసిపి నాయకులు నిలదీస్తున్నారు. అలాగే ఈవ్యవహారంపై పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీకి సంబంధించి అధికారిక వార్తలేవీ విడుదల కాలేదు. చీమ చిటుక్కుమన్నా వార్తలు రాసే ఎల్లో మీడియా కెన్ స్టార్ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం కూడా గమనార్హం. కూటమి అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటింది. కాకినాడలో కలెక్టర్ సహా అధికారులంతా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బదిలీపై వచ్చినా వారే. పౌరసరఫరాల శాఖ మంత్రి, రూరల్ ఎమ్మెల్యేలు జనసేన పార్టీకి చెందిన వారు కాగా, కాకినాడ ఎమ్మెల్యే టిడిపికి చెందిన వారు. ఇప్పటికీ అక్రమంగా బియ్యం తరలిపోతున్నాయంటే ఇది కూటమి ప్రభుత్వం అసమర్థతా లేకా…కుమ్మక్కు వ్యాపారాల్లో బేరాలు తెగక బయటపడిన వ్యవహారామా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక కెన్ స్టార్ గురించి గగ్గోలు పెడుతున్న నీలిమీడియా వైసిపి హయాంలో కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ బియ్యం రవాణా గురించి ఒక్కసారి కూడా వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయకపోవడాన్ని బట్టి అధికార, ప్రతిపక్షాలు దొందూదొందే అన్న వాస్తవం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది.
ఎపిలో బియ్యం ఎగుమతులకు కాకినాడ ఓడరేవు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ ఎప్పటి నుంచో అంగ, అర్థబలాలతో పాటు, రాజకీయ బలం కూడా ఉన్న వైసిపి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం బియ్యం వ్యాపారంలో పైచేయిగా ఉంది. దీంతో సహజంగానే ఆకుటుంబానికి రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల్లో కూడా మెజార్టీ వాటా ఉండవచ్చన్నది అందరికీ అనుమానం. గత వైసిపి పాలనలో ద్వారంపూడి తండ్రే ఎపి ఫౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. దీంతో ఆయన కుటుంబానికి ఇక అడ్డేముంది. గత ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాఫియా సామ్రాజ్యాన్ని కూల్చేస్తామని నేరుగా ద్వారంపూడిపై దాడి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రయత్నాలు మొదలుపెట్టినా అవినీతి అధికారులు, కొంతమంది రాజకీయ నేతల కుమ్మక్కు రాజకీయాల కారణంగా ద్వారంపూడి కుటుంబ వ్యాపారానికి అడ్డులేకుండా పోయిందన్నది స్టెల్లా నౌక ఉదంతాన్ని చూస్తే అర్థమవుతోంది. వైసిపి అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడైన ద్వారంపూడి కుటుంబ ఆర్థిక మూలాలపై దాడి చేసేందుకే కూటమి నేతలు కాకినాడపై దృష్టిసారించారన్నది కాదలేని వాస్తవం. తద్వారా కూటమి నేతలకు చెందిన వ్యాపారాలు వృద్ధి చేసుకునే క్రమంలో నౌకల్లో తనిఖీలు జరుపుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. కెన్ స్టార్ నౌక ఉదంతం ఇందుకు ఒక ఉదాహరణగా చెబుతున్నారు.
మరోవైపు రేషన్ బియ్యం అమ్మకాలు తెలుగుదేశం వ్యవస్థాపకుడు కిలో 2రూపాయల పథకం రూపకర్త ఎన్టీ రామారావు నాటి నుంచే జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుపై రూపాయికి కేజీ చొప్పున అందించే బియ్యాన్ని పేదల్లో పేదలైన కేవలం 10శాతం మంది మాత్రమే తింటున్నారన్నది నమ్మలేని వాస్తవం. మరో 10శాతం మంది మధ్యతరగతి ప్రజలు ప్రతీ మూడునెలలకు ఒకసారి పిండికి, ఇతర అవసరాలకు తీసుకుంటున్నారు. ఇంటి వద్దకే వచ్చిన రేషన్ బండి వద్దే అమ్మేసుకుంటున్నారు. లేదా తెలిసిన రేషన్ డీలర్ కి విక్రయిస్తున్నారు. ఇది దశాబ్దాల కాలం నాటి స్కామ్. దీనికి ప్రధాన సూత్రధారులు భారీ స్థాయి మిల్లర్లు. రేషన్ డీలర్లు, మధ్య దళారులుగా పాత్రదారులుగా మారుతున్నారు. పేద ప్రజలకు పట్టెడన్నం కోసం ప్రవేశపెట్టిన ఈపథకాన్ని ఇక ముగిస్తే మంచిదన్న అభిప్రాయం సీనియర్ రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈపథకం కింద కొంతమొత్తాన్ని నిర్ధారించి, నగదు బదలీ పథకాన్ని అమలు చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తద్వారా రేషన్ మాఫియాతో పాటు, బియ్యం స్మగ్లింగ్ కూడా అడ్డుకట్ట వేయవచ్చు. ప్రజలకు కూడా నాసిరకం బియ్యం అమ్ముకోవాల్సిన అగత్యం కూడా ఉండదు. అదే సమయంలో నాణ్యమైన సన్నబియ్యాన్ని మార్కెట్ ధర కన్నా సరసమైన ధరకు రైతుబజార్ల ద్వారా సరఫరా చేస్తే అటు పేదలతో పాటు, మధ్య తరగతి వర్గాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందన్నది సీనియర్ అధికారుల సలహా. ఇదంతా జరిగితే రేషన్ మాఫియాతో పాటు రాజకీయ వ్యాపారులకు మాత్రం ఇబ్బందేనేమో…అందుకే ఇది జరగకపోవచ్చు.