ఈ దొంగల ముఠా ఐదు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్

ఆలీబాబా అరడజను దొంగల్లాగ ఒక మహిళ  నాయకత్వంలో 8 మంది ఇరానీ దొంగల ముఠా ఐదు రాష్ట్రాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు,…

 ఈ దొంగల ముఠా ఐదు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్

ఆలీబాబా అరడజను దొంగల్లాగ ఒక మహిళ  నాయకత్వంలో 8 మంది ఇరానీ దొంగల ముఠా ఐదు రాష్ట్రాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు, పోలీసులను పరుగులు పెట్టించింది. రాజమహేంద్రవరం, రూరల్ కొంతమూరు, కడియం తదితర ప్రాంతాల్లో ఈముఠా గత కొద్దిరోజులుగా హల్ చల్ చేసింది. గత నెల 22వ తేదీన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆరు గంటల వ్యవధిలో 14 గొలుసు దొంగతనాలకు పాల్పడింది.  ఐదు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఈకరుడుగట్టిన ఇరానీ దొంగల ముఠాను రాజమహేంద్రవరం పోలీసులు అరెస్టు చేయడం విశేషం. ఈకేసు వివరాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మీడియాకు వెల్లడించారు. 

 ఈముఠా ఆంధ్ర, తెలంగాణా, ఒడిశా, చత్తీస్ ఘడ్, మహారాష్ట్రలో 157  చైన్ స్నాచింగ్స్ నేరాలకు పాల్పడింది. ఒడిశాలోని  నౌపడా జిల్లా కరియాడ్ రోడ్ గ్రామానికి చెందిన ఇరానీ ముఠాలో 8 మంది ఉండగా, వారిలో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి నుంచి సుమారు రూ.  40 లక్షల విలువ చేసే 50 కాసులు బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.  ఈముఠా నాయకురాలు దిల్ రుబా ఒడిశాలోనే ఉండి, సభ్యులను వివిధ రాష్ట్రాలకు పంపి,  చోరీలు చేయించి, సొత్తును విక్రయిస్తుంది. ఈముఠా సభ్యులు మోటారు సైకిళ్ల మీదే రాష్ట్రాలు దాటేస్తారు.

2018లో రాయగడకు చెందిన లక్ష్మి అనే హోంగార్డు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని మహిళలు ఒంటిపై ఎక్కువ బంగారాన్ని ధరిస్తారని ఇచ్చిన సమాచారంతో కొవ్వూరు ఒక ఇంట్లో భారి దొంగ తనానికి పాల్పడ్డారు. 2024 ఆగస్టులో దాదాపు 700 కిలోమీటర్లు మోటారు సైకిళ్లపై వచ్చి ముందస్తుగా రెక్కీ నిర్వహించి, గొలుసు దొంగతనాలకు పాల్పడింది. ఈముఠాలోని కిస్మత్ ఆలీ పథకాన్ని రచిస్తాడు. మిగిలిన సభ్యులు ఆచరిస్తారు. దీనిలో భాగంగా ఆలీ చోరీలు చేసే ప్రాంతానికి దూరంగా ఉంటాడు. ముఠా సభ్యులు హెల్మెట్లు ధరించి  చోరీలు చేసిన తరువాత సొత్తును మోటారు సైకిళ్లపై వేగంగా తీసుకెళ్లి అతనికి అందిస్తారు. అతను దాన్ని దిల్ రుబాకు చేరుస్తాడు. ఒకవేళ దొంగలు దొరికినా సొత్తు పోలీసులకు చిక్కకుండా ఈఏర్పాట్లు చేసుకున్నారు. కరుడుగట్టిన, కిరాతకమైన ఈముఠా కొద్ది రోజుల క్రితం గోకవరం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద, అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసు సిబ్బందిని సైతం చంపేందుకు వెనుకాడలేదు.

మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఇరానీ దొంగల ముఠా ఆటకట్టించడాన్ని ఎస్పీ నరసింహకిషోర్, జిల్లా పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చైన్ స్నాచర్స్ ఆట కట్టించేందుకు 4 ప్రత్యేక పోలీసు బృందాలను, రాజమండ్రి నగరం చుట్టూ ప్రత్యేక చెక్ పోస్ట్ లను, రాత్రి -పగలు నిరంతర పోలీస్ గస్తీ బృందాలను పెంచారు.  ఈముఠాను పట్టుకునేందుకు ఒరిస్సా, ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రాల సరిహద్దులలో ఉన్న మారుమూల గ్రామాలను సైతం ఎస్పీ జల్లెడ పట్టించారు. ఎట్టకేలకు గామన్ వంతెన వద్దే ముఠా సభ్యులను అరెస్టు చేసి,  ముఠా గుట్టురట్టు చేశారు. ఈముఠాలోని జహీర్ హుస్సేన్ అబూ తాలిబ్ అలియాస్ జహీర్, మహమ్మద్ షబ్బార్ అలియాస్ షబ్బార్, ఖాసీం అలీ, కిస్మత్ అలీ అలియాస్ అలీ దిల్ రుబా బేగం అలియాస్ దిల్ రుబా,  సోహైల్ అబ్బాస్ అలీ అలియాస్ సోహైల్ లను రాజమహేంద్రవరం పోలీసులు అరెస్టు చేయగా… హైదర్ అలీ, జావేద్ అలీ పరారీలో ఉన్నట్లు ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. ఈముఠాను పట్టుకునేందుకు కృషిచేసిన 4 పోలీసు బృందాల సభ్యులకు ఎస్పీ రివార్డులు,  అవార్డులు అందజేశారు. 

 

Leave a Reply