సంగీతంలో మామ మహదేవన్

దక్షిణాది సినీరంగంలో మామగా చిరపరిచితులైన కెవి మహదేవన్ పూర్తి పేరు కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్. మామ తొలుత సహాయనటుడిగా సినీరంగంలోకి ప్రవేశించి, మిత్రుల సలహాతో సంగీత…

 సంగీతంలో మామ  మహదేవన్

దక్షిణాది సినీరంగంలో మామగా చిరపరిచితులైన కెవి మహదేవన్ పూర్తి పేరు కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్. మామ తొలుత సహాయనటుడిగా సినీరంగంలోకి ప్రవేశించి, మిత్రుల సలహాతో సంగీత దర్శకుడిగా మారి ఉన్నత శిఖరానికి చేరుకున్నారు. 1962 లో విడుదలైన మంచి మనసులు సినిమాలో ఈయన స్వరపరిచిన మామ మామ అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. అప్పటి నుంచి మామ అనేది ముద్దుపేరుగా స్థిరపడింది. తెలుగు రాకపోయినా మామ తెలుగు సినిమా సంగీతంలో ఓ కొత్త బాణీకి ఊపిరిపోశారు. సంగీతానికి భాష అనే ఎల్లలు లేవు అని నిరూపించిన వారిలో మహదేవన్ ఒకరు.
అయితే జీవిత చరమాంకంలో మామకు నరాల బలహీనత వచ్చి తీవ్ర అస్వస్థులయ్యారు. దాంతో మాట కూడా పడి పోయింది. మతి స్థిమితం కూడా తప్పింది. ఏసి రూమ్ లో ఆయనను ఒంటరిగా ఉంచేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎం. ఎం. కీరవాణి మామ ఇంటికి వెళ్లారు. తమిళంలో తను స్వరపరిచిన తొలి చిత్రం “పాట్రుట్ దిట్టన్” ఆడియో కేసట్ ను మామకు చూపించాలని ముచ్చట పడ్డారు. ఆ కేసట్ ను ఓ ఆట వస్తువులా ఆడుకున్నారాయన. అలా ఆ పరిస్థితిలో మామను చూసి కీరవాణి కంటతడి పెట్టుకున్నారు. ఆ తరువాత మహాదేవన్ అంతిమ దినాలలో శ్వాసపీల్చుకోవటం కష్టమై వారం రోజుల పాటు అస్వస్థతతో ఆసుపత్రిలో ఉండి 2001, జూన్ 22న 83 సంవత్సరాల వయసులో చైన్నైలో మరణించారు.

మహాదేవన్ 1917లో మార్చి 14న తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో లక్ష్మీ అమ్మాళ్, వెంకటాచలం అయ్యర్ (భాగవతార్) లకు జన్మించారు. వాళ్ల కుటుంబమంతా సంగీతమయమే. తండ్రి గోటు వాద్యంలో నిష్ణాతులు. తాతగారు తిరువాన్కూరు సంస్థానంలో సంగీత విద్వాంసునిగా పని చేశారు. దీంతో మహదేవన్ చిన్నతనం నుంచి సంగీతం వైపు ఆసక్తి చూపారు. నాలుగేళ్ల ప్రాయంలోనే చిన్నారి మహాదేవన్ నాదస్వర వాద్యానికి ఆకర్షితుడై నాదస్వర విద్వాన్ రాజరత్నం పిళ్లై దగ్గర శిష్యరికం చేశారు. అలాగే బూదంపాడి అరుణాచల కవిరాయర్ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకొని కొన్ని కచ్చేరీల్లో పాల్గొన్నారు.

ఏడవ తరగతి వరకు చదివి ఆపేసి నాటకాల్లో నటించారు. తరువాత చిత్రాల్లో పనిచేయడం కోసం మద్రాసు వెళ్ళారు. మహాదేవన్ మిత్రుడైన కొళత్తుమణి నువ్వు సంగీత దర్శకత్వ శాఖలో ప్రవేశిస్తే త్వరగా రాణిస్తావ్ అని సలహా యిచ్చారు. దీంతో కొళత్తుమణి ద్వారా అప్పటి సంగీత దర్శకుడైన ఎస్ వి వెంకట్రామన్ వద్ద సహాయకునిగా చేరారు. అప్పటికే అక్కడ సహాయకునిగా పనిచేస్తున్న టి.ఎ.కల్యాణంతో మంచి పరిచయం ఏర్పడింది. కల్యాణం దగ్గరే సినిమా సంగీతంలోని పట్లు, మెళకువలు నేర్చుకున్నారు. 1942 లో ఆనందన్ అనే చిత్రానికి మొదటగా సంగీత దర్శకత్వం వహించారు. మళయాళీ పుహళేందిని సహాయకుడిగా పెట్టుకున్నారు. ఈయన చివరి వరకు మహాదేవన్ తోనే పనిచేశారు. 1958 వ సంవత్సరంలో ప్రతిభా సంస్థ నిర్మించిన దొంగలున్నారు జాగ్రత్త అను సినిమాకు తొలిసారిగా తెలుగులో స్వరాలు అందించారు. అదే సంవత్సరంలో విడుదలైన ముందడుగు సినిమాతో మహాదేవన్ ప్రతిభ వెలుగుచూసింది. మంచిమనసులుతో తారస్థాయికి చేరింది.

మామకు 82 ఏళ్లు దాటాక “సహస్ర చంద్రదర్శనం” వేడుక చేశారు. అధిక మాసాలతో కలిపి వెయ్యి పున్నమి చంద్రులను చూసిన వారికి ఈ వేడుక చేస్తారు. తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరుపుకున్నారు.
శంకరాభరణం, దసరా బుల్లోడు, గోరింటాకు, ఇక భక్తి చిత్రాలైనటువంటి అయ్యప్పస్వామి మహత్యం, అయ్యప్పస్వామి జన్మ రహస్యం, వంటి చిత్రాలకు సంగీతం అందించి, తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. కెవి మహదేవన్ తన సంగీత జీవితంలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు, రివార్డులు పొందారు.
మార్చి 14న కెవి మహదేవన్ జయంతి సందర్భంగా…..

Leave a Reply