ఇష్టం లేకున్నా ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వచ్చింది!

సోము వీర్రాజుతో ఇంటర్వ్యూ సందర్భంగా మరోసారి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారన్న దివాకరమ్ న్యూస్ వ్యాఖ్యను చాలామంది తప్పుపట్టారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నంతకాలం సోముకు రాజకీయంగా…

 ఇష్టం లేకున్నా ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వచ్చింది!

సోము వీర్రాజుతో ఇంటర్వ్యూ సందర్భంగా మరోసారి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారన్న దివాకరమ్ న్యూస్ వ్యాఖ్యను చాలామంది తప్పుపట్టారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నంతకాలం సోముకు రాజకీయంగా ఆజ్ఞాతవాసం తప్పదని ఢంకా బజాయించారు. అయితే ఎట్టకేలకు అనూహ్యంగా సోము వీర్రాజు అనుకున్నది సాధించారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా మరోసారి ఎంపికయ్యారు. బిజెపి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో వైసిపికి సన్నిహితంగా ఉంటూ…టిడిపి అధినేత చంద్రబాబునాయుడును తీవ్రంగా విమర్శించిన సోము వీర్రాజు, టిడిపితో పాటు, ఎల్లో మీడియాకు, ఒక సామాజిక వర్గానికి కూడా బద్దశత్రువుగా మారిపోయారు. బిజెపి అధ్యక్షుడిగా టిడిపికి ఫైర్ బ్రాండ్ గా మారిన సోము వీర్రాజు అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నాక బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందరేశ్వరి ఎంపిక కావడం, టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి రావడం వంటి పరిణామాలు ఎల్లో మీడియా ప్రభావం వల్ల దాదాపు కనుమరుగయ్యారు. ప్రస్తుతం బిజెపిలో సోము వ్యతిరేకుల గళం ఎక్కువగా వినిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం, రూరల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలన్న ఆయన ఆశ కూడా నెరవేరలేదు. బాల స్వయంసేవక్ గా ప్రస్థానం ప్రారంభించి….46సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అంచెలంచెలుగా ఎబివిపి, యువమోర్చా విభాగాల్లో పనిచేసి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎదిగిన సోము వీర్రాజు రెండు సార్లు టిడిపి హయాంలోనే ఎమ్మెల్సీ పదవిని సాధించడం విశేషం. తద్వారా పార్టీలో జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఉన్న తన పట్టును నిరూపించుకున్నట్లయ్యింది. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను బిజెపి పెద్దలకు ఆయనే పరిచయం చేశారు. ఇది కూడా ఆయన ఎమ్మెల్సీ పదవికి ఎంపికయ్యేందుకు దోహదం అయి ఉండవచ్చు. ఎమ్మెల్సీ కోటాలో బిజెపి తరుపున విశాఖపట్నంనకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పివి మాధవ్, భీమవరంనకు చెందిన సీనియర్ నాయకుడు పాకా సత్యనారాయణ పేర్లు కూడా వినిపించాయి. వీరిద్దరూ కూడా సోము సన్నిహితులే. బిసి సామాజిక వర్గానికి చెందిన మాధవ్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది.
జిల్లా అధ్యక్షుడి ఎంపికలోనూ….
రాజీవ్ ప్రతాప్ రూఢీ నేతృత్వంలోని పోలవరం ప్రాజెక్టు పార్లమెంటు కమిటీ రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా రాజమహేంద్రవరం ఎంపి దగ్గుబాటి పురంధరేశ్వరి ఒక విందును ఏర్పాటు చేశారు. ఈవిందుకు సోము వీర్రాజును ఆహ్వానించకపోవడంతో పురంధరేశ్వరి, సోముకు మధ్య విభేదాలు నెలకొన్నాయన్న ప్రచారం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడి ఎంపికలో కూడా వారి మధ్య అభిప్రాయ బేదాలు నెలకొన్నాయన్న ప్రచారానికి ఆస్కారం ఏర్పడ్డాయి. అయితే పురంధరేశ్వరితో తనకు విభేదాలు ఎందుకుంటాయని ఎదురు ప్రశ్నించారు. ఆమె పనితీరును కూడా ప్రశంసించడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా బిజెపి నూతన అధ్యక్షుడిగా నియమితులైన బిసి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన పిక్కి నాగేంద్ర ఆపదవిని చేపట్టడం చాలా అనూహ్యంగా జరిగిపోయింది. ఒక విధంగా పార్టీలోని అంతర్గత లుకలుకలే ఆయనను జిల్లా అధ్యక్షుడ్ని చేశాయని చెప్పవచ్చు. బిజెపి నాయకురాలు ఎన్ హారికను అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా నాగేంద్రను తెరపైకి తేవడంతో ఆయన అధ్యక్షుడై కూర్చున్నారు. ఈవిషయంలో బిజెపిలో సంస్థాగతంగా గట్టి పట్టున్న జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు చక్రం తిప్పారు. హారికను అధ్యక్షురాలిని చేసేందుకు పురంధరేశ్వరి సానుకూలంగా ఉండటంతో పాటు, ఆమె వర్గీయులు కూడా ఈమేరకు ప్రయత్నించారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోము వీర్రాజు రంగంలోకి దిగి హారిక ఎన్నికను అడ్డుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా సోము వీర్రాజు మరోసారి ఎపి రాజకీయాల్లో వెలుగులోకి వచ్చారు. తమ నాయకుడు ఎమ్మెల్సీగా ఎంపిక కావడంతో రాజమహేంద్రవరంలోని బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి వంటి ఆయన వర్గీయుల్లో ఉత్సాహం రెట్టించింది. ఒక్కసారిగా కనీసం ఫోన్లు ఎత్తలేనంత బిజీగా మారిపోవడం గమనార్హం. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కడంతో ప్రొటోకాల్ పరంగా, రాజకీయంగా బిజెపిలో మరోసారి అంతర్గత పోరుతప్పదేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply