వారంతా బిజెపి కోవర్టులు….వైసిపిని కాంగ్రెస్ లో విలీనం చేయాలి

విద్యార్థి దశ నుంచీ కాంగ్రెస్ సిద్ధాంతాలను జీర్ణించుకున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు షర్మిలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా…

 వారంతా బిజెపి కోవర్టులు….వైసిపిని కాంగ్రెస్ లో విలీనం చేయాలి

విద్యార్థి దశ నుంచీ కాంగ్రెస్ సిద్ధాంతాలను జీర్ణించుకున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు షర్మిలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత మునిగిపోతున్న పడవగా భావించి, కాంగ్రెస్ పార్టీని తోటి నాయకులంతా వీడి వెళ్లిపోయినా ఆయన మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషిచేస్తున్నారు. గిడుగు రుద్రరాజుతో దివాకరమ్ న్యూస్ ముఖాముఖీ విశేషాలు…..

కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ నేతలు గులామ్ నబీ ఆజాద్, మణిశంకర్ అయ్యర్, శశి థరూర్ వంటి వారు తల్లిపాలు తాగి, రొమ్ము గుద్దే రకమని, బిజెపి కోవర్టులని గిడుగు రుద్రరాజు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వారికి ఏమి తక్కువ చేసిందని ప్రశ్నించారు. 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, పార్టీ అధినేత రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తారని గిడుగు రుద్రరాజు ధీమా వ్యక్తం చేశారు. దేశానికి రాహుల్ మెరుగైన పాలన అందిస్తారని చెప్పారు. బిజెపి హయాంలో దేశంలో నిరుద్యోగం పెచ్చుమీరిందని, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి కుంటుపడ్డాయన్నారు. దేశంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ప్రజల్లో క్రేజ్ తగ్గిందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ఆధార్, సమాచారహక్కు చట్టం వంటివి యుపిఏ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన నూతన ఒరవడికి శ్రీకారమని అభివర్ణించారు. రాహుల్ గాంధీయే ఎందుకు ప్రధాని కావాలని, పార్టీలో ప్రధాని పదవిని చేపట్టే స్థాయి నాయకులు ఎవరూ లేరా అన్న ప్రశ్నకు స్పందిస్తూ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని, ఆ కుటుంబం కన్నా అర్హులు ఎవరు ఉంటారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా దేశవ్యాప్తంగా పర్యటించి, అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషిచేస్తున్నారన్నారు. ఈయాత్రలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు.
ఇండియా కూటమి విచ్ఛిన్నంపై గిడుగు స్పందిస్తూ రాష్ట్రాల ఎన్నికల సమయంలో ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం కాంగ్రెస్ తో విభేదించడం సహజమేనని, కేరళే ఇందుకు చక్కని ఉదాహరణ అని చెప్పారు. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇండియా కూటమి పార్టీలన్నీ ఏకమై బిజెపిని ఓడిస్తాయన్నారు. ప్రధాని పదవిపై కూటమిలో భిన్నాభిప్రాయాలు ఉన్నా…ఎవరికి మెజార్టీ సీట్లు దక్కితే ఆపార్టీకి చెందిన నేతే ప్రధాని పదవిని అధిష్టిస్తారని స్పష్టం చేశారు. 2029 ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగాలని డిమాండ్ చేశారు. వ్యక్తులు ప్రోగ్రామింగ్ చేసే ఇవిఎంలను టాంపరింగ్ చేసే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు.
కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్లమెంటు స్థానాల డీ లిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలతో పాటు, దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో కూడా సీట్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈవిషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆందోళన సబబేనన్నారు. త్రి భాషా సూత్రంపై స్పందిస్తూ మాతృభాషతో పాటు, అన్ని భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డీ లిమిటేషన్ పై కాంగ్రెస్ వైఖరే తన వైఖరని స్పష్టం చేశారు. స్టాలిన్ ఏర్పాటు చేయనున్న ముఖ్యమంత్రుల సమావేశానికి తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారన్నారు.
వైసిపి అధినేత వైఎస్ జగన్ తో పాటు, ఆపార్టీలోని మెజార్టీ నాయకులు కాంగ్రెస్ వాదులేనని, కూటమిని ఎదుర్కొనేందుకు వైసిపిని కాంగ్రెస్ లో విలీనం చేయాలని, పాత కాంగ్రెస్ నాయకులంతా తిరిగి పార్టీలోకి రావాలని గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు.
ఎపిలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అధికారం కోసం అలవికాని హామీలు ఇచ్చి, చేతులెత్తేస్తోందని గిడుగు రుద్రరాజు ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూటమి పాలనను, గతంలో ఐదేళ్లు వైఎస్ జగన్ పాలనను చూసిన ప్రజలు కుల, మతాలకు అతీతంగా సెక్యులర్ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ పాలన అందించే కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఈనేపథ్యంలో 2029లో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గిడుగు రుద్రరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. వైసిపి కూడా బిజెపి తానులో ముక్కేనని, సంస్థాగత నిర్మాణమే లేని ఆపార్టీ రానున్న రోజుల్లో కనుమరుగు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ కోరడం అర్థరహితమని, పార్లమెంటరీ నిబంధనల ప్రకారం మొత్తం సీట్లలో 10 వంతు సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందని స్పష్టం చేశారు.
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శిష్యుడిగా ప్రచారం పొందుతున్న రేవంత్ రెడ్డి చంద్రబాబునాయుడుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చారు. రాజకీయాల్లో గురు, శిష్యుల సంబంధాలు చెల్లవని, చంద్రబాబునాయుడు టిడిపి, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేస్తూ, రేవంత్ రెడ్డి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ఎపిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీకి బలమేనని, తన కన్నా ఆమె బాగా పనిచేస్తున్నారని గిడుగు రుద్రరాజు కితాబునిచ్చారు. చంద్రబాబునాయుడు చేతిలో షర్మిల కీలుబొమ్మ అన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.

Leave a Reply