ఎమ్మెస్ రామారావు మొర ఆలకించిన హనుమంతుడు

ఎమ్మెస్ రామారావు ఆలపించిన రామాయణ సుందరాకాండ, హనుమాన్ చాలీసా వినని వారు…ఆయన గానానికి మైమరవని తెలుగు వారు చాలా అరుదు. తెలుగు చిత్రసీమలో తొలి నేపథ్య గాయకుడు…

 ఎమ్మెస్ రామారావు మొర ఆలకించిన హనుమంతుడు

ఎమ్మెస్ రామారావు ఆలపించిన రామాయణ సుందరాకాండ, హనుమాన్ చాలీసా వినని వారు…ఆయన గానానికి మైమరవని తెలుగు వారు చాలా అరుదు. తెలుగు చిత్రసీమలో తొలి నేపథ్య గాయకుడు రామారావు. 1963 నుంచి రామారావు కొన్నాళ్లు రాజమహేంద్రవరంలో నివసించారు. 1974 వరకు స్థానికి గురుకులంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1970 లో పెద్ద కుమారుడు బాబూరావు భారతీయ వాయుసేన పైలట్ హోదాలో 1971లో పాకిస్థానుతో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో ఆయన ఆచూకీ తెలియ లేదు. రామారావు, ఆయన సతీమణి తీవ్ర ఆందోళన చెందారు. కుమారుడి క్షేమం కోసం వాయు కుమారుడైన హనుమంతుని ఆరాధించడం మొదలు పెట్టారు. తర్వాత కొంత కాలానికి బాబూరావు క్షేమంగా ఇల్లు చేరడంతో శ్రీ హనుమానుడే వారి ఇష్ట దైవమైనాడు. ఆయన హనుమాన్ చాలీసా, సుందరకాండ రాయడానికి అదే ప్రేరణ.
ఎమ్మెస్ రామారావు పూర్తిపేరు మోపర్తి సీతారామారావు. ఈయనకు సుందర దాసు అనే బిరుదు ఉంది. ఎమ్మెస్ రామారావు 1921 మార్చి 7 న గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మోపర్తి రంగయ్య, మంగమ్మ గార్లు సీతారామ భక్తులు. చిన్నతనం నుండే రామారావు పాటలు పాడుతుండేవారు. ఈయన విద్యాభ్యాసము నిడుబ్రోలు ఉన్నత పాఠశాలలో, గుంటూరు హిందూ కళాశాలలో జరిగింది. ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్న రోజుల్లో అంతర్ కళాశాలల లలిత సంగీత పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నారు.

న్యాయనిర్ణేతల్లో ఒకరైన అడవి బాపిరాజు చలన చిత్ర రంగంలో ప్రవేశించమని ఆయనను ప్రోత్సహించారు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా పాట పాడించారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం. తరువాత ఈయన దీక్ష, ద్రోహి, మొదటిరాత్రి, పాండురంగ మహత్యం, నా యిల్లు, సీతారామ కల్యాణము, శ్రీరామాంజనేయ యుద్ధము మొదలైన సినిమాలలో పాడారు. 1944 నుంచి 64 వరకు తెలుగు చలన చిత్రాలలో నేపథ్య గాయకునిగా మద్రాసులో నివసించిన ఆయన 5 సంవత్సరాల పాటు కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. కొన్ని పాటలు రాసి నల్లపిల్ల, తాజ్ మహల్, హంపి, కనీసం, హిమాలయాలకు రాలేనయ్యా, మొదలైన గ్రామఫోన్ రికార్డులు ఇచ్చారు. గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన రామయణ భాగం సుందరకాండము ఎమ్మెస్ రామారావు సుందరకాండ గా సుప్రసిద్ధం. తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు. ఈ రెండూ ఈయనకు ఎనలేని గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. 1972 నుండి 74 వరకు తులసీదాసు హనుమాన్ చాలీసాను హిందీ నుంచి తెలుగులోకి అనువదించారు, 1975 నుంచి హైదరాబాదులోని చిక్కడపల్లిలో నివసించారు. రామారావుకు 1977 సంవత్సరంలో సుందరదాసు అనే బిరుదు ఇచ్చారు. ఈయన 1992 ఏప్రిల్ 20న హైదరాబాదులో సహజ మరణం పొందారు.

ఎంఎస్ రామారావు జయంతి సందర్భంగా….

Leave a Reply