పురంధరేశ్వరితో నాకెందుకు విభేదాలు….కాంట్రాక్టు నాకిస్తే రూ. 4వేలకే ఇసుక!
బాల స్వయంసేవక్ గా ప్రస్థానం ప్రారంభించి….46సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అంచెలంచెలుగా ఎబివిపి, యువమోర్చా విభాగాల్లో పనిచేసి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎదిగిన…

బాల స్వయంసేవక్ గా ప్రస్థానం ప్రారంభించి….46సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అంచెలంచెలుగా ఎబివిపి, యువమోర్చా విభాగాల్లో పనిచేసి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎదిగిన సోము వీర్రాజు బిజెపి సిద్ధంతాలను నరనరాన జీర్ణించుకున్నారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై సమగ్ర అవగాహన కలిగిన సోము వీర్రాజు రాష్ట్రాభివృద్ధి, వికాసంపై దూరదృష్టి కలిగిన నాయకుడు. లోతుగా విశ్లేషించడం, వ్యాఖ్యానించడం ఆయన ప్రత్యేకత. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక చేపట్టనున్న నేపథ్యంలో మరోసారి ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్న సోము వీర్రాజుతో ది వాకరమ్ న్యూస్ ముఖాముఖీ విశేషాలు……
రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్టు తనకు ఇస్తే రూ. 5వేల కోట్లు చెల్లిస్తానని, లారీ ఇసుకను 4వేలకే సరఫరా చేస్తానని గతంలో కోరానని సోము వీర్రాజు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రూ. 2.50 తయారయ్యే లిక్కర్ ను 150-200కు విక్రయించారని, దీని వెనుక 30వేల కోట్ల కుంభకోణం జరిగిందని సోము వీర్రాజు ఆరోపించారు. అందుకే తాను రూ. 50కే నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తానని ప్రకటిస్తే తనను సారా వీర్రాజుగా ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం, ఇసుక అక్రమాలపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ తాను లిక్కర్, ఇసుక కాంట్రాక్టుల గురించి చేసిన వ్యాఖ్యలను ఈనేపథ్యంలో లోతుగా అర్థం చేసుకోవాలని సూచించారు.
అధ్యక్షుడిగా వైసిపి పట్ల కాస్త మెతక వైఖరిని అవలంభించారన్న విమర్శలపై సోము స్పందిస్తూ తన వైఖరిలో ఎప్పటికీ మార్పు రాలేదన్నారు. తనకు నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఎమ్మెల్సీ పదవి దక్కిందని గుర్తుచేశారు. అలాంటప్పుడు తనకు నాటి ముఖ్యమంత్రి జగన్ కు ఎందుకు సంబంధాలు ఉంటాయని సోము వీర్రాజు కొట్టిపారేశారు. తాత రాజారెడ్డి నుంచి నేటి జగన్ వరకు రాష్ట్రంలో ఖనిజ సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఖనిజాల తవ్వకాన్ని ప్రభుత్వమే చేపడితే రాష్ట్రానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందన్నారు. జగన్ అక్రమాలపై విచారణ జరిపించాలన్న తన డిమాండ్ కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. నాడు కడపలో టిప్పు సుల్తాన్ విగ్రహ స్థాపనను అడ్డుకున్నానని, గుంటూరులో జిన్నా టవర్ కు జాతీయ జెండా రంగులు వేయడం వెనుక తన కృషి, పోరాటం ఉన్నాయని వివరించారు. లేనిపక్షంలో ఎపిలో టిప్పు సుల్తాన్ విగ్రహం వెలిసేదన్నారు.
గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ, రూరల్ సీటు ఆశించినా దక్కలేదన్నారు. ఇలా 3సార్లు జరిగిందన్నారు. ఈవిషయంలో పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరాధార్యమన్నారు. మాజీ ఎంపిలు గిరిజాల వెంకటస్వామినాయుడు, చుండ్రు శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ వంటి వారికి తన ప్రమేయం లేకపోతే సీట్లు వచ్చేవా అని ప్రశ్నించారు. భారతదేశానికి తిరిగి విశ్వగురు స్థానం కల్పించడమే బిజెపి కార్యకర్తల అంతిమ లక్ష్యమన్నారు. దీనిలో భాగంగానే మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకున్నామన్నారు. రాజమహేంద్రవరం ఎంపి దగ్గుబాటి పురంధరేశ్వరి, ఇతర నాయకుల చేరిక కూడా ఇందులో భాగమేనన్నారు. అధికారం ద్వారానే అభివృద్ధి సాధ్యమని, తద్వారా విశ్వగురు లక్ష్యం సాధ్యమవుతుందన్నారు.ఎపిలో కూడా అధికారాన్ని చేజిక్కించుకుంటారా అని ప్రశ్నించగా, రేపటి గురించి ఇప్పుడే చెప్పలేమని సోము వీర్రాజు దాట వేశారు. అయినా ఇలాంటి అంశాలను మీడియాతో ఎందుకు చర్చిస్తామని తెలిపారు. ఎంపి దగ్గుబాటి పురంధరేశ్వరితో తనకు ఎందుకు విభేదాలు ఉంటాయని ఎదురు ప్రశ్నించారు. ఆమె తన స్థాయిలో రాజమహేంద్రవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్నారన్నారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టు పార్లమెంటరీ కమిటీకి పురంధరేశ్వరి ఇచ్చిన విందుకు తనను ఆహ్వానించకపోవడం కూడా తనను బాధించలేదన్నారు. పార్టీలో కమ్మ సామాజికవర్గం ప్రాభల్యం పెరుగుతోందన్న చర్చపై ఆయన స్పందిస్తూ బయట జరిగే చర్చలకు తమ పార్టీలో తావుండదని స్పష్టం చేశారు. ఎపిలో మీడియా మాయాజాలం చేస్తోందని సోము వ్యాఖ్యానించారు.
కొత్త పార్టీలో పెడుతున్నాననంటే తానే పవన్ కల్యాణ్ ను ప్రధాని నరేంద్రమోడీతో భేటీ జరిపించానని, ఆయన పార్టీని బాగా నడిపిస్తున్నారని, ఉప ముఖ్యమంత్రిగా, పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. టిడిపి, బిజెపి, జనసేన కూటమి ప్రభుత్వం 90శాతం బాగా పనిచేస్తోందన్నారు. కార్యకర్తలు నామినేటెడ్ పదవులు ఆశించడం, నిరాశ చెందడం సహజమేనన్నారు. కూటమి ప్రభుత్వంలో 70:20:10 నిష్పత్తిలో నామినేటెడ్ పదవుల పంపకం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీడియా ముఖంగా గానీ, రికార్డెడ్ గా చెప్పారా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎన్ని సీట్లు, పదవులు తీసుకోవాలన్న దానిపై పార్టీలో చర్చించి, నిర్ణయిస్తామన్నారు.సంస్థాగత ఎన్నికల్లో భాగంగా త్వరలో ఎపి బిజెపి కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుందన్నారు.
ఆవ భూముల కొనుగోళ్లలో 15కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖ పక్కనపెట్టిన, కనీసం ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కాని భూములను జగనన్న కాలనీల కోసం కొనుగోలు చేశారని, దీనిపై నాటి కలెక్టర్ మురధీర్ రెడ్డిని కూడా తాను గట్టిగా నిలదీశానని సోము చెప్పారు. రాజుల కాలం నాటి కట్టడాలు ఇప్పటికీ ఎంతో సురక్షితంగా ఉంటున్నాయని, ప్రజాప్రభుత్వాలు నిర్మించే కట్టాలు కూలిపోతున్నాయని, అవినీతే దీనికి కారణమన్నారు.
బాల స్వయం సేవక్ నుంచి ప్రస్థానం….
1967లో 7వ తరగతిలో ఉండగా స్వయంసేవక్ సంఘ్ లో చేరానని, నాటి నుంచి సంఘ్ పరివార్, బిజెపితో సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. 1975-78 దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడంతో దివంగత బిజెపి నేత చలపతిరావుతో కలిసి పనిచేశానని చెప్పారు. నాడు కరపత్రాలు పంచడం వంటి పనులు చేసేవాడినని, తరువాత పోలీసుల ఒత్తిడి పెరగడంతో ఆజ్ఞాతంలోకి వెళ్లానన్నారు. 1978లో డిగ్రీ పూర్తి చేసి, 3నెలల పాటు ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేశానని, పేపరుమిల్లులో పనిచేసేందుకు రాజమహేంద్రవరం వచ్చానని వివరించారు. రాజకీయాల్లో బిజీగా మారడంతో ఉద్యోగ ప్రయత్నాలు విరమించానన్నారు. యువమోర్చా అధ్యక్షుడిగా నట, గాయకుడు శ్రీపాద జిత్ మోహన్ మిత్రా అద్యక్షుడిగా తాను ప్రధాన కార్యదర్శిగా నాడు కొత్తగా నిర్మించిన రోడ్డుకం రైలు వంతెనపై లైట్లు వెలిగించాలని 125రోజుల పాటు, 24గంటల రిలే నిరాహారదీక్షలు చేశామని గుర్తు చేసుకున్నారు. అలాగే గోకవరం బస్టాండ్ ను తరలించవద్దని డిమాండ్ చేస్తూ మరో 25 రోజుల పాటు 24గంటల రిలేదీక్షలు చేపట్టామన్నారు. డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, ఆసమయంలో విద్యార్థులు 60 మంది, ఉద్యోగులు 120 మంది ఉండేవారని, ఉద్యోగుల నియామకంలో జరిగిన అవకతవకలపై బిజెపి నాయకుడు గరిమెళ్ల చిట్టిబాబుతో కలిసి 7రోజుల పాటు ఆందోళనలు చేశామని, దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించిందన్నారు. నాటి డిఎస్పీ కాంతారావు తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పారని సోము వీర్రాజు చెప్పారు. 1980 ఏప్రిల్ 6న బిజెపిని స్థాపించారని, దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆధ్వర్యంలో డిల్లీలో జరిగిన ఆవిర్భావసభకు తాను హాజరయ్యానన్నారు. ఈ 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అసంతృప్తులకు తావు లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు.