చిత్ర కళావీధిలో….అదిరిన చిత్తరువు !
చాలా కాలం తరువాత సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో మంచి అభిరుచి కలిగిన కార్యక్రమం జరిగిందిఇప్పటి వరకు బెంగుళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకే పరిమితమైన ఇలాంటి…

చాలా కాలం తరువాత సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో మంచి అభిరుచి కలిగిన కార్యక్రమం జరిగిందిఇప్పటి వరకు బెంగుళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకే పరిమితమైన ఇలాంటి వీధి కళాప్రదర్శన తొలిసారిగా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేశారు. ఈప్రదర్శన తిలకించలేని వారికి ఒక వెలితిగా మిగిలిపోతుందండంలో సందేహం అక్కర్లేదు. రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు రోడ్డులో అమరావతి చిత్రకళావీధి పేరిట నిర్వహించిన చిత్ర కళా ప్రదర్శన కళాభిమానులు, కళాకారులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎపి డిప్యుటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈప్రదర్శనను ప్రారంభించారు. ఎపి సాంస్కృతిక, సృజనాత్మక కార్పొరేషన్ చైర్ పర్సన్ పొడపాటి తేజస్వి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జోనల్ ప్రత్యేక అధికారి అజయ్ జైన్, స్థానిక ప్రజాప్రతినిధులు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, కమిషనర్ కేతన్ గార్గ్, జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, జిల్లా న్యాయమూర్తి గంధం సునీత తదితరులు పాల్గొన్నారు.
సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్న నేటి సమాజంలో ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో కళాభిమానులు తరలిరావడం, యువ కళాకారులు కూడా ఈవేడుకలో పాల్గొనడం ఎంతో సంతోషదాయకం. ఈప్రదర్శనకు హాజరైన విద్యార్థులు, యువత విగ్రహాలు, శిల్ప కళారూపాల వద్ద ఉత్సాహంగా సెల్ఫీలు తీసుకున్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు సాగిన ఈప్రదర్శనలో రాజమహేంద్రవరంతో పాటు, రాష్ట్ర, జాతీయ స్థాయి చిత్ర, శిల్ప కళాకారులు కళారూపాలను ప్రదర్శించారు. నగరానికి చెందిన తాడోజు హరి, గువ్వల పద్మజ, వై పద్మజాభూషణ్, నఖ చిత్రకారుడు పరస రవి, ప్రముఖ శిల్పి వడయార్ వంటి కళాకారులు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఖైదీలు తమ కళారూపాలను ప్రదర్శించారు. వ్యర్థాలతో రూపొందించిన కళారూపాలు కూడా ఆకట్టుకున్నాయి. ఏలూరుకు చెందిన బిఎస్సీ విద్యార్థిని హిమ ఆక్రిలిక్ పెయింట్లు వేసి, ఆకట్టుకున్నారు. ఈప్రదర్శనలో ఐదారు పెయింటింగ్ లు విక్రయించడం కూడా విశేషం. హిమ సినిమా స్టోరీ బోర్డు పెయింటింగ్ వేస్తుందట. అనకాపల్లి జిల్లా తోటపాలకు చెందిన బోడసకుర్తి రవికుమార్ తోటకూర, ఆవాలతో వేసిన చిత్రాలు ప్రదర్శనలో దర్శనమిచ్చాయి. కొంతమంది స్పాట్ పెయింటింగ్ వేసి, ఆకట్టుకున్నారు.
కూటమి ప్రభుత్వ ప్రభావం వల్ల కావచ్చు ఎక్కువగా ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ చిత్రాలు ఎక్కువగా కనిపించాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రాలను వేసేందుకు, ప్రదర్శించేందుకు కళాకారులకు ధైర్యం సరిపోలేదేమో. పవన్ కల్యాణ్ ఈప్రదర్శనకు వస్తారన్న సమాచారంతో ఎక్కువ మంది పవన్ కల్యాణ్ బొమ్మలు వేయడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు గీసిన చిత్రాన్ని రూ.1,01,116 కు రఘురామకృష్ణరాజు కొనుగోలు చేశారు.