70ఏళ్లు…61 డిగ్రీలు…. విద్యారంగంలో మెగాస్టార్

సినీరంగంలో చిరంజీవి మెగాస్టార్ అయితే విద్యారంగంలో రాజమహేంద్రవరంనకు చెందిన ప్రముఖ మానసిక వైద్యులు ప్రతిష్టాత్మక బిసి రాయ్ అవార్డు గ్రహీత కర్రి రామారెడ్డి మెగాస్టార్ గా నిలిచారు.…

 70ఏళ్లు…61 డిగ్రీలు…. విద్యారంగంలో మెగాస్టార్

సినీరంగంలో చిరంజీవి మెగాస్టార్ అయితే విద్యారంగంలో రాజమహేంద్రవరంనకు చెందిన ప్రముఖ మానసిక వైద్యులు ప్రతిష్టాత్మక బిసి రాయ్ అవార్డు గ్రహీత కర్రి రామారెడ్డి మెగాస్టార్ గా నిలిచారు. మానసిక వైద్యుడిగా తీరికలేని ప్రాక్టీస్…సామాజిక సేవకుడిగా రచయితగా…విశ్లేషకుడిగా…ఆర్ఎస్ఎస్ నాయకుడిగా బిజీ జీవితాన్ని గడిపే రామారెడ్డి నిత్య విద్యార్థిగా 70ఏళ్ల వయస్సులో కూడా 61 డిగ్రీలు…అదీ విభిన్నమైనవి కావడం ఆయనలోని జ్ఞానతృష్ణకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. విద్యారంగంలో ఆయన సాధించిన ఘనతలు ఆషామాషీ కాదు. దేశంలోని ప్రతిష్టాత్మక ఏడు ఐ ఐ టి లు, ఒక ఐ ఐ ఎస్ సిలు అందిస్తున్న ఎన్ టి టెల్ డిగ్రీలు సాధించారు. వాటిలో 14 కోర్సుల్లో డిస్టెన్షన్ సాధించి, టాపర్ గా నిలవడంతో వరుసగా రెండోసారి మెగాస్టార్ పురస్కారాన్ని అందుకున్నారు. మొన్నటి వరకు 50 డిగ్రీలు పూర్తి చేసిన ఆయన ఈఏడాది జనవరి-జూన్ మధ్య పూర్తయిన సెమిస్టర్ లో 11 డిగ్రీలు పూర్తి చేసినట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు. తద్వారా మొత్తం 61 ఎన్ టి టెల్ కోర్సులు పూర్తి చేసినట్టయ్యింది. ఖరగ్ పూర్ ఐ ఐ టి నుంచి 4కోర్సులు, బోంబే ఐ ఐ టి నుంచి 3 కోర్సులు, మద్రాస్ ఐ ఐ టి నుంచి 3 కోర్సులు, గౌహతి ఐ ఐ టి నుంచి ఒక కోర్సు వెరసి 11కోర్సులు పూర్తిచేసానని ఆయన వివరించారు.

వీటిలో 8 కోర్సుల్లో టాపర్ గా నిలిచి మెగాస్టార్ పురస్కారాన్ని పొందారు. గత సెమిస్టర్ లో 6 కోర్సుల్లో టాపర్ గా నిలిచి మెగాస్టార్ గా నిలిచారు. ఏవేనీ ఆరు కోర్సుల్లో టాపర్ గా నిలిస్తే మెగాస్టార్ పురస్కారానికి అర్హులవుతారు. మూడు డాక్టరేట్లు, ఐదు ఎల్ఎల్ఎంలు, ఎంబిఏ, ఎంసిఎ, ఎంటెక్, ఎంఏ, ఎంకామ్.. ఇలా డిగ్రీలమీద డిగ్రీలు సాధిస్తూ, విభిన్న రంగాలలో వివిధ విద్యార్హతలు కలిగిన రామారెడ్డి ప్రపంచ రికార్డుల్లో నిలిచారు. అందుకే ఆయన ప్రతిభను గుర్తించి, ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. యువత, విద్యాభిలాషుల్లో స్ఫూర్తిని నింపేందుకే నిత్య విద్యార్థిగా కొనసాగుతున్నానని, జీవితాంతం విద్యా ప్రస్థానాన్ని కొనసాగిస్తానని రామారెడ్డి చెప్పారు. పదోతరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసేందుకే ఒత్తిళ్లకు గురయ్యే నేటి సగటు విద్యార్థులకు అర్థం కాని విషయం ఈయన ఇన్ని డిగ్రీలు ఎలా సాధించారన్నదే. ప్రణాళికాబద్ధమైన జీవన శైలి, ఇష్టం..ఆసక్తితో కూడిన విద్యాభ్యాసమే తన విజయరహస్యమని ఆయన చెబుతారు. నేటితరం విద్యార్థులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచే రామారెడ్డి రాజమహేంద్రవరానికే కాదు. రాష్ట్రానికే గర్వకారణంగా చెప్పుకోవచ్చు.

Leave a Reply