13ఏళ్లకే ఆంగ్ల ఫిక్షన్ నవల అల్లిన మన మహీరమ మహా రచయిత్రి అవుతుందా?!….

పిట్ట కొంచెం కూత ఘనం…ఈసామెత రాజమహేంద్రవరం నగరానికి చెందిన చల్లా మహీరమకు అక్షరాలా వర్తిస్తుంది. నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు చల్లా వెంకట సుబ్బరాయశాస్త్రి(సివిఎస్ శాస్త్రి) మనవరాలైన…

 13ఏళ్లకే ఆంగ్ల ఫిక్షన్ నవల అల్లిన మన మహీరమ మహా రచయిత్రి అవుతుందా?!….

పిట్ట కొంచెం కూత ఘనం…ఈసామెత రాజమహేంద్రవరం నగరానికి చెందిన చల్లా మహీరమకు అక్షరాలా వర్తిస్తుంది. నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు చల్లా వెంకట సుబ్బరాయశాస్త్రి(సివిఎస్ శాస్త్రి) మనవరాలైన మహీరమ 13ఏళ్లకే ప్రకృతి, పంచభూతాల కథాంశంగా చిన్నారులు పాత్రధారులుగా ఆంగ్లంలో రూబీస్ బ్లూస్ట్రీమ్ అండ్ ది బాండ్ ఆఫ్ ఫైర్ పేరుతో ఆసక్తికర కథనంతో ఫిక్షన్ నవలను రాసిపడేసింది. దివంగత సమాచారం సుబ్రహ్మణ్యం సోదరుడు గంధం కృష్ణ కుమార్తె లండన్ లో ఉంటున్న గంధం పావన ఈనవలకు ఆకట్టుకునేలా కవర్ పేజీని రూపొందించారు. తొలి నవలకు కొనసాగింపుగా మరో నాలుగు సీరీస్ ల నవలను రచించనున్నట్లు తెలిపింది. సీరీస్ లో భాగంగా రూబీస్ బ్లూస్ట్రీమ్ ఆఫ్ టైమ్ పేరుతో 2వ నవలను రచించే పనిలో నిమగ్నమైంది. నవలా రచనలో తనదైన శైలిని, సొంత పద సంపదను సృష్టించడం మహీరమ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రకృతితో మానవుడి అనుబంధం, ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఏర్పడే పర్యావసనాలు, జీవిత గమ్యాన్ని తన రచనల్లో సృజిస్తున్నట్లు మహీరమ వివరించింది. ప్రకృతి అంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకే తాను అనుభూతి చెంది నవలలు రాస్తున్నట్లు మహీరమ చెప్పింది. ఔత్సాహిక రచయితగానే కాదు కర్ణాటక సంగీతంలో కూడా మహీరమ ప్రతిభ కనపరుస్తోంది. కర్ణాటక గాత్ర సంగీతంలో 4వ గ్రేడ్ శిక్షణ పొందుతోంది. కీబోర్డు, చిత్రలేఖనం, ఈతలో కూడా ఆమెకు ప్రవేశం ఉంది. సొంతంగా పాటలు రాసి, వాటికి బాణీలు కూడా కట్టేందుకు మహీరమ కసరత్తు చేస్తోంది.
సివిఎస్ శాస్త్రి కుమారుడు రోషన్ కృష్ణ, వెంకట సాయిసుధ దంపతుల కుమార్తె అయిన మహీరమ 6వ ఏట వరకు అమెరికాలో పెరిగింది. ఆతరువాత తండ్రి ఉద్యోగ రిత్యా హైదరాబాద్ లో 9వ తరగతి చదువుతోంది. నేటి రోజుల్లో తోటి వయస్సు పిల్లలంతా సెల్ ఫోన్ల మాయలో పడితే మహీరమ మాత్రం చిన్న 8వ ఏట నుంచే రచనా వ్యాసంగాన్ని చేపట్టడం విశేషం. చదువులో కూడా ముందంజలో ఉండే ఆమె రచనా వ్యాసాంగానికి రోజుకు 2-3గంటలు కేటాయిస్తుంది. తల్లిదండ్రులు, తాత, రిటైర్డ్ ఎఫ్ సిఐ అధికారి, వెటరన్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడైన సుంకర నాగేంద్ర కిషోర్(నాగిన్)ప్రోత్సాహం, ముత్తాత ఆధ్యాత్మికవేత్త, మానవతావాది అయిన శివశంకర్ స్ఫూర్తితో ముత్యాల్లాంటి అక్షరాలతో రచనా వ్యాసాంగాన్ని చేపట్టింది మహీరమ. ప్రకృతిపై ఉన్న ఇష్టంతో తొలుత షార్ట్ ఫిలిం కోసం రచనను ప్రారంభించి, దాన్ని నవలగా మలిచింది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడే మహీరమ ఆంగ్ల, హిందీ భాషల్లో కవితా సంపుటిని కూడా రచించింది. మ్యూజింగ్స్ పేరిట ఆమె తాత శాస్త్రి దాన్ని ప్రచురించారు. మహీరమను ఆమె తల్లిదండ్రులు, తాత ప్రోత్సహిస్తున్న తీరు ప్రశంసనీయం. ఆమె ఇంటర్వ్యూ చేసే సమయంలో వారు పడిన తపన, హడావుడి చూస్తే ముచ్చటేసింది. రచనల్లో ఆసక్తి..తల్లిదండ్రులు, తాత ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో మహా రచయిత్రిగా మహీరమ చరిత్ర పుటల్లో నిలుస్తుందేమో…

Leave a Reply