వైఎస్సార్ తో ఉండవల్లి అనుభవాలు…జ్ఞాపకాలు!
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 90వ దశకంలో ఎంపిగా డిల్లీలో ఉండేవారు. ఆసమయంలో రాజమహేంద్రవరం మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తరుచూ డిల్లీ వెళ్లి…

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 90వ దశకంలో ఎంపిగా డిల్లీలో ఉండేవారు. ఆసమయంలో రాజమహేంద్రవరం మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తరుచూ డిల్లీ వెళ్లి ఆయనను కలిసేవారు. ఒకసారి చలికాలంలో డిల్లీ వెళ్లిన ఆయన నేరుగా రాజశేఖర్ రెడ్డి క్వార్టర్ ముందు ఆటో దిగారు. గజగజా వణికించే డిల్లీ చలిలో తన క్వార్టర్ వద్ద ఆటో దిగిన సమయంలోనే వైఎస్ పార్లమెంటుకు బయలుదేరారు. ఆటోలో దిగుతున్న ఉండవల్లిని చూసిన వైఎస్ తనతో రమ్మని పిలిచారు. సూట్ కేసు లోపల పెట్టి స్నానం చేసి, వస్తానని ఉండవల్లి చెప్పినా పట్టించుకోకుండా బలవంతంగా కారు ఎక్కించుకుని కన్నాట్ ప్లేస్ కు తీసుకుని వెళ్లి స్వెట్టర్ కొనిపించి, డబ్బులు ఉన్నాయా అని ఆరా తీశారు. ఎపిలోని వాతావరణానికి, చలికాలంలో డిల్లీ వాతావరణానికి చాలా తేడా ఉంటుందని హెచ్చరించి, వైఎస్ పార్లమెంటుకు వెళ్లిపోయారని ఉండవల్లి గుర్తు చేసుకున్నారు. . వైఎస్ ఇంట్లోకి కూడా వెళ్లేంత అత్యంత సన్నిహిత అనుబంధం ఉన్న ఇద్దరిలో ఒకరు ఆయన సహచరులు, మాజీ ఎంపి కెవిపి రామచంద్రరావు కాగా, మరొకరు ఉండవల్లి అరుణ్ కుమార్. వైఎస్ జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను ఉండవల్లి గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ మానవతావాది అని, అందుకే మరణించిన తరువాత ప్రజల హృదయాల్లో దేవుడిగా నిలిచిపోయారని ఉండవల్లి కొనియాడారు. తన సోదరుడికి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయనను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్ తన తల్లితో చాలా సేపు మాట్లాడారని, ఆతరువాత ఆమెతో మాట్లాడితే తన తన తల్లితో మాట్లాడినట్టే ఉందని వ్యాఖ్యానించారని గుర్తు చేసుకున్నారు.
రాజమహేంద్రవరంలోని ఉండవల్లి బుక్ బ్యాంకులో వైఎస్సార్ సంస్మరణ సమావేశం జరిగింది. ఈసందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నాటి వీడియోలు, ఫొటోలను తిలకించి, నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ తాను శాసనసభ్యునిగా ఉండగా ఉండవల్లి అరుణ కుమార్, దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుల సహకారంతో ఎన్నోఅభివృద్ధి కార్యక్రమాలు చేశామంటే అందుకు డాక్టర్ వైఎస్ పూర్తిగా సహకరించడమే కారణమని అన్నారు. నల్లా ఛానల్ కి నిధులు వచ్చినా, పేదలకోసం వందెకరాల స్థలం అందునా 36ఎకరాలు దేవాదాయశాఖ స్థలాన్ని సేకరించినా, గామన్ బ్రిడ్జి , ఆర్టీసీ స్థలంలో వర్షపు నీటి నిల్వ కోసం చెరువు తవ్వినా, జాంపేట రైలు వంతెన .. ఇలా ఏది అడిగినా ఓ ఎస్ అంటూ డాక్టర్ వైఎస్ ధైర్యంగా ఒకే చేసారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఛాంబర్ పూర్వాధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి, ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టడం ద్వారా దేవుడు అయ్యారని కీర్తించారు. ఇది ప్రతక్షంగా చూశానని ఆయన ఆసుపత్రిలో చూసిన ఘటనలను ప్రస్తావించారు. ఏదైనా నిజమని నమ్మితే ముందూ వెనక చూడకుండా ధైర్యంగా అమలు చేయగల ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్, డాక్టర్ వైఎస్ నిలిచిపోతారని అన్నారు. వస్త్ర వ్యాపారులకు ఇబ్బందిగా ఉన్న ఆర్డినెన్స్ ని క్షణాల్లో తొలగించిన ఘనత ఎన్టీఆర్ దని, అలాగే మేడప్ టాక్స్ వలన ఇబ్బంది గమనించి రద్దుచేసి ఘనత డాక్టర్ వైఎస్ దని ఆయన ప్రస్తావించారు. డాక్టర్ వైఎస్ కారణజన్ముడని కొనియాడారు. వైసిపి నాయకుడు నక్కా శ్రీనగేష్, సీనియర్ పాత్రికేయుడు వి ఎస్ ఎస్ కృష్ణకుమార్, ప్రసాదుల హరినాధ్ తదితరులు వైఎస్ తో అనుబంధాన్ని, నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పసుపులేటి కృష్ణ, ఎల్ వెంకటేశ్వరరావు, కె.ఎల్.భాస్కర్, వాకచర్ల కృష్ణ, వేలూరి శరత్ తదితరులు పాల్గొన్నారు.