రుడా కోసం రెడీ అయి….నవ్వులపాలై…
రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పదవి తనకే దక్కుతుందని చివరి వరకు ఆశించిన ఒక టిడిపి నాయకుడు చివరకు తీవ్రంగా నిరాశ చెందారు. రాజమహేంద్రవరం నగరానకి…
రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పదవి తనకే దక్కుతుందని చివరి వరకు ఆశించిన ఒక టిడిపి నాయకుడు చివరకు తీవ్రంగా నిరాశ చెందారు. రాజమహేంద్రవరం నగరానకి చెందిన ఉల్లిపాయల వ్యాపారి, టిడిపి నాయకుడు రుడా చైర్మన్ పదవి తనకే దక్కుతుందని చెప్పుకుని ఎంతో ఆశాభావంతో ముందుగానే తన బంధువులను పిలిపించుకున్నారట. పదవుల పందేరం రోజున రుడా చైర్మన్ పదవి తనకే దక్కుతుందని గంపెడాశతో ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకుని తన అనుయాయులతో కలిసి కార్యాలయానికి చేరుకుని హడావుడి చేశారట. రుడా చైర్మన్ ను తానేనని సిబ్బందికి అప్పటికే పలు సూచనలు కూడా చేసేశారని చెబుతున్నారు. అయితే ఆ పదవిని దివంగత మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు కుమారుడు, రాజానగరం టిడిపి ఇన్ చార్జి బొడ్డు వెంకటరమణకు ప్రకటించడంతో తీవ్ర నిరాశ చెందారు. అయితే ఆ ఉల్లిపాయల వ్యాపారి చేసిన హంగామా విన్న టిడిపి నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు నవ్వుకుంటున్నారు.
రాజానగరం సీటును జనసేనకు త్యాగం చేసినందుకు గాను బొడ్డుకు రుడా పదవిని కట్టబెట్టారు. అయితే ఈపదవిపై జనసేన రాజమహేంద్రవరం ఇన్ చార్జి అత్తి సత్యనారాయణ, బిజెపి నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒకదశలో మేయర్ పదవి కోసం పోటీపడుతున్న గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణకు మరోసారి రుడా చైర్మన్ పదవిని అప్పగిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఈనేపథ్యంలో అత్తి సత్యనారాయణ, గన్ని కృష్ణలకు ఇక మిగిలింది మేయర్ సీటే..
పురపాలకశాఖ మంత్రి నారాయణ ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పాలకవర్గం లేకపోవడం వల్ల 2018 నుంచి కేంద్రం నుంచి వివిధ పథకాల కింద మంజూరు కావాల్సిన నిధులు నిలిచిపోతున్నాయని ఉన్నతాధికారులు, పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. కూటమికి అనుకూల పరిస్థితులున్న తరుణంలోనే ఎన్నికలు జరిపిస్తే మేలన్న ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరంపై కొత్తగా వచ్చే మేయర్ పెత్తనాన్ని ఎలా భరిస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 12ఏళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాల సమయంలో నగరంపై పెత్తనం తమకే చెందాలని వారు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నగరపాలక సంస్థ ఎన్నికలు ఇప్పట్లో జరగవన్న ప్రచారం కూడా జరుగుతోంది.