2027 పుష్కరాలకు సరికొత్త ప్రచారం…

2015 గోదావరి పుష్కరాల చేదు అనుభవాల దృష్ట్యా గతంలో చేసిన  ప్రచారానికి భిన్నమైన  ప్రచారాన్ని 2027 గోదావరి పుష్కరాలకు కూటమి  ప్రభుత్వం తలకెత్తున్నట్లు కనిపిస్తోంది.   గోదావరిలో  ఎక్కడ…

 2027 పుష్కరాలకు సరికొత్త  ప్రచారం…

2015 గోదావరి పుష్కరాల చేదు అనుభవాల దృష్ట్యా గతంలో చేసిన  ప్రచారానికి భిన్నమైన  ప్రచారాన్ని 2027 గోదావరి పుష్కరాలకు కూటమి  ప్రభుత్వం తలకెత్తున్నట్లు కనిపిస్తోంది.   గోదావరిలో  ఎక్కడ స్నానం చేసినా పుష్కరాల పుణ్య ఫలం దక్కుతుందన్నది ..ఈప్రచార సారాశం. 2015 గోదావరి పుష్కరాల సమయంలో తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉంది. బిజెపి మిత్రపక్షంగా ఉండేది. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా పుష్కరాలంటూ 2015 గోదావరి పుష్కరాలకు ఎక్కడలేని ప్రచారం కల్పించారు. ఆసమయంలో  రాజమహేంద్రవరం  ఘాట్ల ప్రాధాన్యతపై ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలో పుష్కరాల తొలిరోజే మహాఘోరం జరిగిపోయింది. రాజమహేంద్రవరంలోని పుష్కరాలరేవు వద్ద తొక్కిసలాట జరిగి 30 మంది భక్తులు, యాత్రికులు మృత్యువాత పడ్డారు. ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన విఐపి ఘాట్ ను పక్కన పెట్టి  ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబంతో సహా వచ్చి పుష్కరాలరేవు వద్ద తొలి స్నానం చేశారు. ఈసందర్భంగా తొలిరోజే  భారీగా తరలివచ్చిన భక్తులను  బారీకేడ్లలో నిలిపివేసి,  పుష్కరాల ఈవెంట్ కు అంతర్జాతీయ, జాతీయస్థాయి ప్రాధాన్యతను కల్పించే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో డ్రోన్లతో షూటింగ్ జరిపించారు. బాబు వెళ్లిపోయిన వెంటనే ఘాట్ లోకి భక్తులను అనుమతించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి దాదాపు 30 మంది వరకు భక్తులు, యాత్రికులు దుర్మరణం చెందారు. ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. దుర్ఘటన తరువాత రాజమహేంద్రవరంలోని పోలీసు అతిధిగృహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా కేంద్రంలో చంద్రబాబు విషణ్ణవదనంతో కనిపించారు. తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో ఐదురోజుల పాటు రాజమహేంద్రవరంలోనే ఆయన మకాం వేయాల్సి వచ్చింది. ఆఖరికి పుష్కరాల తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు కమిటీ మీడియా విస్తృత ప్రచారం వల్లే తొక్కిసలాట జరిగిందని తేల్చడం వేరే విషయం…

     

గత అనుభవాల నేపథ్యంలో 2027 గోదావరి పుష్కరాల నిర్వహణ, ప్రచార విషయంలో పర్యాటకశాఖ, సాంస్కృతికశాఖ మంత్రి కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం కొత్త నినాదాన్ని ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో 2027 గోదావరి పుష్కరాల సన్నాహాక సమావేశం జరిగింది. ఈసందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ ఏ ఘాట్ లో స్నానం చేసిన పుష్కర పుణ్యం లభిస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం. యాత్రికులను వికేంద్రీకరించేందుకు జిల్లాను యూనిట్ గా తీసుకుని జోనల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈనేపథ్యంలో భక్తులను ఎక్కడికక్కడ కట్టడి చేసి, సమీపంలోని ఘాట్లకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2027 పుష్కరాల ముహూర్తం ఇదే…

12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే గోదావరి పుష్కరాల తేదీలు ఖరారయ్యాయి. 2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి పుష్కరాల కోసం దాదాపు 8 కోట్ల మంది భ‌క్తులు వ‌స్తారని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో  గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాద‌లు అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. సుమారు రెండున్నరేళ్ల కంటే ఎక్కువ స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు ఇప్ప‌టి నుంచే రంగంలోకి దిగారు. అఖండ గోదావ‌రి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేశారు. జిల్లాలోని గోదావరితీరంలో  ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రో నాలుగు కొత్త ఘాట్లు అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్నారు.రాజమ‌హేంద్రవ‌రం ప‌రిధిలో గోదావ‌రి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బ‌డ్జెట్ ప్రతిపాదించారు. కార్పొరేష‌న్ రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాద‌న‌లు చేశారు. సిటీ బ్యూటిఫికేష‌న్‌, ఐకానిక్ టూరిజం సైట్ ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లతో ప్రతిపాదించారు.

Leave a Reply