మంచు వారి వినోదం
సినిమాలు ఫ్లాప్ అయినా… మంచు మోహన్ బాబు కుటుంబ వివాద చిత్రం మూడురోజుల పాటు తెలుగువారిని వినోదపరిచింది. తండ్రీ కొడుకులు, ఆస్తి తగాదాలు అన్ని కుటుంబాల్లోనూ ఉంటాయి.…
సినిమాలు ఫ్లాప్ అయినా… మంచు మోహన్ బాబు కుటుంబ వివాద చిత్రం మూడురోజుల పాటు తెలుగువారిని వినోదపరిచింది. తండ్రీ కొడుకులు, ఆస్తి తగాదాలు అన్ని కుటుంబాల్లోనూ ఉంటాయి. కానీ సినిమా వాళ్ల ఇళ్లలో జరిగే వేడుకలు, వివాదాలు తెలుసుకోవడం ప్రజలు తమ హక్కుగా భావిస్తారు. అందుకే వాటిని చూపించేందుకు టీవీ చానళ్ల కూడా ఎగబడతాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి, ఇటీవల నాగార్జున కుటుంబాల్లో జరిగిన వివాదాలు, వివాహాల పట్ల కూడా ప్రజలు ఆసక్తి కనపరిచారు. తాను క్రమశిక్షణకు మారుపేరని, తన పిల్లలను ఎంతో క్రమశిక్షణలో పెంచానని మోహన్ బాబు తరుచూ చెప్పుకుంటారు. పెదరాయుడు లాంటి మోహన్ బాబు ఇంట్లోనే వివాదం నెలకొనడం….ఆయనకు చిన్న తనయుడు మంచు మనోజ్ కు మధ్య జరిగిన ఘర్షణ….టీవీ చానల్ లోగోనే ఆయుధంగా చేసుకుని రిపోర్టర్ ను దారుణంగా కొట్టడం వంటి అంశాలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవికి విష్ణు, లక్ష్మీ జన్మించారని, విద్యాదేవి మరణం తరువాత ఆమె సోదరి నిర్మలాదేవిని వివాహం చేసుకున్నారట. వారికి మనోజ్ జన్మించారట. మోహన్ బాబు మాజీ సిఎం వైఎస్ జగన్ కు బంధువు. ఆయన పెద్ద కుమారుడు విష్ణును జగన్ బాబాయి కుమార్తెకు ఇచ్చి వివాహం చేశారు. దివంగత మాజీ ఎమ్మెల్యే దంపతులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనికను వివాహం చేసుకున్నారు. అప్పటికే మౌనికకు పెళ్లయి. ఒక కుమారుడు కూడా ఉండటంతో ఈవివాహం మోహన్ బాబు కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని చెబుతారు. మంచు మనోజ్ వివాహం తరువాత కుటుంబంలో గొడవలు మొదలై…నేడు రచ్చకెక్కాయని విశ్లేషిస్తున్నారు.
3రోజుల క్రితం మంచు విష్ణు, లక్ష్మీ లేని సమయంలో మనోజ్ ఆస్తి కోసం డిమాండ్ చేయడంతో ఆయనకు మోహన్ బాబుకు మధ్య ఘర్షణ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈవ్యవహారం రోడ్డునపడటంతో హైదరాబాద్ శివార్లలోని జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం ఆసక్తికర వార్తల కేంద్రంగా మారిపోయింది. ఇరువర్గాలు బౌన్సర్లతో రంగప్రవేశం చేసి, నివాసాన్ని చుట్టుముట్టడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదులు చేసుకున్నారు. మనోజ్ ను మోహన్ బాబు బయటకు పంపేశారు. దీంతో మనోజ్ మీడియా వారితో కలిసి బలవంతంగా లోపలికి ప్రవేశించే క్రమంలో ఎదురుగా వస్తున్న మోహన్ బాబును ఈవ్యవహారంపై టీవీ-9 రిపోర్టర్ వివరణ తీసుకునే ప్రయత్నం చేయగా, అప్పటికే సహనం కోల్పోయి ఉన్న మోహన్ బాబు లోగో తీసుకుని బలంగా రిపోర్టర్ తలపై మోదారు. ఈసంఘటనలో టీవి-9 రిపోర్టర్ తీవ్రంగా గాయపడగా, మరో మీడియా ప్రతినిధి కూడా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. మోహన్ బాబు లోగోతో కొడుతున్న ఈదృశ్యాలను టివీ-9తో సహా అన్ని చానళ్లు పదేపదే చూపించడం తెలుగు ప్రజలకు వినోదాన్ని పంచడంతో పాటు, ఆ కుటుంబంలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తిని రేకెత్తించింది. అయితే వార్తల కోసం మీడియా ప్రతినిధులు మోహన్ బాబు జొరబడటం కొంత విమర్శలకు దారితీసింది. మనోజ్ వ్యవహారశైలిపై మోహన్ బాబు విడుదల చేసిన ఆడియో కూడా ఆసక్తిని కలిగించింది. మీడియా ప్రతినిధులపై దాడిని తెలుగు రాష్ట్రాల్లోని మీడియా ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తూ నిరసన ప్రదర్శనలు జరిపారు. మీడియా ప్రతినిధిపై దాడి సంఘటనపై పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరోవైపు మోహన్ బాబు కుటుంబ వ్యవహారాల్లో ఇతరులెవరూ జోక్యం చేసుకోవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం…కుటుంబ సభ్యులు ఆస్తి తగాదాలపై చర్చలు జరుపుతుండటంతో 3రోజుల పాటు తెలుగు ప్రజలకు వినోదాన్ని పంచిన మంచు వారి కుటుంబ కథా చిత్రానికి ప్రస్తుతానికి శుభం కార్డు పడినట్టయ్యింది.