ఇదో వ్యూహం!

రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యవహారశైలి, హడావుడి, ఆయన చేసే విమర్శలు  దాదాపుగా మాజీ ఎంపి భరత్ రామ్ ను పోలి ఉంటున్నాయన్నది సొంత పార్టీలోనూ…ప్రత్యర్థి పార్టీల్లోనూ…

 ఇదో వ్యూహం!

రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యవహారశైలి, హడావుడి, ఆయన చేసే విమర్శలు  దాదాపుగా మాజీ ఎంపి భరత్ రామ్ ను పోలి ఉంటున్నాయన్నది సొంత పార్టీలోనూ…ప్రత్యర్థి పార్టీల్లోనూ వినిపిస్తున్న మాట. ప్రత్యర్థి పార్టీకి చెందిన స్నేహితులకు మేలు చేసే వ్యూహాలు రచిస్తున్నారన్న విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గ రాజకీయాల విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. మిత్రపక్షం జనసేనకు చెందిన రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను తాను సొంతంగా ఎంపిక చేసిన తవ్వా రాజా అధ్యక్షుడిగా జరిగిన చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ అభినందన కార్యక్రమానికి ఆహ్వానించలేదు. తాజాగా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సలహా కమిటీలో కూడా బత్తుల పేరు తొలగించినట్లు సమాచారం. రాజమహేంద్రవరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో రాజానగరం ఎమ్మెల్యేను సభ్యుడిగా చేర్చడం ఏనాటి నుంచో సాంప్రదాయంగా వస్తోంది. తాజాగా ఆయన పేరును తొలగించినట్లు జరుగుతున్న ప్రచారం కూటమిలో బీటలకు ఆస్కారం కలిగించే అంశమే. రుడా చైర్మన్ గా రాజానగరం టిడిపి ఇన్ చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరిని నియమించడం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కు కేబినెట్ హోదా కల్పించడంతో నియోజకవర్గంలో బత్తుల ప్రాధాన్యత కాస్త తగ్గుతున్న నేపథ్యంలో కనీసం ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో కూడా చోటు కల్పించకపోవడం రాజకీయంగా ఆయనను ఏకాకిని చేయడమే వ్యూహంగా కనిపిస్తోంది.

మరోవైపు రాజమహేంద్రవరంలో మాజీ ఎంపి భరత్, ఆదిరెడ్డి వాసులు రాజకీయంగా చిరకాల ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. గతంలో కమీషన్లు అంటూ ఆరోపణలు చేసిన వాసు తాజాగా గౌతమీ సూపర్ బజార్ స్థల లీజు వ్యవహారంలో భరత్ పై కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేయడం గమనార్హం.  అయితే భరత్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకే చెందిన మరో నాయకుడి కుటుంబంతో వాసు స్నేహపాత్రంగా ఉండటంతో పాటు, వ్యాపాపరంగా కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నారన్నది విమర్శకుల మాట. భరత్ వైసిపిలో చేరిన నాటి నుంచి ఆ వైసిపి నాయకుడి కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. పార్టీ ప్రయోజనాలను కూడా పక్కనపెట్టి రైలు పట్టాల మాదిరిగా ఇప్పటికీ సొంత వర్గాలను కొనసాగిస్తున్నారు. సింగిల్ సినిమా హీరోలా…సింగిల్ టైం ఎంపిగానే మిగిలిపోతారని సొంత పార్టీ నాయకులే విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం అదే జరుగుతోంది.  ఈనేపథ్యంలో భరత్ ను రాజమహేంద్రవరం రాజకీయాల్లో ఏకాకిని చేసే ప్రయత్నాలు కూడా తెరవెనుక జరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. ఈతెరవెనుక కుటుంబం ఎవరన్నది రాజమహేంద్రవరం, రాజానగరం రాజకీయాలను పరిశీలించే వారందరికీ తెలిసిందే. తెలియని వారు తమ ఊహలకు పదును పెట్టాల్సిందే..

Leave a Reply