• February 15, 2025

…ఇక పురుషులకూ పొదుపు సంఘాలు….మహిళల చేతికి పార్కులు!

మహిళల స్వయంసమృద్ధి కోసం దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మహిళా స్వయంసహాయక సంఘాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో పురుషులకు కూడా స్వయంసహాయక సంఘాలను ఏర్పాటు…

 …ఇక పురుషులకూ పొదుపు సంఘాలు….మహిళల చేతికి పార్కులు!

మహిళల స్వయంసమృద్ధి కోసం దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మహిళా స్వయంసహాయక సంఘాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో పురుషులకు కూడా స్వయంసహాయక సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. మహిళా సంఘాల తరహాలోనే ఐదుగురేసి చొప్పున పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి, రూ. 20వేల రివాల్వింగ్ ఫండ్ ను అందజేస్తారు. అసంఘటితరంగంలోని ఆటోడ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, వృద్ధాశ్రమాలు వంటి సేవా రంగాల్లో పనిచేసే వారిని, స్విగ్గీ, జొమాటో వంటి గిగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులను పొదుపు సంఘాల్లో సభ్యులుగా చేరుస్తారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే 81 పురుష పొదుపు సంఘాలను ఏర్పాటు చేసినట్లు సిటీ మిషన్ మేనేజర్ వి రామలక్ష్మి వెల్లడించారు. ఈసంఘాలకు బ్యాంకు లింకేజీని కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. మరిన్ని సంఘాలను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నట్లు ఆమె చెప్పారు.

మెప్మా, హోమ్ ట్రైనింగ్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక, పురపాలక సంఘాల్లోని ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఎసి మెకానిక్ లు, బ్యూటీషియన్లు వంటి వృత్తి నిపుణులను ఒకే వేదిక మీదకు తెచ్చి, ప్రజలకు ఇంటి వద్దే సేవలు అందించేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు. ప్రత్యేక యాప్, వినియోగదారులకు చేరువయ్యే ఇతర మార్గాలను మెప్మా సిద్ధం చేస్తోంది. ఇంటి వద్దే పనిచేసేందుకు ఇప్పటికే 300 మంది వృత్తి నిపుణులు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో నమోదు చేసుకున్నట్లు మెప్మా సిటీ మిషన్ మేనేజర్ వి రామలక్ష్మి పేర్కొన్నారు. ఇళ్ల వద్ద సేవలకు పేర్లు నమోదు చేసుకున్న వారు తొలుత మెప్మా వద్ద రూ. 1500 చెల్లించి, రీ చార్జి చేయించుకోవాలి. అయితే మెప్మాయే తొలి రీచార్జీలను భరించి, పేర్లను నమోదు చేసుకుంది. సేవలు, ప్రజల స్పందన ఆధారంగా రానున్న రోజుల్లో వృత్తి నిపుణులే రీచార్జి చేయించుకోవాల్సి ఉంటుందని రామలక్ష్మి వివరించారు. మెప్మా వద్ద నమోదైన వృత్తి నిపుణులకు  హోమ్ ట్రైనింగ్ సంస్థ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది.

పార్కుల నిర్వహణ మహిళల చేతికి….

పురుష స్వయంసహాయక సంఘాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా పార్కుల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించడం విశేషం. కేంద్రప్రభుత్వ పథకమైన అమృత్-2.0లో భాగంగా అమృత మిత్ర పథకాన్ని అమలు చేస్తోంది.

ఈపథకం కింద రాజమహేంద్రవరం సహా, రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా పార్కుల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నారు. పార్కుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న తోటమాలి వంటి ఇంజనీరింగ్ సిబ్బందిని తొలగించి, మహిళకే ఆబాద్యతలను అప్పగిస్తారు. మహిళా సంఘాల సభ్యులు పార్కుల నిర్వహణలో భాగంగా ఉదయం 5నుంచి9, సాయంత్రం 4నుంచి రాత్రి 8గంటల వరకు తెరిచి ఉంచుతారు. పార్కు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, గార్డెనింగ్, మొక్కలకు నీళ్లు పోయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను పార్కుల స్థాయిని బట్టి మహిళా సంఘాల్లోని పదేసి మంది సభ్యుల బృందానికి వేతనంగా చెల్లిస్తారు.  ప్రస్తుతానికి 9 నెలలకు గాను రూ. 2.8లక్షల నుంచి 4.4లక్షల వరకు వేతనంగా చెల్లిస్తారని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ వి రామలక్ష్మి వివరించారు. రాజమహేంద్రవరంలోని ఆరు పార్కుల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించారు. అయితే గోదావరిగట్టున ఉన్న పివి నరసింహారావు పార్కు, గౌతమీనందనం పార్కుల్లో పనులు జరుగుతున్నందున తాత్కాలికంగా వీటి నిర్వహణను చేపట్టలేదని, ఆర్వీ నగర్, ఆదర్శనగర్, తెలుకులవారి చెరువు పార్కు, ఎబి నాగేశ్వరరావు పార్కుల నిర్వహణను మహిళా సంఘాలు చేపట్టినట్లు రామలక్ష్మి వెల్లడించారు. అమృత మిత్ర పథకం కింద రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పార్కుల నిర్వహణతో పాటు, నీటి సంఘాల నిర్వహణ,  నీటి నాణ్యత పరీక్షలు, నీటిపారుదలరంగ ప్రాజెక్టులలో మహిళా స్వయం సహాయక బృందాలను భాగస్వాములను చేస్తారు. ఇప్పటికే ఈపథకం కింద రూ. 140 కోట్ల విలువైన 1762 ప్రాజెక్టులను మహిళా స్వయంసహాయక సంఘాలకు అప్పగించారు.

 

Leave a Reply