- February 14, 2025
ఎన్నైనా ఎసిలు వాడండి….ఎంతైనా విద్యుత్ సరఫరా చేస్తాం!
ఈవేసవిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఫిబ్రవరిలోనే ఎండలు మండుతున్నాయి. దీంతో ప్రజలు చల్లదనం కోసం ఎసిలను వినియోగిస్తుండటంతో విద్యుత్ వినియోగం…

ఈవేసవిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఫిబ్రవరిలోనే ఎండలు మండుతున్నాయి. దీంతో ప్రజలు చల్లదనం కోసం ఎసిలను వినియోగిస్తుండటంతో విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. ఇప్పటికే మార్కెట్లలో ఎసిల కొనుగోళ్లు భారీగా పెరిగిపోయాయి. మే నెలలో పరిస్థితులు దారుణంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈఏడాది విద్యుత్ వినియోగం దాదాపు 100 మిలియన్ యూనిట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాది జనవరితో పోలిస్తే ఇప్పటికే 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా అంతరాయాలు లేకుండా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తూర్పుగోదావరి జిల్లా ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ కె తిలక్ కుమార్ భరోసా ఇస్తున్నారు. అయితే వినియోగదారులు ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పథకమైన ఆర్ డి ఎస్ ఎస్ కింద సుమారు 200కోట్ల రూపాయలతో ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని, మార్చి నాటికి ఈపనులు పూర్తవుతాయని చెప్పారు. ఆర్ డి ఎస్ ఎస్ పథకంలో భాగంగా 163 కొత్త వ్యవసాయ ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే అధిక వినియోగంతో భారంగా సాగే ఫీడర్లను గుర్తించి, వాటిని రెండుగా విభజించి, విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరిస్తామన్నారు. దీనిలో భాగంగా 166 ఫీడర్లను గుర్తించి, అదనంగా మరో 166 ఫీడర్లను ఏర్పాటు చేస్తామన్నారు. 113 కొత్త ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాజమహేంద్రవరం నగరంలో 23 కొత్త ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నన్నయ్య యూనివర్శిటీలో 3కోట్ల రూపాయలతో కొత్త సబ్ స్టేషన్ ను నిర్మిస్తున్నామని చెప్పారు. 394 కిలోమీరట్ల హెచ్ టి విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, జిల్లావ్యాప్తంగా 12వేల 87 కొత్త విద్యుత్ స్తంభాలను నెలకొల్పుతామని వివరించారు. గత 3నెలలుగా అధిక భారంపడే ఫీడర్లను ఎస్ ఇ నుంచి సబ్ ఇంజనీర్ల వరకు క్షేత్రస్థాయిలో ప్రతీ నెలా తనిఖీలు చేసి, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈముందస్తు చర్యలకు తోడు అదనంగా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద 984 మంది వినియోగదారులు ఇంటిపై సౌర పలకాల ద్వారా 3.3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని ఎస్ఇ తిలక్ కుమార్ చెప్పారు. సూర్యఘర్ కింద ఉత్పత్తి చేసే విద్యుత్ కు ప్రభుత్వం 5.80కోట్ల రూపాయల సబ్సిడీ అందించిందని, ప్రజలు సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై ప్రత్యేక శ్రద్ధవహించాలని ఎస్ ఇ తిలక్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ఎసిలు వాడే వారికో హెచ్చరిక….ఎసిలు వినియోగించే వినియోగదారుల నుంచి కిలో వాట్ కు అదనంగా 800 రూపాయల లోడ్ చార్జీలను వసూలు చేస్తారన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. పర్యావరణపరంగా ఎసిల వినియోగం తగ్గిస్తేనే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.