గోరంట్ల చెక్…ఎమ్మెల్యే ఆదిరెడ్డి.. అర్బన్ టిడిపి కేడర్ డుమ్మా
రాజమహేంద్రవరం నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కానీ ఈ కార్యక్రమానికి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సహా తెలుగుదేశం పార్టీ…

రాజమహేంద్రవరం నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కానీ ఈ కార్యక్రమానికి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సహా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసైనికులు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. బిజెపి జిల్లా అధ్యక్షుడితో పాటు కొంత మంది నగర నాయకులు పాల్గొన్నారు. మాజీ ఛైర్మన్ గన్ని కృష్ణ చివరి నిమిషంలో వచ్చి హాజరు వేయించుకున్నట్లు కనిపించింది.
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడైనా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజకీయంగా రాజమహేంద్రవరం నగర పొలిమేరల్లోకి రాకుండా అడ్డుకున్నారు. నగరంలో ఉన్న పార్టీ కార్యలయాన్ని కూడా తెరుచుకునే అవకాశం లేకుండా చేశారు. దీనికి ప్రతిగా అన్నట్లు రాజమహేంద్రవరంలోనే ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంలో ఆదిరెడ్డి వర్గీయులకు స్థానం లేకుండా చేసి చెక్ పెట్టారు గోరంట్ల. అప్పారావు తనయుడు రాజమహేంద్రవరం ఎమ్మెల్యే అయినా రాజమహేంద్రవరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంలో ఆదిరెడ్డి వర్గీయులకు చోటు దక్కకపోవడం గమనార్హం. రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గోరంట్ల సన్నిహితుడైన మార్ని వాసుదేవ్ నియమితులయ్యారు. తాజాగా మార్కెట్ కమిటీకి డైరెక్టర్లను కూడా ఖరారు చేశారు. వీరిలో ఒక్కరు కూడా నగరంలోని కూటమి నాయకులకు గానీ, ఆదిరెడ్డి వర్గీయులకు చోటు దక్కలేదు. మొత్తం గోరంట్ల ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికే కడియపులంకకు చెందిన బోడపాటి గోపాలకృష్ణ, డైరెక్టర్లుగా దేవెళ్ల రాంబాబు, బొప్పన నాగేశ్వరరావు, గ్రంధి విజయలక్ష్మి, గంగిన జాహ్నవి, మండా హిమబిందు, పన్నాల వెంకటలక్ష్మి, కోమలి అయ్యన్నరావు, కొప్పిశెట్టి మోహన్ గాంధీ, మేడిశెట్టి సువర్ణకుమారి, బైరిశెట్టి సరోజినీ దేవి, కొల్లి బేబి, జంగా వినోద్ కుమార్, బండి శ్రీజ్యోతి పేర్లను ఖరారు చేశారు. పాలకవర్గంలో మొత్తం ఏడుగురు ఓసిలు, ఐదుగురు బిసి, మైనార్టీలు, ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ వర్గానికి చెందిన వారై ఉండాలి. అయితే చైర్మన్ తో కలిపి మొత్తం ఏడుగురు పాలకవర్గ సభ్యుల్లో ఐదుగురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఉండటం గమనార్హం. కాపు, వైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక్కో పోస్టు కేటాయించారు. కూటమి పార్టీల పరంగా చూస్తే బిజెపికి ఒకటి, జనసేనకు రెండుపోస్టులు కేటాయించారు. నిబంధనల ప్రకారం మార్కెట్ కమిటీ పరిధిలో లైసెన్సు కలిగిన వారికి, 10 ఎకరాల మెట్ట, లేదా ఐదెకరాల మాగాణి వ్యవసాయ భూములు ఉన్న వారికి మార్కెట్ కమిటీ పాలకవర్గంలో స్థానం కల్పించవచ్చు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాలకు చెందిన వారెవరికైనా పాలకవర్గంలో చోటు కల్పించవచ్చు. అయితే రాజమహేంద్రవరం నగరానికి చెందిన పలువురు కూటమి నాయకులకు వ్యవసాయ భూములు ఉన్నా వారిని గోరంట్ల లెక్కలోకి తీసుకున్నట్లు లేదు. గతంలో ఆదిరెడ్డి అప్పారావుతో పాటు, శ్రీరామరెడ్డి అనే వర్తకుడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా పనిచేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఆధిపత్యపోరులో భాగంగా కీలకమైన వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆదిరెడ్డి వర్గాన్ని, నగర కూటమి నాయకులను గోరంట్ల పరిగణనలోకి తీసుకోలేదని, తద్వారా రాజమహేంద్రవరం రాజకీయాల్లోకి అడుగుపెట్టకుండా చేసిన ఆదిరెడ్డి కుటుంబంపై కక్ష సాధించినట్టయ్యిందని విశ్లేషిస్తున్నారు. ఈపరిణామం రానున్న రోజుల్లో గోరంట్ల, ఆదిరెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్యపోరుకు మరింత ఆజ్యంపోసే అవకాశాలు కనిపిస్తున్నాయి.