అయ్యో…ఐఎన్టీయూసీ!
రాజమహేంద్రవరంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్టీయూసి) లో నాయకుల తీరు అంతా గజిబిజి గందరగోళంగా కనిపిస్తోంది. తల్లి కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైన ఐఎన్టీయూసికి తూర్పుగోదావరి జిల్లాలో…

రాజమహేంద్రవరంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్టీయూసి) లో నాయకుల తీరు అంతా గజిబిజి గందరగోళంగా కనిపిస్తోంది. తల్లి కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైన ఐఎన్టీయూసికి తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరేసి అధ్యక్షులు నియమితులు కావడం…ఆ నాయకుల్లో ఒకరు రాజమహేంద్రవరంలో తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన పిల్ల కాంగ్రెస్ నాయకుల వెంట తిరగడం….ఇటీవల జరిగిన మేడే సందర్భంగా ఐఎన్టీయూసిలోని వర్గాలు వేరువేరుగా వేడుకలు జరపడం ఇదంతా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు, వైసిపి కార్యకర్తలను కూడా గందరగోళానికి గురి చేస్తోంది. అన్నాచెల్లెళ్లు వైఎస్ జగన్, షర్మిళ నాయకత్వం వహిస్తున్న వైసిపి, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రస్థాయిలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేపథ్యంలో రాజమహేంద్రవరంలో ఐఎన్టీయూసి నాయకుడు వైసిపి పార్టీలో క్రియాశీలకంగా ఉండటం గమనార్హం.
వర్గ విభేదాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్టీయూసి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధరరావు నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం వైస్సార్సీపి మాజీ ఎంపి మార్గాని భరత్ రామ్ వెంట నడుస్తున్నారు. గతంలో వాసంశెట్టి దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు ప్రధాన అనుచరుడిగా కార్మిక నాయకుడిగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీ తరుపున కార్పొరేటర్ గా కూడా ఎన్నికయ్యారు. దశాబ్దం క్రితం వరకు ఎపిలో అధికార చక్రాన్ని తిప్పిన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించకపోవడంతో వాసంశెట్టి కూడా కాంగ్రెస్ పార్టీని వీడి, వైసిపిలో చేరారు. అలాగే మొన్నటి వరకు వైసిపిలో ఉన్న టికె విశ్వేశ్వరరెడ్డి ఆపార్టీని వీడి, డిసిసి అధ్యక్షుడి పీఠాన్ని దక్కించుకున్నారు. ఆయన వ్యవహారశైలి నచ్చని కొంతమంది నాయకులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఒక దశలో పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలతో బహిరంగంగా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మరోవైపు కుటుంబ పరిస్థితుల కారణంగా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న వాసంశెట్టి గంగాధరరావు ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షుడి పదవిని తెచ్చుకున్నారు. ఇది రుచించని టికె వర్గీయులు విశాఖపట్నం కేంద్రంగా సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేసిన జెటి రామారావును ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షుడిగా నియమింపజేశారు. దీంతో కాంగ్రెస్ మార్కు వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మేడే వేడుకల సందర్భంగా ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో కోటగుమ్మం నుంచి డీలక్స్ సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. మాజీ ఎంపి భరత్ వర్గీయులు కూడా అదే మార్గంలో ర్యాలీ నిర్వహించారు. కాకతాళీయమో…ఉద్దేశపూర్వకమో తెలియదు కానీ ఐఎన్టీయూసి బ్యానర్ పై వాసంశెట్టి గంగాధరరావు నిర్వహించిన ర్యాలీలో మాజీ ఎంపి భరత్ రామ్ పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాసంశెట్టి గంగాధరరావు పార్టీ పరంగా వైసిపిలోనూ…కార్మిక సంఘం పరంగా ఐఎన్టీయూసిలోనూ కొనసాగడం చర్చనీయాంశంగా మారింది. మేడే నాటి ఈపరిణామాలు అటు కాంగ్రెస్ పార్టీలోనూ, ఇటు వైఎస్సార్సీపిలోని వర్గ విభేదాలను, ఐఎన్టీయూసిలో నియామకాల తీరును బహిర్గతం చేశాయి. ఏది ఏమైనా ఐఎన్టీయూసి పరిస్థితి కూడా అచ్చం ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలాగే ఉందన్న చలోక్తులు వినిపిస్తున్నాయి.