మేమంతే…ఆ పార్టీ గతి అంతే…
తాజాగా వైసిపి యువనాయకుడు, మాస్ లీడర్ జక్కంపూడి గణేష్ ఒక యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే తమ రాజకీయ భవిష్యత్ బాగుండాలనే కోరుకునే రాజమహేంద్రవరంలోని…

తాజాగా వైసిపి యువనాయకుడు, మాస్ లీడర్ జక్కంపూడి గణేష్ ఒక యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే తమ రాజకీయ భవిష్యత్ బాగుండాలనే కోరుకునే రాజమహేంద్రవరంలోని వైఎస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు తమకు అనువైన మరో పార్టీలో చేరితే మంచిదేమోనన్న భావన కలుగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉండే రాజమహేంద్రవరం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా మారింది. అలాంటి కంచుకోటను బద్దలుకొట్టాల్సిన వైసిపి నాయకులు ఆధిపత్యపోరు, గ్రూపు తగాదాలతో పార్టీకి నష్టం చేకూరస్తున్నట్లు కనిపిస్తోంది. ఇవి ఇలాగే కొనసాగితే రానున్న మేయర్ ఎన్నికల్లో గానీ…మరే ఎన్నికల్లో గానీ గెలిచే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. మాజీ ఎంపి మార్గాని భరత్ రామ్ చేరికతో పార్టీలో జక్కంపూడి కుటుంబానికి, భరత్ కు మధ్య ఆధిపత్యపోరుకు, గ్రూపు తగాదాలకు బీజం పడింది. నాటి నుంచి ఇవి రాజుకుంటూనే ఉన్నాయి. తాజాగా గణేష్ ఇంటర్వ్యూలో చెప్పిన దాన్ని బట్టి పార్టీ పరాజయం పాలైనా నాయకుల తీరులో మార్పు రాలేదన్నది స్పష్టమవుతోంది. ఎవరికి వారు ఆధిపత్యం కోసం ప్రయత్నించడంతో మధ్యలో కార్యకర్తలు, చోటామోటా నాయకులు నలిగిపోతున్నారు. అధిష్టానం కూడా అటు బిసి నేతను వదులుకోలేక…ఇటు బలమైన కార్యకర్తల బలం కలిగిన జక్కంపూడి కుటుంబానికి సర్దిచెప్పలేక సతమతమవుతోందని అర్థమవుతోంది.
తన తండ్రి దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు సేవలందించిన రాజమహేంద్రవరం రూరల్ ప్రజలకు సేవలందించాలని కోరుకుంటున్నానని, తద్వారా రూరల్ నుంచి పోటీ చేయాలన్న తన మనసులోని మాటను ఈసందర్భంగా బయటపెట్టారు. తనకు పవన్ కల్యాణ్ ఇష్టమని చెప్పడం ద్వారా కాపుల్లో ఆదరణ పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తనకు చిన్ననాటి స్నేహితుడని చెప్పడం ద్వారా రాజమహేంద్రవరంలో మద్యం సిండికేట్ లో జక్కంపూడి కుటుంబానికి వాటా ఇచ్చారన్న ప్రచారానికి ఊతమిచ్చినట్టయ్యిందన్న వాదన వినిపిస్తోంది.
మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థి మార్గాని భరత్ రామ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి, రాజమహేంద్రవరంలోని జక్కంపూడి, భరత్ వర్గాలు ఎప్పటికీ కలిసి పనిచేయవన్న సంకేతాలు పంపినట్టయ్యింది. తానే మార్గాని నాగేశ్వరరావు పేరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని, ఆరోగ్య కారణాల రిత్యా ఆయన కుమారుడు భరత్ ఎంపిగా పోటీ చేసి గెలిచారని గణేష్ చెప్పారు. గతంలో మాజీ మేయర్ ఎంఎస్ చక్రవర్తి, మాజీ ఎంపి జివి హర్షకుమార్, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో తిరిగిన భరత్ తాము కష్టపడితేనే ఎంపి అయ్యారని, అలాంటిది తన మనిషికి ఒక్కరికీ పని చేయలేదని, పదవులు రానియ్యకుండా చేయడంతో పాటు, తన వారిపై కేసులు కట్టించారని ఆరోపించారు. తనపై బ్లేడు బ్యాచ్ గంజాయి బ్యాచ్ అని దుష్ప్రచారానికి ఆద్యుడు భరతేనని చెప్పారు. భరత్ ను రీల్ స్టార్, డ్రామా స్టార్ గా అభివర్ణించడం, ఆవ భూముల్లో అవినీతి గురించి కూడా ప్రస్తావించడం గమనార్హం. నాలుగు మొక్కలు నాటి అభివృద్ధి అంటే ఎలా అని ఎద్దేవా చేశారు. ఆయనపై రోజూ జిల్లా ఇన్ చార్జి మిథున్ రెడ్డికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. తనను తీవ్రంగా బాధపెట్టింది భరతేనని గణేష్ స్పష్టం చేశారు. భరత్ కు ప్రత్యర్థిగా తాము కాకపోతే మరొకరు వస్తారని పరోక్షంగా విభేదాలు సమసిపోయే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. ఏది ఏమైనా జక్కంపూడి కుటుంబం, భరత్ వర్గాల మధ్య ఆధిపత్యపోరుతో రాజమహేంద్రవరంలో వైసిపి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది.