రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని చేధించే అభిమన్యుడెవరు?!
హైదరాబాద్..బెంగుళూరు..చెన్నై నగరాలంతా విస్తీర్ణం…వాహనాల రద్దీ లేకపోయినా…కనీసం విజయవాడ, విశాఖపట్నం అంత పెద్దది కాకపోయినా ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన వాణిజ్య కేంద్రం రాజమహేంద్రవరం నగరంలోని వాహనదారులు మాత్రం…

హైదరాబాద్..బెంగుళూరు..చెన్నై నగరాలంతా విస్తీర్ణం…వాహనాల రద్దీ లేకపోయినా…కనీసం విజయవాడ, విశాఖపట్నం అంత పెద్దది కాకపోయినా ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన వాణిజ్య కేంద్రం రాజమహేంద్రవరం నగరంలోని వాహనదారులు మాత్రం తరుచూ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారు. సరైన ప్రణాళికలు, వాహనదారుల నిర్లక్ష్య ధోరణి, అవగాహన లేమీ కారణంగా నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. కోటగుమ్మం నుంచి మెయిన్ రోడ్డు వరకు గతం కన్నా పరిస్థితి కొంత మెరుగైనా…మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న గంటాలమ్మగుడి వీధి, జెండాపంజారోడ్డు వంటి ప్రాంతాల్లో తరుచూ ట్రాఫిక్ జామైపోతోంది. దానవాయిపేట, దేవీచౌక్, ఎవి అప్పారావు రోడ్డు, జెఎన్ రోడ్డు వంటి ప్రాంతాల్లో కొత్తగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దానవాయిపేటలో ఎక్కువగా ఆసుపత్రులు, అపార్ట్ మెంట్లు, ఇతర వాణిజ్య సంస్థల కార్యాలయాలు ఉండటంతో వాహనాల రద్దీ విపరీతంగా ఉంటోంది. అపార్ట్ మెంట్లు, వాణిజ్య సంస్థలు, ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలను సమకూర్చుకోకపోవడంతో అక్కడికి వచ్చే వాహనదారులు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపివేస్తున్నారు. వీటికి తోడు తోపుడుబండ్ల వ్యాపారులు రోడ్డును ఆక్రమిస్తుండటంతో దానవాయిపేట ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటోంది. దానవాయిపేటలో ఒక వీధిలో నుంచి మరో వీదిలోకి వెళ్లాలంటేనే అరగంట సమయం పడుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల రోడ్ల నిర్మాణం చేపట్టి, కొన్ని రోడ్లలో రాకపోకలు నిలిపివేయడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. జెండాపంజారోడ్డు, గంటాలమ్మగుడి, నల్లమందు సందులోకి తరుచూ కార్లు, ఆటోలు, భారీ వాహనాలు దూరిపోవడంతో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు, చివరకు పాదచారులకు కూడా తీవ్ర అసహనం, ఆగ్రహం తెప్పిస్తోంది. ఆటోడ్రైవర్లు కూడా ఇష్టానుసారం రోడ్ల మలుపుల్లో ఆటోలు నిలిపివేయడం, యువత కూడా అదే మలుపుల్లో వాహనాలు నిలిపివేసి ముచ్చట్లకు దిగి వాహనాల రాకపోకలను కూడా పట్టించుకోవడం లేదని, దీంతో తరుచూ ట్రాఫిక్ జామ్ లు ఏర్పడుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సాయంత్రం పూట కాతేరు, రాజానగరం, తదితర ప్రాంతాల నుంచి ఒకేసారి వందల సంఖ్యలో స్కూలు, కాలేజీ బస్సులు తరలిరావడంతో క్వారీ మార్కెట్, లాలాచెరువు, మోరంపూడి, బైపాస్ రోడ్డు, స్టేడియం రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. నిషేధిత వేళల్లో భారీ వాహనాలు నగరంలోకి చొచ్చుకుని రావడం కూడా ట్రాఫిక్ ఇక్కట్ల రెట్టింపు చేస్తోంది. ప్రస్తుతం ప్రతీ ఇంట్లో మనిషికోటి చొప్పున మోటారు సైకిల్, ఇంటికి రెండేసి చొప్పున కార్లు ఉండటం కూడా రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడానికి కారణాలుగా మారుతున్నాయి. హైదరాబాద్ లో వాహనాలు నడిపిన వారు కూడా రాజమహేంద్రవరం రోడ్ల మీద, వీధుల్లో వాహనం నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
రాజమహేంద్రవరంలో వాహనదారులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఎవరు చేధిస్తారన్నది ప్రధాన ప్రశ్న.జిల్లా ప్రధాన పాలనాధికారి కలెక్టర్, నగరపాలక సంస్థ కమీషనర్, పోలీసు బాస్ జిల్లా ఎస్పీ, కూడా రాజమహేంద్రవరం ఈప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం, రూరల్ ఎమ్మెల్యే, బిజెపి ఎమ్మెల్సీలు నిత్యం ఈమార్గాల్లోనే ప్రయాణిస్తారు. అయితే వీరెప్పుడూ దానవాయిపేట, గాంధీపురం వీధుల్లో ట్రాఫిక్ కష్టాలు పడినట్లు లేదు. వారు ప్రయాణించే సమయాల్లో ముందస్తుగానే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను నియంత్రించడంతో వారికి సామాన్య వాహనదారుల కష్టాలు తెలియకపోవచ్చు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, రాజమహేంద్రవరంలో నెలకొన్న ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని, వాహనాల నియంత్రణ, క్రబద్ధీకరణ, రోడ్ల విస్తరణ, వాహనాల పార్కింగ్ పై ప్రత్యేక శ్రద్ధవహించాలని రాజమహేంద్రవరం నగర ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కమీషనర్ కేతన్ గార్గ్, ఎస్పీ డి నరసింహ కిషోర్ సమన్వయంతో పనిచేసి, ఒక ప్రణాళికను రూపొందిస్తే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చని భావిస్తున్నారు.