వారు పట్టించుకోలేదు…మీరైనా ఎపికి న్యాయం చేయండి….పవన్ కల్యాణ్ కు ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ
రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఎపికి తగిన న్యాయం జరిగేలా పార్లమెంటులో పోరాటం చేసేలా జనసేనతో పాటు మిత్రపక్షానికి చెందిన ఎంపిలను ప్రేరేపించాలని మాజీ ఎంపి…
రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఎపికి తగిన న్యాయం జరిగేలా పార్లమెంటులో పోరాటం చేసేలా జనసేనతో పాటు మిత్రపక్షానికి చెందిన ఎంపిలను ప్రేరేపించాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎపి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కోరతూ లేఖ రాశారు. రాష్ట్ర విభజన తీరుపై ప్రధాని నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పార్లమెంటులో నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో పాటు, ఎపికి జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అయితే ఈఅంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు గతంలోనే లేఖలు రాసినా సరైన స్పందన రాలేదని లేఖలో పేర్కొన్నారు. ఎపికి జరిగిన అన్యాయంపై పవన్ కల్యాణైనా స్పందిస్తారన్న కొద్దిపాటి ఆశతో ఉండవల్లి ఆయనకు లేఖ రాశారు. లేఖను మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖలోని సారాంశం ఇలా ఉంది…..
“ది. 18-2-2014న రాష్ట్ర విభజన బిల్లు విషయమై ఏ విధమైన చర్చా జరగకుండా..ఎంతమంది విభజనకు అనుకూలమో…ఎంతమంది వ్యతిరేకమో డివిజన్ ద్వారా లెక్క తేల్చకుండా, తలుపులు మూసేసి(డివిజన్ జరిగితేనే తలుపులు మూస్తారు) టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసి, రాష్ట్ర విభజన జరిగిపోయిందని లోక్ సభలో ప్రకటించిన విషయం మీకు తెలిసిందే.
ఈవిషయమై నేను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పదేళ్లుగా నడుస్తూనే ఉంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కనీసం కౌంటర్ దాఖలు చేయలేదు.
18-2-2018న మీ చే ఏర్పాటు చేయబడిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన బకాయిలు రూ. 74542 కోట్లుగా లెక్క తేల్చింది.
16-7-2018న అప్పటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబునాయుడు గారిని కలిసి లోక్ సభలో జరిగిన అఘాయిత్యం గురించి వివరించాను. నేను చూపించిన లోక్ సభ రికార్డులను పరిశీలించిన చంద్రబాబునాయుడు గారు నా వాదనతో ఏకీభవించి, లోక్ సభలో ఈవిషయం చర్చించేందుకు నోటీసు ఇవ్వాలని, అలాగే సుప్రీంకోర్టులో రాష్ట్రం తరుఫున అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయించారు. కారణాలేమైనప్పటికీ అవి అమలు కాలేదు.
29-1-2019న విజయవాడలో నేను ఏర్పాటు చేసిన సమావేశానికి వైఎస్సార్సీపి, మార్క్సిస్టు పార్టీలు తప్ప మిగిలిన ముఖ్యమైన పార్టీలకు చెందిన నాయకులంతా హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్ష హోదాలో మీరే ఈసమావేశానికి స్వయంగా హాజరవడంతో సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2019 ఎన్నికల తరువాత ఎవరు అధికారంలోకి వచ్చినా, మనకు జరిగిన అన్యాయం విషయమై పార్లమెంటులో చర్చించాలని, సుప్రీంకోర్టులో ప్రస్తావించాలని ఆ రోజున సమావేశంలో తీర్మానించుకున్నాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపి అధికారంలోకి వచ్చింది. వెంటనే నేను ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి( చంద్రబాబుగారికి రాసినట్టే) ఒక లేఖ రాశాను. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించాలని, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరుపున అఫిడవిట్ దాఖలు చేయాలని, నాటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీల విషయమై గట్టిగా నిలదీయాలని కోరాను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం నుంచి నాకే సమాధానమూ రాలేదు.
4-3-2022న సుప్రీంకోర్టు విచారణలో ఉన్న నా రిట్ పిటిషన్ లో మార్పులు చేశాను. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను దృష్టిలో ఉంచుకుని ఇక ముందు రాష్ట్రాల విభజన ఎలా చేయాలో స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వమని, విభజన ద్వారా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్ట ప్రకారం ఇస్తామన్నవి, రాజ్యసభలో ప్రధాన మంత్రి ఇస్తామని వాగ్ధానం చేసినవి ఇప్పించమని, ఆర్థిక ఒడిదుడుకుల నుంచి బైటపడేసేలా తగు ఆర్డర్లు ఇమ్మని కోరాను.
28-11-2022న సుప్రీంకోర్టులో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వకేట్ శ్రీ అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ…ఇన్నేళ్ల తరువాత ఈకేసును విచారించడం తేనెతుట్టెను కదిలించినట్టవుతుంది కాబట్టి ఈకేసును ఇక మూసివేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున హాజరైన న్యాయవాది ఈవిధమైన వాదన చేయడం నన్నే కాకుండా ఆరోజు కోర్టులో ఉన్న తెలుగు లాయర్లందర్నీ విస్మయానికి గురిచేసింది. సింఘ్వీ చేసిన వాదనను నాతో పాటు మిగతా లాయర్లందరూ గట్టిగా వ్యతిరేకించారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా జరిగిన ప్రక్రియపై విచారణే అనవసరమనడం, కేంద్రం కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయకపోవడం కోర్టు దృష్టికి తెచ్చాం.
23-2-2023న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూణ్ణెళ్ల క్రితం అభిషేక్ సింఘ్వీ చేసిన వాదనతో ఏకీభవించకుండా, ఆంధ్రప్రదేశ్ కు రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన విభజన వల్ల జరిగిన నష్టాలన్నీ వివరిస్తూ, నా వాదనను బలపరుస్తూ కౌంటర్ దాఖలు చేసింది.
అటు పార్లమెంటులో….ఈపదేళ్లలో, ఫిబ్రవరి 2014 నాడు ఉభయ సభల్లో జరిగిన ప్రహసనం గురించి టిడిపి వారు గానీ, వైఎస్సార్సీపీ వారు గానీ చర్చకు నోటీసు ఇవ్వలేదు. నేను మన సభ్యులందరినీ ఈవిషయం పార్లమెంటులో చర్చించవలిసిందిగా కోరుతూనే ఉన్నాను. మనందరమూ ఆంధ్రకు జరిగిన అన్యాయం గురించి నిరంతరం మాట్లాడుతూనే ఉంటాం గానీ పార్లమెంటులో ఆ సంఘటన మీద, ఎందుకో గానీ చర్చించేందుకు ఇష్టపడటం లేదు.
7.2.2018న సాక్షాత్తూ భారత ప్రధాని నరేంద్రమోడీ గారు లోక్ సభలో మాట్లాడుతూ “మీరు పార్లమెంటు తలుపులు మూసేశారు. సభ ఆర్డర్ లో లేదు. ఆంధ్రప్రజల మనోభావాలను విస్మరించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీరే విత్తనాలైతే ఆంధ్రాలో నాటారో…నాలుగేళ్లయినా విభజన సమస్యలు ఇంకా రగులుతూనే ఉన్నాయి.” అన్నారు.
8-2-2022న నరేంద్రమోడీ గారు రాజ్యసభలో మాట్లాడుతూ “మైకులాపేశారు, చిల్లీ స్ప్రే వాడారు. అసలు చర్చే లేదు. ఇదేనా ప్రజాస్వామ్యం…ఇలాగేనా చేయటం” అంటూ నిలదీశారు.
5-8-2019న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రాజ్యసభలో “ ఒక్కసారి కళ్లుమూసుకుని ఆరోజున రాష్ట్ర విభజన మీరెలా చేశారో గుర్తుకు తెచ్చుకోండి…సభ్యులందర్నీ బైటకు పంపేసి, తలుపులు మూసేసి, ప్రత్యక్ష టీవీ ప్రసారాలు ఆపేసి, ఆంధ్ర-తెలంగాణాలను విడదీశారు. అంటూ దుయ్యబట్టారు.
6-8-2019న అమిత్ షా గారు లోక్ సభలో “ ఈసభ ద్వారా ఆంధ్ర-తెలంగాణా ప్రజలకే కాక యావత్ దేశ ప్రజలకూ చెప్పదలిచాను. ఏమి చర్చించారు. ఒక ప్రతిపాదన పంపారు. మూడింట రెండొంతుల మెజార్టీతో అసెంబ్లీ తిరస్కరించింది. ఉభయ సభలూ తిరస్కరించాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. అయినా రాష్ట్ర విభజన చేసేశారు. ఏం చర్చించారు.!? లోక్ సభ తలుపులు మూసేసి, మార్షల్స్ ఎంపిలను ఎత్తి బయట పారేసి, బ్లాక్ డే ఈ వేళ కాదు. ఆరోజు బ్లాక్ డే. ఆరోజున మీరు పార్లమెంటు పవిత్రతను దిగజార్చిన రోజు” అంటూ ధ్వజమెత్తారు.
పార్లమెంటులో దేశ ప్రధాని, హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ కు ఏ విధంగా అన్యాయం జరిగిందో పలుమార్లు ప్రస్తావించారు గానీ…మన రాష్ట్ర ఎంపిలు మాత్రం సభలో ప్రధాని, హోంమంత్రుల ప్రకటనలపై చర్చ జరగాలని కోరలేదు. “ ఇన్నేళ్లయి పోయాక ఇప్పుడిక ఏం లాభం” అంటూ కొందరంటారు. ఎక్కడైతే మన నోరునొక్కి సభా నిబంధనలను తుంగలో తొక్కి భారత రాజ్యాంగాన్ని బ్రష్టు పట్టించారో…అక్కడే మనకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలి అనేదే నా వాదన. చంద్రబాబు గారికి, మీకూ పార్లమెంటు రికార్డులు చూపించి మననెంత తీసిపారేశారో వివరించడం జరిగింది. ఇప్పుడు మీరిద్దరూ భారతీయ జనతా పార్టీతో కలిసి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలోకి రావడం…. విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలోనూ, సహకరించిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనూ అధికారంలో ఉండటం…. మన రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవడానికి, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇదే సరైన సమయమని నా భావన.
మీరీ విషయమై శ్రద్ధ తీసుకుని, పార్లమెంటు ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరూ తద్వారా మనకు జరిగిన అన్యాయం విషయమై చర్చకు నోటీసులిప్పించాలనీ, సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో పడిపోయిన రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలని కోరుతున్నాను”. అని తన లేఖలో ఉండవల్లి కోరారు.