ఆప్ అంత గొప్ప పార్టీ లేదు…. ఇరుకున పెడుతున్న కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి వ్యాఖ్యలు
ఒక వైపు డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు…

ఒక వైపు డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు డిల్లీ గల్లీల్లో ప్రచారం చేస్తున్నారు. డిల్లీలో అధికారం కోసం తీవ్రంగా కృషిచేస్తున్న బిజెపి ఆప్ పార్టీని, ఆపార్టీ అధినేత కేజ్రీవాల్ ను అవినీతిపరులుగా చిత్రీకరిస్తోంది. మద్యం కేసులో మాజీ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా లాంటి వారిని జైలుకు కూడా పంపారు.
మరోవైపు ఎపిలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న టిడిపికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ పార్టీ అంత గొప్ప పార్టీ లేదని కితాబులివ్వడం కూటమి నేతలను ఇరుకునపెట్టేలా ఉన్నాయి. ఆప్ కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణ గల వారని, నిస్వార్థంగా సేవ చేస్తున్నారని పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమహేంద్రవరంలో జరిగిన జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశంలో పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితరుల సమక్షంలోనే రాజశేఖర్ ఈవ్యాఖ్యలు చేయడం గమనార్హం.
రాజశేఖర్ ఢిల్లీలో అమ్మ్ ఆద్మీ పార్టీ పనితీరును ఆదర్శంగా తీసుకుని పని చేయాలని పిలుపునివ్వడం జనసేన కార్యకర్తలకు ఏమోగానీ, విద్యావంతులైన పట్టభద్రులను మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డిల్లీలో కూటమి నేతలు ఆప్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే మరోవైపు టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి ఆప్ ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి వ్యాఖ్యలపై బిజెపి శ్రేణులు గుసగుసలు లాడుకుంటున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా రాజశేఖర్ నిలబెడితే బీజేపీకి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయటం ఏమిటని మండి పడుతున్నారు. రాజశేఖర్ యాధృచ్చికంగా చేసినా..లేక ఉద్దేశపూర్వకంగానైనా ఆప్ ను ఆకాశానికెత్తేసేలా చేసిన వ్యాఖ్యలు పట్టభద్రులను ఆలోచనలో పడేసేలా ఉన్నాయని భావిస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు డిల్లీలో చేస్తున్న ఎన్నికల ప్రచారానికి పూర్తి భిన్నంగా ఆపార్టీకే చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ ఆప్ గురించి వ్యాఖ్యలు చేయడం కూటమి నేతల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.