విశాఖలో ఎకరం 99 పైసలే…టిసిఎస్ ముసుగులో…
విశాఖపట్నంలోని రుషికొండలో ఎకరం భూమి ధరల గురించి గూగుల్ లో వెతికితే ఎకరం సగటున రూ. 3.12 కోట్లు పలుకుతున్నట్లు తేలింది. అదే కాపులుప్పాడులో ఎకరం భూమి…

విశాఖపట్నంలోని రుషికొండలో ఎకరం భూమి ధరల గురించి గూగుల్ లో వెతికితే ఎకరం సగటున రూ. 3.12 కోట్లు పలుకుతున్నట్లు తేలింది. అదే కాపులుప్పాడులో ఎకరం భూమి ధర సగటున రూ. 2కోట్లు పలుకుతోంది. ఇక ఉర్సా క్లస్టర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ గురించి గూగుల్ లో వెతకగా, కనీస సమాచారం కూడా కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఈఅంశాలే రాజకీయ తీవ్ర రాజకీయ విమర్శలకు దారితీస్తున్నాయి. ఐటిరంగ కంపెనీల ప్రోత్సహాకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం టిసిఎస్ కు ఎకరం కేవలం 99 పైసలకే కేటాయించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2012లో తెలుగుదేశం ప్రభుత్వమే ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదని, ఒకవేళ కేటాయించినా మార్కెట్ రేటు మీద కన్నా 10 శాతం తక్కువకు కేటాయించరాదని, ప్రతీ మూడేళ్లకు ఒకసారి మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్రాంతి ఐఏఎస్ ఈఎన్ ఎస్ శర్మ గుర్తు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ విధానాన్ని ఎద్దేవా చేస్తూ ఒక యూట్యూబర్ రూపాయి బిళ్లలను పట్టుకుని విశాఖ తీరంలో రూపాయికి ఏమి వస్తుందంటూ దుకాణాల వెంట తిరగడం..చివరకు రూపాయితో ఎకరం భూమి కొంటానంటూ ముక్తాయింపునివ్వడం ఆసక్తికరంగా మారింది.
సాఫ్ట్ వేర్ సంస్థలను ఆకట్టుకునేందుకు అంటూ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్)కు ప్రభుత్వం దాదాపు 22 ఎకరాలను కేవలం 99 పైసలకే కేటాయించడం. దాని వెనుకే ఊరూపేరు లేని ఉర్సా క్లస్టర్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి మరో 59 ఎకరాలను కేటాయించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దేశంలోనే పేరెన్నికగన్న సంస్థ టిసిఎస్. అలాంటి సంస్థకు దాదాపు ఉచితంగా 22 ఎకరాలను కేటాయించడం ఎంతవరకు సబబు అన్నది ప్రభుత్వ వర్గాలే చెప్పాలి. తమకు 99పైసలకే భూములు కేటాయించాలని సంస్థ కోరిందా లేక ప్రభుత్వమే వారికి పందేరం చేసిందా అన్నది స్పష్టం కాలేదు. సంస్థే కోరితే టిసిఎస్ ఇమేజ్ తగ్గినట్టే భావించాలి. సాఫ్ట్ వేర్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే చొరవ తీసుకుని కేటాయిస్తే టిసిఎస్ ను ఆదర్శంగా తీసుకుని వచ్చే ఆస్థాయి సంస్థలైన విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటి సంస్థలకు కూడా అదే రేటుకు కేటాయించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వివక్ష చూపినట్టే అవుతుంది. టిసిఎస్ సంస్థ 12వేల మందికి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు టిడిపి నాయకులు సమర్థించుకుంటున్నారు. టిసిఎస్ వస్తే మరిన్ని కంపెనీలు వస్తాయని కూడా చెబుతున్నారు. టిడిపి నాయకులు చెప్పినట్టే టిసిఎస్ కంపెనీ వెనుకే ఉర్సా క్లస్టర్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ రావడం దానికి కూడా కాపులప్పాడులో భూములు కేటాయించడమే రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఉర్సా సంస్థ విజయవాడ ఎంపి కేశినేని శివనాధ్ బినామీ అని, గత ఫిబ్రవరిలోనే ఈసంస్థను స్థాపించారని ప్రతిపక్ష వైఎస్సార్సిపి ఆరోపిస్తోంది. ఈసంస్థకు టిసిఎస్ లా కాకపోయినా…3.5 ఎకరాలు రూ. కోటి చొప్పున, మరో 56.36 ఎకరాలు రూ. 50లక్షల చొప్పున మొత్తం దాదాపు 60 ఎకరాలను కేటాయించారు. ఈకంపెనీ రూ. 5వేల కోట్లకు పైగా వెచ్చించి డేటా సెంటర్ స్థాపించి, 2500 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని చెబుతున్నారు. 5వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే సంస్థ ఒక అపార్ట్ మెంట్ లో రిజిస్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. రెండేళ్లలో టిసిఎస్, ఉర్సాలు ప్రాజెక్టులు వెనక్కి తీసుకోకపోతే భూములు వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ప్రశ్నార్థకమే. టిసిఎస్ వంటి సంస్థను నమ్మినా ఒక అపార్ట్ మెంట్ లో నడిచే…అమెరికాలో సుమారు 9నెలల క్రితం ప్రారంభించిన ఉర్సా వంటి సంస్థను ఎలా నమ్మాలన్నది ఇక్కడ ఉదయిస్తున్న ప్రశ్న. ఈసంస్థకు కోట్ల రూపాయల విలువైన భూములను రూ. 50లక్షలకు కేటాయించడం గమనార్హం. ఈసంస్థ ఐటి కార్యకలాపాలు చేయకుండా భూములు అమ్ముకున్నా బోల్డంత లాభం వస్తుంది. పైగా ఉర్సా కంపెనీ ప్రమోటర్…టిడిపి ఎంపి కేశినేని శివనాధ్ క్లాస్ మేట్లు కావడం కూడా సందేహాలకు తావిస్తోంది. ఈవిధానంలో టిసిఎస్ లాంటి సంస్థల పేరు చెప్పి ప్రభుత్వం ఉర్సా లాంటి సంస్థలకు భూ పందేరం జరిపే అవకాశాలు లేకపోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టిసిఎస్ కు ఎకరం 99 పైసలకే కేటాయించామని, మిగిలిన సంస్థలకు ఎకరం అరకోటి నుంచి కోటి చొప్పున కేటాయించామని సమర్థించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ భూపందేరంపై టిడిపి నాయకులు మినహా, కూటమిలోని ఇతర పార్టీల నేతలు నోరుమెదపకపోవడం గమనార్హం.