సొంత పార్టీ నేతలపై జక్కంపూడి ధ్వజం

రాజమహేంద్రవరం వైఎస్సార్సీపిలో అంతర్గత విభేదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. మాజీ ఎమ్మెల్యే, వైసిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు  జక్కంపూడి రాజా, మాజీ ఎంపి, వైసిపి…

 సొంత పార్టీ నేతలపై జక్కంపూడి ధ్వజం

రాజమహేంద్రవరం వైఎస్సార్సీపిలో అంతర్గత విభేదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. మాజీ ఎమ్మెల్యే, వైసిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు  జక్కంపూడి రాజా, మాజీ ఎంపి, వైసిపి అధికార ప్రతినిధి  మార్గాని భరత్ రామ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజా వ్యాఖ్యలు మరింత మంటలు పుట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి భరత్ రామ్ పేరు ఎత్తకుండానే ఆయనపైనా, ఆయన వర్గీయులపైనా ధ్వజమెత్తడం గమనార్హం. భరత్ రామ్ పార్టీలో చేర్చుకున్న ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి ఒక బ్రోకర్ అని ఆయన తీవ్రంగా ఆరోపించారు. అతడి కారణంగానే కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. నిజానికి తమ పార్టీ అధికారంలో ఉండగానే కార్మికులకు వేతన ఒప్పందం జరిగి ఉండాల్సిందని,అంతర్గత రాజకీయాల వలన కుదరనందుకు బాధగానే ఉందని ఆయన అన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి డైరెక్షన్ లో ప్రవీణ్ చౌదరి నడిచేవాడని ఆయన ఆరోపించారు. కార్మికులకు చేసిన అన్యాయం నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకోడానికి  వైసిపిని ఆశ్రయించాలని ప్రవీణ్ చౌదరి ప్రయత్నం చేయడంతో, తాము ఒప్పుకోలేదని ఆయన చెప్పారు. దాంతో వేరే మార్గం ద్వారా పార్టీలోకి వచ్చాడని పరోక్షంగా భరత్ ద్వారా పార్టీలో చేరినట్లు చెప్పకనే చెప్పారు.  పేపరుమిల్లు కార్మికులకు న్యాయం చేయాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేసారు. గతంలో చేసిన వేతన ఒప్పందం కంటే తక్కువ చేస్తామనడం సమంజసం కాదన్నారు.

 

జనసేన ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి

పార్టీలోని ప్రత్యర్థి వర్గంతో పాటు, రాజానగరంలోని తన రాజకీయ విరోధి జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై కూడా జక్కంపూడి రాజా విరుచుకుపడ్డారు. పెనమలూరులో బరుల దగ్గర జనసేన జెండాలు ప్రదర్శించారన్న సాకుతో ఒకర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసారని, అయితే జనసేనాని, ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రమంతా సాగిన బరుల వ్యవహారం లో టీడిపీ,జనసేన నేతల తీరుకు ఏమిచర్యలు తీసుకుంటారని జక్కంపూడి రాజా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా రాజానగరం ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని, అలాగే కూటమి నుంచి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేసారు. రాజానగరం నియోజక వర్గంలో ఇసుక, మద్యం దందాలు పెరిగిపోయాయని,ఇక సంక్రాంతికి అయితే అన్నిచోట్లా బరులు ఏర్పాటుచేసి,ఒక్కొక్కరు  10లక్షల నుంచి కోటి రూపాయల వరకు వేలం పెట్టి మరీ వసూలు చేయడం ద్వారా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రూ 10కోట్లు దండుకున్నారని జక్కంపూడి రాజా తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్ము వసూలు చేసుకోవాలి కదా అని చెబుతున్నారని ఆరోపించారు. రాజానగరంలో ఎప్పుడూ లేని విధం గా డ్రగ్స్,రేవ్ పార్టీలు, జూదాలు జరిగాయని అనకాపల్లిలో పట్టుకున్న గంజాయి మూలాలు కాపవరంలో జనసేన నాయకుడు దగ్గర దొరికాయన్నారు.

గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి వంటి పథకాలతో వచ్చిన డబ్బులతో పిల్లలకు బట్టలు తీసి, సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకునే వారని జక్కంపూడి రాజా వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల వద్ద డబ్బులు ఆడక సంక్రాంతి పండుగ కళ తప్పిందన్నారు. సంపద సృష్టిస్తామన్న కూటమి పార్టీ నేతలు  సంక్రాంతి పండగకు గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో కోడిపందేలు, పేకాట, గుండాట,వంటి జూద శిబిరాలు ఏర్పాటుచేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచేశారని రాజా ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 2వేల బరులు ఏర్పాటుచేస్తే, అందులో 400వరకు బడులనే కేంద్రంగా చేసుకుని జూదాలు నడిపారని ఆయన ధ్వజమెత్తారు. ఇక మద్యo ఏరులై పాటిందని, చరిత్రలో ఎన్నడూలేని విధంగా 400కోట్ల రూపాయలు ఈ సంక్రాంతికి మద్యం అమ్మకాలు సాగినట్లు తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసే పత్రికలోనే వచ్చిందని జక్కంపూడి రాజా సదరు పత్రిక వార్తను చదివి విన్పించారు.సంపద సృష్టి అంటే ఇదేనాఅని ప్రశ్నించారు. బరుల దగ్గర పోలీసులను పక్కకు గెంటేయడం, తోసెయ్యడం వంటివి చూస్తుంటే,అసలు లా ఆర్డర్ ఉందా అని ఆయన నిలదీశారు.

 

 

 

 

 

Leave a Reply