లోకేష్ సిఎం అయితే….పవన్ భవిష్యత్ ఏమిటీ?!

జనవరి 23న టిడిపి యువనేత…షాడో ముఖ్యమంత్రిగా చెలామణి అవుతున్న లోకేష్ జన్మదినం వేళ  ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కోరస్ గా లోకేష్ ను ఏకంగా ముఖ్యమంత్రిని…

 లోకేష్ సిఎం అయితే….పవన్ భవిష్యత్ ఏమిటీ?!

జనవరి 23న టిడిపి యువనేత…షాడో ముఖ్యమంత్రిగా చెలామణి అవుతున్న లోకేష్ జన్మదినం వేళ  ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కోరస్ గా లోకేష్ ను ఏకంగా ముఖ్యమంత్రిని చేయాలని, కనీసం ఉప ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నాయి. ఒక టిడిపి నాయకుడు దావోస్ పర్యటనలోనే భావి ముఖ్యమంత్రి లోకేషే అని ఘంటాపథంగా ప్రకటించారు. తెలుగు తమ్ముళ్ల లోకేష్ కోరస్ కు ఎల్లో మీడియా కూడా ప్రముఖ ప్రాధాన్యనిస్తోంది. దీనిర్థం ఎల్లో మీడియా కూడా చంద్రబాబు తరువాత లోకేషే ఈపదవిని చేపట్టాలని కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

 ఒక ఎల్లో మీడియా పత్రికాధిపతి రాసిన తొలిపలుకే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. చంద్రబాబు మళ్లీ పాతపంథాలోనే అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ…రాజకీయాలను పక్కనపెట్టారని బాధపడ్డారు. ఈనేపథ్యంలో మళ్లీ వైసిపి అధికారంలోకి రావచ్చేమోనన్న ఆందోళన వెలిబుచ్చారు. 2029 నాటికి చంద్రబాబునాయుడు 80వ పడిలోకి అడుగు పెడతారని, అప్పటికీ లోకేష్ ను సంసిద్ధుడ్ని చేయాలని సలహా ఇచ్చారు. పవన్ కల్యాణ్ బిజెపి మనిషి అని, ఆయన ఎప్పుడైనా డిల్లీకి వెళ్లే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. 2029లో చంద్రబాబునాయుడు పక్కకు తప్పుకుని, లోకేష్, పవన్, జగన్ మధ్యే రాజకీయ పోటీ ఉంటుందని ఆయన విశ్లేషించారు. ఈనేపథ్యంలో పవన్, జగన్ జత కడితే పరిస్థితి ఏమిటని పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు నీడలో లోకేష్ ఎదగలేరన్నది ఆయన వాదన.  

 గత తెలుగుదేశం హయాంలో, మొన్నటి వైసిపి హయాంలో రెండేసి చొప్పున ఆయా సామాజిక వర్గాల ఆధారంగా ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారు. అయితే పేరుకే వారు ఉప ముఖ్యమంత్రులు తప్ప పెత్తనమంతా ముఖ్యమంత్రుల చేతుల్లోనే ఉండేది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతు లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చేదే కాదన్నది కాదనలేని వాస్తవం. దీంతో తప్పనసరి పరిస్థితుల్లో పవన్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. ఆయన కూడా గత ఉప ముఖ్యమంత్రుల్లా కాకుండా కాస్త క్రియాశీలకంగా వ్యవహరించడం తెలుగుతమ్ముళ్లకు నచ్చినట్లు లేదు. తమ ఆధిపత్యం ఎక్కడ తగ్గిపోతుందోనన్న భయం ఒక సామాజిక వర్గంలో కనిపిస్తోంది.

వ్యూహాత్మకంగా తొలిపలుకు వినిపించిన కొద్దిరోజుల తరువాతే లోకేష్ కు డిప్యుటీ సిఎం పదవి అన్న నినాదం టిడిపి శ్రేణుల్లో మొదలైంది. తండ్రి చంద్రబాబునాయుడి కౌటిల్య రాజకీయ శైలికి భిన్నంగా ఆయన తనయుడు  యువనేత లోకేష్ సొంత కోటరీని ఏర్పాటు చేసుకుని దూకుడుగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ  షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈవైఖరి టిడిపిలోని ఒక సామాజిక వర్గానికి, ఆయన కోటరీకి నచ్చుతోంది.

 ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు, లోకేష్ కూడా వెళ్లారు. దీంతో ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. పేరుకే ముఖ్యమంత్రి కానీ పెత్తనమంతా దావోస్ నుంచే సాగుతుందన్నది వాస్తవం. పార్టీ శ్రేణుల డిమాండ్ మేరకు లోకేష్ సిఎం గానీ…డిప్యుటీ సిఎంగానీ అయితే పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విందు సమావేశం సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉన్నా అక్కడ రెండే కుర్చీలు ఉండటంతో పవన్ కోసం అమిత్ షా మరో కుర్చీ తెప్పించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక లోకేష్ పదవి చేపడితే అధికారంలోనూ, రాష్ట్రంలోనూ సహజంగానే పవన్ పవర్ తగ్గిపోతుంది. గత ప్రభుత్వంలో కూడా కాంట్రాక్టులు వంటి కీలక వ్యవహారాలన్నీ లోకేషే చక్కబెట్టేవారట.  లోకేష్ కు డిప్యుటీ సిఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ పై జనసేన సైనికులు ఇప్పటికే అంతర్గతంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. టిడిపి శ్రేణులు కోరుకున్నట్లు జరిగితే టిడిపి-జనసేన మధ్య పొరపొచ్చాలు వచ్చే ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే 2029 ఎన్నికల నాటికి కూటమి విచ్ఛిన్నమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేము. పరోక్షంగా ఈపరిణామాలు వైసిపికి కలిసివస్తాయి. లోకేష్ కు పదవి విషయంలో 2029 వరకు సంయమనం పాటించడమే టిడిపి మంచిదన్నది ఎపిలోని టిడిపి శ్రేయస్సు కోరుకునే మెజార్టీ ప్రజల అభిప్రాయం. కూటమి రాజకీయ భవిష్యత్ కోసం పవన్ ను సిఎం చేసి, లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేసే విషయాన్ని కూడా ఆలోచించవచ్చు. 

చంద్రబాబు వారసుడిగా లోకేష్ కన్నా బిసి సామాజిక వర్గానికి చెందిన యువ కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అయితే సమర్థుడన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. పాలనా అనుభవం లేకపోయినా డిల్లీ స్థాయిలో మంచి వక్తగా.. రాజకీయ, ప్రజానేతగా రామ్మోహన్ నాయుడు ఇప్పటికే తనను తాను రుజువు చేసుకున్నారు. తగిన మార్గనిర్ధేశం లభిస్తే రామ్మోహన్ నాయుడు ఎపి భవిష్యత్ నాయకుడు కాగల సత్తా ఉన్నవాడే.

Leave a Reply