బిజెపి అంతర్గత లుకలుకలతో అనూహ్యంగా తెరపైకి పిక్కి నాగేంద్ర!
తూర్పుగోదావరి జిల్లా బిజెపి నూతన అధ్యక్షుడిగా నియమితులైన బిసి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన పిక్కి నాగేంద్ర ఆపదవిని చేపట్టడం చాలా అనూహ్యంగా జరిగిపోయింది. ఒక…

తూర్పుగోదావరి జిల్లా బిజెపి నూతన అధ్యక్షుడిగా నియమితులైన బిసి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన పిక్కి నాగేంద్ర ఆపదవిని చేపట్టడం చాలా అనూహ్యంగా జరిగిపోయింది. ఒక విధంగా పార్టీలోని అంతర్గత లుకలుకలే ఆయనను జిల్లా అధ్యక్షుడ్ని చేశాయని చెప్పవచ్చు. బిజెపి నాయకురాలు ఎన్ హారికను అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా నాగేంద్రను తెరపైకి తేవడంతో ఆయన అధ్యక్షుడై కూర్చున్నారు. ఈవిషయంలో బిజెపిలో సంస్థాగతంగా గట్టి పట్టున్న జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు చక్రం తిప్పారు. ఇటీవల బిజెపి జిల్లా స్థాయి సంస్థాగత ఎన్నికలు జరిగాయి. దానిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాకు కూడా నూతన అధ్యక్షుడి నియామకం కోసం ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత అధ్యక్షుడు బొమ్ముల దత్తు మరోసారి ఈ పదవిని ఆశించినా ఆయనను రాష్ట్ర కార్యవర్గానికి పంపాలని నిర్ణయించారు. గతనెలలో అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు స్వీకరించగా, హారిక కూడా నామినేషన్ దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి 60ఏళ్ల లోపు వయస్సు ఉండాలని పరిమితిని నిర్ధేశించారు. తొలుత ఈపదవి కోసం హారికతో పాటు సీనియర్ నాయకుడు అడబాల రామకృష్ణ, యెనుమల రంగబాబు, కొవ్వూరుకు చెందిన ముప్పరాజు శ్రీనివాస్ పోటీ పడ్డారు. అడబాల వయస్సు 60 ఏళ్లు దాటడంతో ఆయనను పక్కనపెట్టారు. రంగబాబు పోటీలో నిలవగా… ఆయనకు 60ఏళ్లు దాటినట్లు హారికే వయస్సు ధ్రువీకరణ పత్రాలను అందజేసి ఆయనను రంగంలోకి పక్కకు తప్పించినట్లు బిజెపి వర్గాల ద్వారా తెలిసింది. తరువాత సామాజిక వర్గాల వారీగా అధ్యక్ష పదవిని నిర్ధారించడంతో ముప్పరాజు శ్రీనివాస్ కూడా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. పార్టీలోని కమ్మ లాబీ మద్దతుతో చివరి నిమిషం వరకు అధ్యక్ష పదవికి పోటీ పడ్డారని చెబుతున్నారు. ఈనేపథ్యంలో సోము వీర్రాజు రంగంలోకి దిగి అనూహ్యంగా కొవ్వూరుకు చెందిన పిక్కి నాగేంద్రను తెరపైకి తెచ్చి అధ్యక్షుడిగా నియమింపజేశారు. దీంతో పురంధరేశ్వరి కూడా ఎదురుచెప్పలేని పరిస్థితి ఏర్పడిందట. హారిక జిల్లా అధ్యక్షురాలైతే మా పార్టీ పరిస్థితి మరో విధంగా ఉండేదని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక విధమైన భయాందోళనలు వ్యక్తం చేయడం గమనార్హం.