చిత్ర సీమలో మెగాస్టారే కానీ….

కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ మెగా స్టార్ చిరంజీవి అంటే భారతదేశమంతా తెరపరిచితమే. చిరంజీవి పేరు చెబితే చాలు తెలుగునాట ఉత్సాహం…

 చిత్ర సీమలో మెగాస్టారే కానీ….

కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ మెగా స్టార్ చిరంజీవి అంటే భారతదేశమంతా తెరపరిచితమే. చిరంజీవి పేరు చెబితే చాలు తెలుగునాట ఉత్సాహం ఉరకలేస్తుంది. నాలుగు దశాబ్దాలకు తెలుగుచిత్రసీమలో చిరంజీవిగా వెలుగొందుతున్న ఆయన హీరోయిజాన్ని చూపించగలరు…అవసరమైతే కామెడీని పండించగలరు. ఆయన నటించిన ఎనిమిది సినిమాలు అత్యధిక వసూళ్లు రాబట్టాయి-ఇది వందేళ్ల చిత్రపరిశ్రమ చరిత్రలో సాటిలేని రికార్డ్ గా నిలిచింది. తెలుగు చిత్రసీమలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి తనతో పాటు, తన కుటుంబానికి మెగా లోకాన్ని నిర్మించారు. తన సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ లతో పాటు, తన కుమారుడు రామ్ చరణ్, బావమరిది అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇలా తెలుగు సినీరంగంలో ఒక మెగా కాంపౌండ్ నే సృష్టించారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లో, సామాజిక సేవా రంగాల్లో తనదైన ముద్రవేశారు.
చిరంజీవి 22 ఆగష్టు 1955 న కొణిదెల పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకటరావు అంజనా దేవి దంపతులకు జన్మించారు. కానిస్టేబుల్ గా పనిచేసి తండ్రికి తరుచూ బదిలీలు కావడంతో తన బాల్యాన్ని తన స్వగ్రామంలో తన తాతయ్యతో గడిపారు. అనంతరం నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరిలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఒంగోలులో జూనియర్ కళాశాల విద్యను పూర్తి చేశారు. NCC క్యాడెట్ మరియు 1970ల ప్రారంభంలో న్యూ ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్నారు. సినిమాలపై ఎంతో ఆసక్తి కలిగిన చిరంజీవి నర్సాపురంలోని శ్రీ వైఎన్ కళాశాల నుండి వాణిజ్యశాస్త్రంలో పట్టా పొందిన తరువాత 1976లో చెన్నైకి వెళ్లి మద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. కులదైవం ఆంజనేయస్వామిని పూజించే తల్లి సూచన మేరకు సినిమారంగంలో తన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు.
చిరంజీవి తొలిసారిగా పునాదిరాళ్లుతో నటుడిగా చిత్రసీమలో అరంగేట్రం చేసారు. అయితే మొదటి థియేటర్లలో విడుదలైంది ప్రాణం ఖరీదు . 1983లో విడుదలైన ఖైదీ సినిమా ఆయన నట జీవితాన్ని ఒక మలుపుతిప్పింది. . 1980-1990 దశకాల్లో చిరంజీవి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించారు. అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి భారతీయ నటుడిగా గుర్తింపు పొందారు. ఆపద్భాంధవుడు, స్వయంకృషి , రుద్రవీణ చిత్రాల్లోని ఆయన నటన విమర్శకుల ప్రశంసలు పొంది, నటనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రేక్షకులకు పరిచయం చేసింది. రాజకీయాల్లో ప్రవేశం కారణంగా సుదీర్ఘ విరామం తరువాత 2017లో ఖైదీ నంబర్ 150 చిత్రంతో మరోసారి హిట్ కొట్టారు. రాజకీయాలకు దూరమైన చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు పెద్దదిక్కుగా మారారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
రక్తం కొరత కారణంగా ఎవరూ మరణించకూడదన్న నినాదంతో బ్లడ్ బ్యాంకు స్థాపన ద్వారా సామాజిక సేవల్లో కూడా చిరంజీవి చురుకైన పాత్రను పోషించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అతిపెద్ద రక్తనిధి కేంద్రాన్ని, నేత్రదాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు 2002 నుండి 2006 వరకు వరుసగా ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి “ఉత్తమ స్వచ్ఛంద రక్త బ్యాంకు అవార్డు”తో సహా అనేక ప్రశంసలను అందుకుంది. కోవిడ్ బాధితుల కోసం 2021 మేలో చిరంజీవి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు, అంబులెన్స్ లు నడిపారు.

1980 ఫిబ్రవరి 20న చిరంజీవి తెలుగు హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు . [ 24 ] [ 25 ] వారికి ఇద్దరు కుమార్తెలు సుష్మిత , శ్రీజ కుమారుడు రామ్ చరణ్. రామ్ చరణ్ కూడా సినీ పరిశ్రమలో తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. చిరంజీవికి ఇద్దరు సోదరులు ఉన్నారు, పెద్ద సోదరుడు నాగేంద్ర బాబు , సినీ నిర్మాతగా, నటుడిగా రాణిస్తున్నారు. సోదరుడు పవన్ కల్యాణ్ సహకారంతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ప్రముఖ సినీ నిర్మాతగా వెలుగొందుతున్నారు. ఆయన కుమారుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనను తాను నిరూపించుకుని తెలుగు చిత్రసీమలో ప్రముఖ హీరోగా పేరుతెచ్చుకున్నారు. మేనల్లుళ్లు వరుణ్ తేజ్ , నిహారిక , సాయి ధరమ్ తేజ్ , పంజా వైష్ణవ్ తేజ్ మరియు అల్లు శిరీష్ తెలుగు సినీ రంగంలో వర్థమాన తారలుగా ఎదుగుతున్నారు. చిరంజీవి ఇండియన్ సూపర్ లీగ్ ,కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ క్లబ్ లలో భాగస్వామిగా ఉన్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగో సీజన్‌తో చిరంజీవి బుల్లితెరపై కూడా అరంగేట్రం చేశారు.
సినీ, సామాజిక రంగాల్లో చేసిన కృషికి గాను చిరంజీవి లెక్కకు మించి అవార్డులు, రివార్డులు పొందారు. 2024లో భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్, 2006లో పద్మభూషణ్‌ను చిరంజీవి అందుకున్నారు. అదే సంవత్సరంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. తొమ్మిది సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. మూడు సార్లు నంది అవార్డులను గెలుచుకున్నారు . 2014లో ఇంటర్నేషనల్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డును అందుకున్నారు. 1987లో ఆస్కార్ వేడుకకు ఆహ్వానించబడిన తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందారు. 2016 – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రఘుపతి వెంకయ్య అవార్డు పొందారు. కళల ద్వారా సామాజిక సేవలకు గాను ఇటీవలే బ్రిటన్ పార్లమెంటులో జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు.
చిత్రసీమలో మెగాస్టార్ గా రాణించిన చిరంజీవి తిరుపతిలో 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజారాజ్యం పార్టీ 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పార్టీ 294 సీట్లలో 18 స్థానాలను గెలుచుకుంది. 16% కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. తిరుపతి , పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేసిన చిరంజీవి పాలకొల్లులో ఓటమిపాలయ్యారు. అయితే రాజకీయాల్లో చిరంజీవి ఇమడలేకపోయారు. 2011లో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆతరువాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల విభజన నేపథ్యంలో చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. అయితే ఎపిలో అధికార పగ్గాలు చేపట్టాలన్న ఆయన ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ఓపికగా పార్టీని కొనసాగిస్తే నేటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన ఆశ నెరవేరేదేమో. తన సోదరుడు, జనసేన అధినేత, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ద్వారా తన ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజాభిమానంతో పాటు, లెక్కకు మిక్కిలి అవార్డులు, రివార్డులు పొందిన మెగాస్టార్ ఎప్పటికీ తెలుగువారి హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోతారనడంలో సందేహం లేదు.

ఆగస్టు 22న చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా….

1 Comments

  • ఐటెం బాగుంది కానీ…చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానులకు కోపం వస్తుంది

Leave a Reply