విలీనం పైనే వివాదం…ఎన్నికలు ప్రశ్నార్థకం!
దాదాపు విజయవాడలో కలిసిపోయిన రామవరప్పాడు పంచాయితీని విజయవాడలో ఎందుకు విలీనం చేయడం లేదు…రాజమహేంద్రవరానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను విలీనం చేసేందుకు పాలకులు ఎందుకు పట్టుబడుతున్నారో అర్థం…

దాదాపు విజయవాడలో కలిసిపోయిన రామవరప్పాడు పంచాయితీని విజయవాడలో ఎందుకు విలీనం చేయడం లేదు…రాజమహేంద్రవరానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను విలీనం చేసేందుకు పాలకులు ఎందుకు పట్టుబడుతున్నారో అర్థం కావడం లేదు. ఇదీ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో పరిసర గ్రామాల విలీనానికి వ్యతిరేకంగా కోర్టులో పోరాడుతున్న వైసిపి నాయకుడు నక్కా రాజబాబు ప్రశ్న. గ్రామాల విలీన అంశమే రాజమహేంద్రవరం నగరానికి ఆరేళ్లుగా ప్రజాపాలకవర్గం లేకుండా చేసింది. గతంలో కూడా ఇలాగే జరిగింది. గ్రామాల విలీన అంశం రాజకీయ ఆధిపత్యానికి దారితీస్తున్నాయి. గ్రామాలపై పెత్తనం కోసం గ్రామ స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు రాజకీయాలు చేయడంతో అటు రాజమహేంద్రవరం సహా విలీన ప్రతిపాదిత గ్రామాల్లో కూడా అభివృద్ధి, పాలన కుంటుపడుతోంది. ఎన్నికల సమయంలో గ్రామాల విలీనం జరగదంటూ ప్రచారం చేసిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల తరువాత రాజమహేంద్రవరం రాజకీయాల్లో పట్టుకోసం గ్రామాల విలీన అంశాన్ని తెరపైకి తెస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల విలీనాన్ని రాజమహేంద్రవరంసిటీ ప్రజాప్రతినిధులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తోంది. సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఒక మాటమీదకు వస్తే నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించడం పెద్ద విషయం కాదు. గ్రామాలను కలుపుకుని లేదా, ప్రస్తుతం ఉన్న డివిజన్లతో ఎన్నికలు నిర్వహించవచ్చు. ఈవిషయంలో వారెంత వరకు సముఖంగా ఉన్నారన్నదే ప్రశ్నార్థకం.
రాజమహేంద్రవరంలో ప్రజాపాలన స్థానిక ప్రజాప్రతినిధులు, పాలకులకు మొదటి నుంచీ పెద్దగా ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. మున్సిపాలిటీగా ఆవిర్భవించిన నాటి నుంచి, నేటి వరకు రాజమహేంద్రవరం పాలకవర్గాల చరిత్రను పరిశీలిస్తే ఈవిషయం స్పష్టమవుతుంది. 1992 వరకు మున్సిపల్ కౌన్సిల్ రాజమహేంద్రవరంలో పాలన సాగింది. 1995 మార్చిలో మున్సిపాలిటీ నుంచి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థగా ఆవిర్భవించింది. అయితే 1992 నుంచి 2001 దాదాపు 9ఏళ్ల వరకు ప్రత్యేక అధికారుల కనుసన్నల్లోనే పాలన సాగింది. 1995 నుంచి 2001 మధ్య ఎన్నికలు నిర్వహించాలని భావించినా కోర్టు కేసుల కారణంగా ప్రత్యేక అధికారుల పాలన సాగింది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో పరిసర గ్రామాల విలీనాన్ని ఆనాటి నుంచి ఆయా గ్రామాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . దీంతో గ్రామాల విలీనం లేకుండానే 2002 లో నగరపాలక సంస్థ కు ఎన్నికలు నిర్వహించారు . అనంతరం 2007 లో ఎన్నికలు జరిగాయి . ఆతరువాత 2012 లో ఎన్నికలు జరగాల్సి ఉండగా , మళ్లీ గ్రామాల విలీనం అంశం కారణంగా రెండేళ్లు వాయిదా పడ్డాయి . 2014 లో సార్వత్రిక ఎన్నికలకు ముందు నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగాయి . నాటి నుంచి రాజమహేంద్రవరం కార్పొరేషన్ కు ఎన్నికలు జరగలేదు. 2019 నుంచి రాజమహేంద్రవరం ప్రత్యేక అధికారుల పాలనలోనే సాగుతోంది. 2002, 2007, 2014లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వరుసగా హాట్రిక్ విజయాలు సాధించి, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కరోనా, పార్టీలోని ఆధిపత్యపోరు.. గెలుపుపై అనుమానాల కారణంగా వైసిపి హయాంలో నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిపించలేదన్న విమర్శలున్నాయి. దీనికి గ్రామాల విలీనానికి సంబంధించిన కేసులు కలిసి వచ్చాయి. రాజమహేంద్రవరంతో పాటు విలీన ప్రతిపాదిత గ్రామాల్లో కూడా ఎన్నికలు జరగడం లేదు. దీంతో రాజమహేంద్రవరంతో పాటు, గ్రామాల్లో కూడా పాలనగాడి తప్పుతోంది. ఎన్నికలు లేకపోవడంతో రాజమహేంద్రవరంతో పాటు, ఆయా గ్రామాల్లో కూడా రాజకీయ నిరుద్యోగులు పెరిగిపోతున్నారు.
తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిపించేందుకు ఆసక్తి చూపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2027లో జరిగే గోదావరి పుష్కరాలు కూటమి ప్రభుత్వ హయాంలో ఈసారి మహాకుంభమేళా స్థాయిలో జరిగే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలో నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిపిస్తే ప్రస్తుత ప్రాభవం తగ్గుతుందన్న భావనతోనే ఎన్నికలకు ఆసక్తి చూపించడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. రాజమహేంద్రవరం మేయర్ సహా 49 మంది కార్పొరేటర్లు వస్తే నగరంపై ఆధిపత్యం తగ్గుతుందన్న భావన వారిలో వ్యక్తమవుతోందని విశ్లేషిస్తున్నారు. పుష్కరాల వేళ ఇంత మందిని మోయడం ప్రజాప్రతినిధులకు ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. అలాగే పుష్కరాల్లో సుమారు వెయ్యి కోట్లకు పైగా పనులు జరుగుతాయని, అప్పుడు కూడా పర్సంటేజీల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచన కూడా ఎన్నికల వాయిదాకు కారణంగా భావిస్తున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగితే గుడా మాజీ చైర్మన్, సీనియర్ టిడిపి నాయకుడు గన్ని కృష్ణ లాంటి టిడిపి నాయకులు, జనసేన నాయకులు మేయర్ గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల నాటికి మరికొంతమంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో 49 మంది కార్పొరేటర్లుగా ఎన్నికైతే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో రాజకీయ సందడితో పాటు, అభివృద్ధి పనులు కూడా ఊపందుకునే అవకాశాలుంటాయి. అయితే ఇటీవల పురపాలకశాఖ మంత్రి పి నారాయణ మున్సిపాలిటీల్లో గ్రామాల విలీన ప్రతిపాదనలను పక్కన పెట్టి త్వరలోనే ఎన్నికలు జరిపిస్తామని ప్రకటించారు. ఈవిధానాన్ని రాజమహేంద్రవరానికి కూడా వర్తింపజేయాలని నాయకులు కోరుతున్నారు. రాజమహేంద్రవరం నగరానికి వచ్చినపుడు అదే నారాయణ ఆగస్టులో నగరపాలక సంస్థ ఎన్నికలు జరిపిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి హడావుడి కనిపించకపోవడం గమనార్హం.
మరోవైపు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో పరిసర 10 గ్రామాలను విలీనం చేశారు. రాజమహేంద్రవరం నగరానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న తొర్రేడు, కాతేరు, ధవళేశ్వరం, హుకుంపేట, రాజవోలు, పిడింగొయ్యి, వెంకటనగరం, శాటిలైట్ సిటీ, బొమ్మూరు, వేమగిరి గ్రామాలను విలీనం చేస్తూ గత ప్రభుత్వ హయాంలో ఆర్డినెన్స్ కూడా జారీ అయ్యింది. తాజాగా పరిసర గ్రామాలను మాస్టర్ ప్లాన్ లో కూడా పొందుపరిచారు. రాజమహేంద్రవరం నగరానికి ఆనుకుని ఉన్న లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీని ఇప్పటికే నగరపాలక సంస్థలో విలీనం చేశారు. అయితే గ్రామాల విలీనాన్ని మొదటి నుంచి ఆయా గ్రామాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. నగరపాలక సంస్థలో విలీనం చేస్తే పన్నులు పెరిగిపోతాయని, జాతీయ ఉపాధి హామీ వంటి కేంద్ర పథకాలు వర్తించక గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి దొరకదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల విలీనానికి జారీ చేసిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కొంతమూరు సహా 10 గ్రామాల ప్రజలు కోర్టును ఆశ్రయించారు. కోలమూరు పంచాయితీ కూడా ఈకేసులో ఇంప్లీడ్ అయ్యింది. ప్రజాప్రతినిధఉల వైఖరితో పాటు ఈకేసుల కారణంగా నగరపాలక సంస్థ ఎన్నికలకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. నగరపాలక సంస్థకు పాలకవర్గం లేకపోవడంతో సుమారు రూ. 100కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా నిలిచిపోయాయి. అయితే ఇటీవలే గన్ని కృష్ణ వర్గానికి చెందిన ఒక టిడిపి వార్డు స్థాయి నాయకుడు కనిపించి వచ్చే ఏడాది ఏప్రిల్ లో నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తామని యువనేత లోకేష్ భరోసా ఇచ్చారని, ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది రాజమహేంద్రవరం పాలకవర్గం కొలువుదీరుతుందని ఘంటాపథంగా చెప్పారు. ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే….
పాఠకులకు వినాయకచవితి శుభాకాంక్షలు