పవనిజం నుంచి పవరిజం వరకు…..
జనసేనాని, సినీ హీరో పవన్ కల్యాణ్ పవనిజం అంటూ అభిమానుల్లో ఏకంగా ఒక సిద్ధాంతాన్ని కూడా సృష్టించారు. ఆమధ్య అక్టోబర్ నెలలో పవనిజం పేరిట వేడుకలు కూడా…
జనసేనాని, సినీ హీరో పవన్ కల్యాణ్ పవనిజం అంటూ అభిమానుల్లో ఏకంగా ఒక సిద్ధాంతాన్ని కూడా సృష్టించారు. ఆమధ్య అక్టోబర్ నెలలో పవనిజం పేరిట వేడుకలు కూడా నిర్వహించారు. పవనిజం అంటే ఆయన మాటల్లోనే “ పవనిజం అంటే అదో అందమైన అభిమానుల ప్రపంచం. నా అభిమానులు నాకోసం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద ఫంక్షన్లు చేయనక్కర్లేదు. నన్ను అభిమానించే అభిమానుల ప్రతి ఒక్కరి కళ్ళలోనూ చెరగని ఆనందాన్ని చూడాలనుకుంటాను. వాళ్ళు సమాజం పట్ల భాద్యత కలిగిన ఒక పౌరుడిగా తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలనేది మాత్రమే వారి నుంచి ఆశిస్తున్నానని’ ఆయన చెప్పుకున్నారు. లక్షలాది పుస్తకాలు చదివానని, పవనిజాన్ని ప్రవచించిన పవన్ కల్యాణ్ తాజాగా విశాఖపట్నంలో జరిగిన జనసేన శాసనసభాపక్ష సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పవరిజాన్ని సూచిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ మరో 15ఏళ్ల పాటు తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమి కలిసే ఉంటాయని ప్రకటించడం ఆయనలోని పవరిజాన్ని సూచిస్తోందని విశ్లేషిస్తున్నారు. అధికారాన్ని, అందులోని మజాను ఆస్వాదిస్తున్న పవన్ దాన్ని ఇప్పట్లో వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. గతంలో మాదిరిగా పాలనలోని లోటుపాట్లు, అసాంఘిక సంఘటనలపై స్పందించకపోవడం గమనార్హం. పవన్ వైఖరి తెలుగుదేశం పార్టీకి వంతపాడుతన్నట్లుగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ప్రకటన, తీరు గత ఎన్నికల్లో కూటమికి ముఖ్యంగా జనసేన పోటీ చేసిన అన్ని చోట్ల ఓట్లు వేసి గెలిపించిన కాపు సామాజిక వర్గీయుల్లో నిరాశ కలిగిస్తోంది. కాపులు పల్లకీమోతకే పరిమితం కావాలా అన్నది వారి ఆవేదన. పవన్ కల్యాణ్ చొరవతోనే కూటమి అధికారంలోకి వచ్చిందన్నది నిర్వివాదాంశం. అయితే మరో 15ఏళ్ల పాటు కూటమితోనే ఉన్నా…మళ్లీ అధికారంలోకి వచ్చినా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కాలేరన్నది కాపులు, ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 75 ఏళ్లు నిండిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థానంలో ఆయన తనయుడు నారా లోకేష్ పవర్ సెంటర్ గా మారి సిఎం కుర్చీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య టిడిపి నేతలు పోటీ పడి మరీ లోకేష్ ను సిఎం చేయాలన్న డిమాండ్లు చేయడం గమనార్హం. సిఎం కుర్చీ వద్దన్న ఖండన ప్రకటన కూడా లోకేష్ నుంచి రాకపోవడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పవన్ ను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ లక్షలాది మంది వీర మహిళలు, జనసైనికులతో ఒక రాజకీయ శక్తిని నిర్మించుకున్నారు. రానున్న రోజుల్లో అన్న సాధించలేని అధికారాన్ని తమ్ముడు పవన్ సాధిస్తారేమోనని అభిమానులు ఆశ….విశ్లేషకుల అంచనా. అయితే మరో 15ఏళ్లు కూటమితో కలిసే పనిచేస్తామన్న ప్రకటనతో అభిమానుల ఆశ నిరాశగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ వ్యూహాన్ని మారిస్తే తప్ప ఎన్నేళ్లు గడిచినా పవన్ పల్లకీ మోతలోనే ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మెంబర్ షిప్ నుంచి లీడర్ షిప్ స్థాయికి కార్యకర్తలను తీసుకెళ్తానన్న పవన్ తాను రాష్ట్ర ప్రధాన లీడర్ గా ఎప్పుడెదుగుతారన్నదే అభిమానుల ప్రశ్న.
సినీ, రాజకీయ రంగాల్లో అన్నబాటలో నడిచినా ….రాజకీయాల్లో అన్నను మించిన తమ్ముడిగా నిరూపించుకున్నారు కొణిదెల పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, అధికారంలోకి రావాలని ఆశించినా నెరవేరలేదు. అయితే ప్రజారాజ్యం పార్టీ తెరమరుగు కాగానే పవన్ 2014లో సొంతంగా జనసేన పార్టీని స్థాపించి నిత్య పెళ్లికొడుకు అని…దుందుడు నిలకడ లేని వ్యక్తి అని ఇలా ఎన్ని విమర్శలు ఎదురైనా ఓపికగా…లౌక్యంగా రాజకీయాలు చేసి, ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి…అధికార పీఠానికి అడుగుదూరంలో ఉన్నారు.
2008లో తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీకి యువ విభాగానికి అధ్యక్షునిగా పనిచేశారు. తరువాతి పరిణామాల్లో పవన్ ప్రజారాజ్యాన్ని వీడారు. 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించారు. తొలుత టిడిపికి వ్యతిరేకంగా వామపక్షాలు, బిఎస్పీతో కలిసి రాజకీయం చేసిన ఆయన 2019 లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అయినా ఎక్కడా నిరాశ చెందకుండా రాజకీయాల్లో కొనసాగారు. ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థను స్థాపించారు. అదిప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఉద్దానం కిడ్నీ వ్యాధి గ్రస్తుల కోసం నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి గ్రామంలో డయాలసిస్ కేంద్రాలను నిర్మించేందుకు పాటుపడ్డారు.
2024 ఎన్నికలలో టిడిపి, బిజెపి, జనసేన కూటమి ఏర్పాటులో కీలకభూమిక పోషించారు. తద్వారా కూటమిని అధికారంలోకి తెచ్చి తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్న టిడిపికి రాష్ట్రంలో జీవం పోశారని చెప్పవచ్చు. ఈఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 21 చోట్ల విజయం సాధించడం విశేషం. కూటమి విజయంతో పాటు పిఠాపురం నుంచి 72వేలకు పైగా ఓట్ల మెజారిటీతో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన పవన్ డిప్యుటీ సిఎం పదవితో పాటు, పంచాయితీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యాటకం, అటవీ,సైన్సు అండ్ టెక్నాలజీ శాఖలు చేపట్టారు.
పవన్ అనేది ఆయనకు లభించిన టైటిల్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు…మార్షల్ ఆర్ట్స్ లో ఆయన పవన్ అనే టైటిల్ ను అందుకున్నారు. అప్పటి నుంచి ఆయన పేరు పవన్ కల్యాణ్ గా స్థిరపడింది. పవర్ స్టార్ అని కూడా ఆయన అభిమానులు పిలుచుకుంటారు. సెప్టెంబర్ 2న ఆయన జన్మదినోత్సవం సందర్భంగా పవర్ స్టార్ అభిమానులు రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఆయన జన్మదినోత్సవాన్ని భారీ ఎత్తున జరిపేందుకు సన్నాహాలు చేశారు.
సెప్టెంబర్ 2 పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా