రాధాకృష్ణకు ఓటేస్తే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఆమోదించినట్టే! ఉండవల్లి

భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు, సోషలిస్టులు ఉండరాదన్నది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సిద్ధాంతం…లక్ష్యమని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ గురు…

 రాధాకృష్ణకు ఓటేస్తే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఆమోదించినట్టే! ఉండవల్లి

భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు, సోషలిస్టులు ఉండరాదన్నది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సిద్ధాంతం…లక్ష్యమని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ గురు గోల్వాల్కర్ రచించిన పాంచజన్యం పుస్తకాన్ని చదవితే ఈవిషయం అర్థమవుతుందన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని రాజకీయంగా బిజెపి అమలు చేస్తుందని, ఈనేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు ఓటువేస్తే ఆర్ఎస్ఎస్ సిద్ధంతాలను ఆమోదించినట్టేనని తెలుగుదేశం, వైఎస్సార్ సిపి, బిఆర్ఎస్ పార్టీలకు ఉండవల్లి స్పష్టం చేశారు. ఈపార్టీలన్నీ ఏ కారణంతో ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేస్తున్నాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో దివాకరమ్ న్యూస్ తో ఉండవల్లి సంభాషించారు.
ధన్ కడ్ రాజీనామా నాటకీయం
బిజెపి, ఆర్ఎస్ఎస్ పెద్దల మాట విననందుకే మాజీ ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ కడ్ చేత రాజీనామా చేయించి, ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేసేందుకు సంస్థకు చెందిన రాధాకృష్ణన్ ను నేరుగా రంగంలోకి దింపి ఉంటారని ఉండవల్లి అరుణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎన్నికల తీరు దేశంలోనే ప్రధమమన్నారు. అనారోగ్యం పాలైతే నాలుగు రోజులు సెలవు పెట్టవచ్చని, ఆ కారణంతో ధన్కడ్ రాజీనామా చేయడం అనుమానంగా ఉందన్నారు. ఆయన రాజీనామా వెనుక ఉన్న మతలబును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిపుణుడు, న్యాయవాది అయిన ధన్కడ్ రాజీనామా సందర్భంగా ఎంతో మనోవేదనకు గురై ఉంటారన్నారు. బిజెపికి సెక్యులరిజం మీద కూడా నమ్మకం లేదన్నారు. దేశాన్ని, పార్లమెంటును గుప్పట పెట్టుకుని బిజెపి రాజ్యాంగాన్ని మార్చేసే అవకాశం ఉందని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి సోషలిస్టు, సెక్యులరిస్టు, రాజ్యాంగ నిపుణుడు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అని, అందులోనూ తెలుగువారని ఉండవల్లి పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి విషయంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి వ్యక్తికి కాదని తెలుగు రాష్ట్రాల్లోని బిఆర్ఎస్, టిడిపి, జనసేన, వైసిపిలు ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేసే రాధాకృష్ణన్ కు ఓటు వేయాలని నిర్ణయించడం పట్ల ఉండవల్లి విస్మయం వ్యక్తం చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ రాష్ట్రపతిగా పోటీ చేసినపుడు కాంగ్రెస్ కు బద్ధవ్యతిరేక పార్టీ అయిన శివసేన మరాఠీ ఫీలింగ్ తో ప్రతిభాపాటిల్ కు ఓటు వేసిందని గుర్తుచేశారు. ఆమాత్రం స్ఫూర్తి కూడా తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలకు లేకపోవడం శోచనీయమన్నారు. గతంలో ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రధాని మోడీని తీవ్రంగా వ్యతిరేకించారని, మసీదులు కూలగొట్టే వ్యక్తిగా తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. మరోవైపు గత ఎన్నికల్లో ఎపిలోని టిడిపి, బిజెపి, జనసేన కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసిన వైసిపి అధినేత వైఎస్ జగన్ బిజెపి అభ్యర్థికి మద్దతు ప్రకటించడం శోచనీయమన్నారు.
రహస్యపద్ధతిలో ఉప రాష్ట్రపతి ఓటింగ్ జరుగుతుందని, ఈనేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ఎంపిలు ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని ఉండవల్లి పిలుపునిచ్చారు.
అమిత్ షాది కోర్టు ధిక్కారమే…
సల్వాజుడుం వ్యవహారంలో తీర్పునిచ్చిన ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి మావోయిస్టులకు అనుకూలమని ప్రకటించి హోంశాఖ మంత్రి అమిత్ షా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఉండవల్లి స్పష్టం చేశారు. కోర్టు తీర్పులపై విమర్శలు చేయవచ్చని, కానీ న్యాయమూర్తిపై విమర్శలు చేయడం కోర్టు ధిక్కారమేనన్నారు. దీనిపై పార్లమెంటులో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు చూస్తే దేశం ఎక్కడికి పోతోందో అన్న ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. సల్వాజుడుం లాంటి సంస్థలు ఆయుధాలు ధరించి తిరిగితే తప్పులేదన్న భావనతో అమిత్ షా ఉంటే దేశంలో ఎక్కడిక్కడ ఆయుధాల వినియోగానికి అనుకూలంగా రాజ్యాంగ సవరణ చేయాలని ఉండవల్లి సవాల్ విసిరారు.

Leave a Reply