- February 16, 2026
రెవెన్యూ కథలు…. బలవంతపు కు.ని ఆపరేషన్లు
1977 లో ఉత్తర భారత దేశంలో ఇందిరాగాంధీ ఘోర పరాజయానికి ఒక కారణం అప్పటి యువరాజు సంజయ్ గాంధీ ప్రేరణతో చేసిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు…
1977 లో ఉత్తర భారత దేశంలో ఇందిరాగాంధీ ఘోర పరాజయానికి ఒక కారణం అప్పటి యువరాజు సంజయ్ గాంధీ ప్రేరణతో చేసిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. నేను కొత్తపేట తహశీల్దార్ గా 1996 నవంబర్ 6 న వచ్చిన అతి పెద్ద తుఫాను తర్వాత 3 రోజులు కు జాయిన్ అయి 2002 డిసెంబర్ 30 వరకు 6 సంవత్సరాల పాటు అక్కడే పని చేసాను. ఆ మండలంలో షెడ్యూలు కులస్తుల్లో అధిక శాతం నలుగురైదుగురు పిల్లలు ఉన్నా తెలియనితనం తో కుటుంబ నియంత్రణ చేయించుకోకుండా వారు. వానపల్లి పిహెచ్ సి డాక్టర్ గారితో జన్మభూమి కార్యక్రమంలోనే కాకుండా, ఇతరత్రా కూడా తరచూ కలిసేవాడ్ని. ఆ సందర్భంగా షెడ్యూల్ కులాల వారిలో ముగ్గురికి మించి సంతానం కల్గిన దంపతులు లిస్ట్ నర్సుల వద్ద తీసుకొని , నేను నర్సులతో కలసి రాత్రి పూట కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్ళేవాడ్ని. ఇది ప్రభుత్వం మాకు చెప్పిన కార్యక్రమం కాదు. అలానే కలెక్టర్ అప్పచెప్పిన కార్యక్రమం కూడా కాదు. నేను స్వంతంగా నాకునేనుగా కూలీ పని మీదే ఆధారపడిన బతుకులు అధిక సంతానం వల్ల మరింత పేదరికంలోకి నెట్టబడ్తారని, స్త్రీల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందన్న ఉద్దేశంతో నర్సులతో వెళ్లి వాళ్ళను ఒప్పించే ఒక ప్రోగ్రామ్ గా గ్రామాలు తిరిగేవాడ్ని. అప్పుడు జరిగిన రెండు మూడు సంఘటనల గురించి వివరిస్తాను.
మగ వారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే శక్తి తగ్గి పోయి పనిచేయలేరనే అపోహ మాత్రం వాళ్లలో చాలా బలంగా వుండేది. వాళ్ళను ఒప్పించడానికి ఎంత ప్రయత్నించినా ఒప్పుకొనేవారు కాదు. మరి అదే మహిళ పిల్లలను కనడంతో పాటు , కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని,కొద్దిరోజులకే మగాడి తో పాటు కూలీ పనికి వెళ్ళేది. మరి అప్పుడు ఆమెకు శక్తి తగ్గి పోవాలికదా అని అడిగితే మగాళ్లు బరువులు ఎక్కువ ఎత్తాలి అని కుంటి సాకు చెప్పేవారు. చైనా దేశం కాదు కదా నిర్భంధంగా ఆపరేషన్లు చేయడానికి. స్వతంత్ర ఫక్తు ప్రజాస్వామ్య దేశం మనది. కొంత మంది విని వెంటనే ఆపరేషన్ చేయించుకొనే వారు. మగ వారికే సులువు అయినా, ఎవరో ఒకరు ఆపరేషన్ చేయించుకుంటే చాలని సంతోషించేవాళ్ళం. ఎంత చెప్పినా వినని వాళ్ల లిస్ట్ తీసుకొని, వాటిని రేషన్ షాపు డీలర్లు కు ఇచ్చి , నేను చెప్పేంత వరకు బియ్యం ఇవ్వవద్దని చెప్పేవాడ్ని. బియ్యం ఆపిన వెంటనే వాళ్ళు నా ఆఫీసుకు వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్లకు క్లాస్ తీసుకునే వాడిని. రెండు రూపాయల కిలో బియ్యం ఆపితేనే పరిగెత్తుకు వచ్చావు. దీన్ని బట్టే తెలుస్తోంది. నువ్వు ఎంత పేదరికంలో ఉన్నవో , మరి ఎక్కువ మంది పిల్లని ,ఎలా పెంచుతావు,ఎలా బాగా చదివించగలుగుతావు, పైగా నీ భార్య ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదా అని చెబితే కొంతమంది వెంటనే ఆపరేషన్ కు ఒప్పుకొని వెళ్లేవారు. అలా వాళ్లకు ఆపరేషన్ చేయించుకొన్నవారికి ఒక స్టీల్ బిందె కొంత మంది విరాళాల తో కొని ఇచ్చేవాడిని.
అప్పట్లో శేషగిరిరావు అనే డాక్టర్ గారు వానపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ గా ఉండేవారు. పెద్ద గ్రామాల్లోనే ఆపరేషన్ ఏ స్కూల్ గదిలోనే చేస్తే ఎలా ఉంటుంది అంటే సరే అనే వారు. ఆ స్కూలు లో ఒక గది లో ఆపరేషన్ చేసేవారు. అది ఎంతో రిస్క్ తో కూడుకున్నది. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆయన చాలా జగ్రత్తలు తీసుకొని గ్రామంలోనే చేసేవారు. దాని వల్ల పేషేంట్లకు ప్రయాణం బాధ తప్పేది. ఇలా చేస్తున్నప్పుడు ఒక రేషన్ షాపు డీలర్ వానపల్లి గ్రామంలో నేను తనిఖీ చేసి సరిగా పనిచేయడం లేదని అతన్ని తొలగించమని ఆర్డీవో కి రిపోర్ట్ రాస్తే, ఆ డీలర్ నా పైనే ఆర్డీవోకి ఫిర్యాదు చేసాడు. ఈయనకు షెడ్యూలు కులాల వారంటే ద్వేషం. ఆపరేషన్ చేయించుకోవడం లేదనే వంక తో వారికి బియ్యం ఇవ్వవద్దని చెబుతున్నారు. వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నాపై ఫిర్యాదు చేశారు. ఒక సారి ఆఫీసులో ఉండగా వార సత్యనారాయణ అనే వ్యక్తి నా వద్దకు వచ్చాడు. అతను తెల్లని లుంగీ ,తెల్లని చొక్కా వేసుకొని ఉన్నాడు. ఆడవాళ్లు పెంచుకొన్నట్లుగా చేతి బొటన వేలి గోటినీ బాగా పొడవుగా పెంచి వున్నాడు. మాది మందపల్లి గ్రామం. నేను మాలపేటకు పెద్దను, నా కార్డుకు బియ్యం ఆపితే నాకు ఎంత అవమానమో చెప్పండి అని అడిగాడు. ఒక తహసీల్దారు గా నేను మీ ఇంటికి వచ్చి నీకు ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు, ఆపరేషన్ చేయించుకోమని చెబితే నా మాట వినలేదు. నాకు కూడా అవమానమే కదా ఆలోచించు అన్నాను. వెంటనే ఆవేశంగా ఇప్పుడు చేయిస్తారా చేయించుకుంటాను అన్నాడు. ఎంక్వైరీ చేస్తే ఆ రోజు అవిడి అనే గ్రామంలో ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిసింది. ఆయన ఆఫీసుకు సైకిల్ పై వచ్చారు. ఆ సైకిల్ అక్కడే పెట్టమని , నా జీపు ఎక్కమని చెప్పాను. స్వయంగా అవిడి క్యాంప్ కు తీసుకుని వేళ్లి ఆపరేషన్ చేయించి, మధ్యాహ్నం 3 గంటలకు మందపల్లి లో సత్యనారాయణ ఇంటికి తీసుకొని బయలుదేరాను. మా గ్రామనౌకర్ని, తహసీల్దారు ఆఫీసు వద్ద వదిలిన అతని సైకిల్ ను మందపల్లి లోని సత్యనారాయణ ఇంటికి తెమ్మని చెప్పాను.
జీపు వార సత్యనారాయణ ఇంటిముందు ఆగింది. సత్యనారాయణ భార్య అనుకుంటా జీపును చూసి జీపు వద్దకు వచ్చింది. నేను, డ్రైవరు కిందకి దిగి సత్యనారాయణ డ్రైవర్ సహాయంతో కిందకు దిగడం చూసిన అతని భార్య గొల్లుమని ఎడుపు లంకించుకుంటూ సత్యనారాయణ ను తనుకూడా పట్టుకుంది. ఆమె భయం ఏమిటంటే పొద్దుటే నిక్షేపంగా సైకిల్ మీద వెళ్లిన వ్యక్తి జీపు నుంచి మా డ్రైవర్ సాయంతో దిగడం చూసి తన భర్తకు ఏదో అయిపోయిందన్న భయంతో ఏడుపు లంకించుకుందన్న మాట. పక్క ఇళ్ల వాళ్లు అంతా ఆమె ఎడుపుకు గుమికూడారు. ఆయనకు ఏమి కాలేదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించామని చెప్పిన తర్వాత సత్యనారాయణ భార్య మనసు కుదుటపడి ఏడుపుకు ఫుల్ స్టాప్ పెట్టింది. మొత్తానికి పేట పెద్ద సత్యనారాయణ కు ఆపరేషన్ ఆ విధంగా చేయించాం.
పలివెల శివారు గ్రామం అయిన పూజారిపాలెం లో అంతా షెడ్యూలు కులస్థులే. వారిలో కూడా సుమారు 7,8 జంటలు అధిక సంతానం కలిగి ఉన్నా ఆపరేషన్ అంటే భయంతో ముందుకు రాకుండా ఉన్నారు. ఆ ఊరికి సరైన రోడ్డు కూడా లేదు. దగ్గర్లోనే గంటి అనే గ్రామం ఉంది. అటునుంచీ రావొచ్చూ. కానీ డ్రైను గట్టు మీదుగా చిన్న వంతెన దాటి రావాలి. డాక్టర్ శేషగిరిరావు గారు ఒక ఆదివారం ఆ ఊర్లో 6 గురికి ఆపరేషన్లు చేద్దామని సింగల్ రూమ్ స్కూల్ గదిని రెండురోజుల ముందు ఫుమిగషన్(fumigation) చేయించారు. ఇన్ఫెక్షన్ రాకుండా గది అంతా మందు చల్లి గాలి వెళ్లకుండా తలుపులను బిగిస్తారు. నా సంకల్పం సంగతి సరే శేషగిరి రావు గారి ధైర్యానికి హ్యాట్సాఫ్. ఏదయినా తేడా జరిగితే అంతే. ఎవరికైనా ఇన్ఫెక్షన్ సోకి వారు మరణిస్తే ఎంత రిస్క్. కానీ ఏమీ జరగలేదు . జరిగుంటే నా పని కూడా అయిపోయేది. చాలా చోట్ల లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కంటి ఆపరేషన్ లు చేయించినపుడు, ఇన్ఫెక్షన్ వల్ల కంటి చూపు శాశ్వతంగా పోయిన సంఘటనలు గతంలో జరిగాయి. ఆదివారం అన్ని ఏర్పాట్లతో డాక్టర్ గారు వారి సిబ్బంది వచ్చారు. నేను అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్ తో కలిసి జీవులో వెళ్ళాను. అక్కడ నలుగురైదుగురు ముసలివాళ్ళు తప్ప అంతా జంప్. ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లి పోయారు. ఏం చెయ్యాలి. అప్పుడు పట్టుదలతో పక్క గ్రామం గంటి వెళ్లి అక్కడ ఉన్న 4 కేసులు నా జీవులో తీసుకు వచ్చి పూజారిపాలెం స్కూల్లో ఆపేరేషన్లు చేయించాం. వారిని మళ్ళీ గంటి గ్రామం తీసుకువెళ్ళి దించాము. ఆ రోజు అంగవాడి టీచర్ నాతో పాటు ఓ 8 మందికి భోజనాలు చేసి పెట్టింది. ఎంత కష్టపడిందో ఏమో కాని ఎన్నడూ రుచి చూడని వంకాయ కొత్తిమీర కూర వండి పెట్టింది. మేము పడ్డ శ్రమ టెన్షన్ ఆమె భోజనంతో ఎగిరిపోయింది. అ తర్వాత నాకు డిప్యూటీ కలెక్టర్ గా ప్రమోషన్ వచ్చి 2002 డిసెంబర్ 30 న కొత్తపేట నుండి వెళ్లిపోయాను.
ఆ తర్వాత రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడనుకుంటా 2012 లో మందపల్లి సర్పంచ్ గారి అబ్బాయి పెళ్లికి వెళ్ళాను రాత్రి 10 గంటలకు ముహుర్తం. పందింట్లో కూర్చుని కబుర్లు చెబుతున్నా.. .అంతలోనే ఒక వ్యక్తి వచ్చి నా కాళ్ళకు దండం పెట్టాడు. నేను వారిస్తూ ఉండగా తానే మీ బలవంతం వల్ల పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. ఆ రోజు మీరు చేసింది కుటుంబానికి మేలు జరిగింది. నా పిల్లల్ని ఇప్పడు రావులపాలెం డాన్ బాస్కో స్కూల్ లో చదివించుకుంటున్నాను అని చెబితే చాలా ఆనంద పడ్డాను. ఆరాత్రిళ్లు తిరిగినది వృధా కాలేదు. దానికి ప్రధాన కారకులు డాక్టర్ శేషగిరిరావు గారు. ఆయన తరవాత పీజీ చేసి ఇప్పుడు కంటి డాక్టర్ గా కొత్తపేటలో స్థిర పడ్డారు.
మారిశెట్టి జితేంద్ర
రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
సశేషం…..