- February 15, 2026
పీపుల్స్ వార్ నుంచి పిలుపు కోసం ఎదురు చూపు! జితేంద్ర రెవెన్యూ కథలు
మారిశెట్టి జితేంద్ర మండల రెవెన్యూ అధికారిగా సర్వీసులో చేరి అంచెలంచెలుగా ఎదిగి జాయింట్ కలెక్టర్, డిఆర్వో స్థాయికి చేరారు. స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ గా పదవీ విరమణ…
మారిశెట్టి జితేంద్ర మండల రెవెన్యూ అధికారిగా సర్వీసులో చేరి అంచెలంచెలుగా ఎదిగి జాయింట్ కలెక్టర్, డిఆర్వో స్థాయికి చేరారు. స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ గా పదవీ విరమణ చేశారు. నిజాయితీ పరుడిగా, ముక్కుసూటి అధికారిగా, సామాజిక చైతన్యం, మానవతాదృక్పథం ఉన్న అధికారిగా పేరొందిన ఆయన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ గా, అన్నవరం దేవస్థానం ఇఓ,డి ఆర్ డి ఓ పిడిగా పాలనలో తనదైన ముద్ర వేశారు. సినీ, సాహిత్యాభిలాష కూడా ఉన్న తరుచూ పత్రికలకు వ్యాసాలు, లేఖలు కూడా రాస్తుంటారు. రెవెన్యూ కథలు పేరిట తన సర్వీసులో జరిగిన ఆసక్తికర అంశాలను పాఠకులకు అందిస్తున్నారు….
నేను రాజవొమ్మంగి మండల రెవెన్యూ అధికారిగా జనవరి 23 ,1987 నుండి 1988 సెప్టెంబర్ 9 వరకు పనిచేశాను.అప్పటికి రాజవొమ్మంగి ఏరియా లో నాగులకొండ దళం పేరుతో నక్సల్స్(అప్పటికీ వారు పీపుల్స్ వార్ గ్రూప్ గానే పరిగణించుకొనేవారు,అలాగే ప్రకటించుకొనేవారు) అడ్డతీగల రాజవొమ్మంగి , వై రామవరం మండలాల్లో విస్తృతంగా ఉండేవారు. ప్రత్తిపాడు మండలం, శంఖవరం మండలాలను విడదీస్తూ ఉన్న పర్వత శ్రేణినే నాగుల పర్వతం అని పిలిచేవారు.ఇప్పడు ఆ పర్వతంలోనే లాటరైట్ మైనింగ్ పై పెద్ద దుమారమే జరుగుతోంది.
2004 నుండి గిరిజన కార్పొరేషన్ వారే పేదలకిచ్చే రెండు రూపాయల బియ్యాన్ని వారి డిపో ల ద్వారానే పంపిణీ చేసేవారు. అప్పటికి గిరిజన కార్పొరేషన్ లో గిరిజనేతరులే ఎక్కువగా పని చేసేవారు. రాజవొమ్మంగి మండలంలో శరభవరం అనే గ్రామంలో డిఆర్ డిపో ఉండేది. ఆ డిపో లో పనిచేసే వ్యక్తిది పశ్చిమగోదావరి జిల్లానిడదవోలు. కాలేజీ లో చదివిన ఒక మిత్రునిది అదే గ్రామం. అందువల్ల నాకు నా మిత్రుని ద్వారా బాగా పరిచయం అయ్యాడు. అంతేకాకుండా డిఆర్ డిపో లోని చిరు ఉద్యోగులైన సేల్స్ మెన్లతో నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ కలిసేవాణ్ణి. ఒక సారి డిఆర్ డిపో లో అమ్మకానికి పెట్టిన కాటన్ చొక్కాలు ఒక అర డజను కొని, ఓ చొక్కా వేసుకొని ఒక గిరిజన గ్రామం వెళ్లి అక్కడ గ్రామస్తులతో నేను వేసుకున్న చొక్కా డిఆర్ డిపో లో కొన్నాను అంటే నవ్వారు. ఎందుకంటే నేను ఎమ్మార్వో అయ్యి ఉండి డిఆర్ డిపో లో వస్తువులు కొంటున్నానని ఆశ్చర్యంగా చూసారు. నాకు అప్పటికీ ఇంకా వివాహం కాలేదు. ఐటీడీఏ ఉద్యోగులు కోసం కట్టిన క్వార్టర్ లో ఉండేవాడిని.
ఒక సారి రాత్రి పూట నేను నా గది లో ఉండగా శరభవరం డిఆర్ డిపో సేల్స్ మెన్ వచ్చారు. ఎందుకు రాత్రిపూట వచ్చారంటే ‘లాస్ట్ బస్ కి ఏలేశ్వరం వెళుతూ మీ వద్దకు వచ్చాను. నేను వారం రోజులు సెలవు మీద వెళుతున్నాను. మొన్న రాత్రిపూట అన్నలు(నక్సలైట్లు ను అక్కడ అలానే పిలుస్తారు)శరభవరం ఊళ్ళోకి వచ్చి మీటింగ్ పెట్టారు. ఊళ్ళో జనాన్ని నన్ను కూడా పిలిచారు అని చెప్పారు. ఎమ్మార్వో ఎలా ఉన్నాడు అని అడిగితే …కొత్తగా వచ్చారు మంచోడే అన్నారట. మీ ఎమ్మార్వోని ఒక సారి మా వద్దకు తీసుకు రా!ఎప్పుడు తీసుకు రావాలో మేము చెబుతాం అని అన్నారు. ఆ విషయం మీకు చెబుదామని వచ్చాను’ అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ నా కెప్పుడు పిలుపు రాలేదు. కనిపించినప్పుడల్లా డిపో సేల్స్ మేన్ ని ఆడిగేవాణ్ణి, ఏదయ్యా అన్నల నుంచి ఇంకా పిలుపు రాలేదు ఏమిటి అని అడిగే వాణ్ణి. 1987 డిసెంబరు చివరి రోజున మారేడుమిల్లి మండలంలోని ఒక మీటింగుకు వచ్చిన అప్పటి, ఐఏఎస్ అధికారులైన రెడ్డి సుబ్రహ్మణ్యం, పుష్ప జాయింట్ కలెక్టర్ రాధ, కలెక్టర్ ఎం వి పి సి శాస్త్రి, ఎస్సార్ శంకరన్ లను కిడ్నాప్ చేసి వారంరోజుల పాటు బంధీలు గా ఉంచారు. కన్నాభిరామ్ లాంటి వాళ్ళు మధ్యవర్తులు గా ఉండి వారిని విడిపించారు. బహుశా జనవరి 1,1988 కి వారు బందీలుగానే ఉన్నారనుకుంటా.
ఒక రోజు తాళ్లపాలెం గ్రామం నుండి కొండ రెడ్లు(కొండ కాపులు గా కూడా పిలుచుకునేవారు) 10మంది వచ్చారు.తమ ఊళ్ళో ఒక చెరువు ఉందని ఆ చెరువు కింద సుమారు 30 ఎకరాలు వరి సాగు అవుతుందని. కానీ రెండు సంవత్సరాల నుంచి, బొండ్ల నాగరాజు అనే వ్యక్తి ఆ చెరువుని ఆక్రమించి సాగు చేస్తున్నాడని, తన పంట కోసం చెరువులో నీరంతా కిందికి వదిలేస్తున్నాడని దాని వల్ల మాకు సాగు నీరు లేక పంటలు వేసుకోలేక పోతున్నామని చెప్పారు. ఇంత మంది ఉన్నారు ఊరందరిని కాదని చెరువును ఎలా అక్రమిస్తాడు అని అడిగితే, మాట్లాడలేదు. అప్పటికి మొండిరేటు వెంకటేశ్వర రావు అని ఎస్సై ఉండేవారు. ఒక సారి ఆయనను పిలిపించి విషయం చెప్పాను. 62 గ్రామాలకు అప్పటికి ఇద్దరు విలేజ్ అసిస్టెంట్లుఉండేవారు. అన్ని గ్రామాలు పర్యవేక్షణ కూడా వాళ్ళకి కష్టం గానే ఉండేది. అప్పడే రాజవొమ్మంగి లో సీఆర్పీఎఫ్ పార్టీ ఒకటి ఉండేది. ఒకరోజు ఎస్సై గారు మా ఆఫీసుకు వచ్చి, ఎమ్మార్వో గారు తాళ్లపాలెం వెళదాం అన్నారు. కదా ఏలేశ్వరం నుంచి అద్దె వ్యాన్ ఒకటి పట్టుకున్నాను. ఆ వాన్ లో మనము సీఆర్పీఎఫ్ వాళ్ళు ఓ 10 మంది కలిసి వెళదాం. మధ్యాహ్నం భోజనం చేసి రెడీగా ఉండండి అని చెప్పాడు. అప్పటికింకా తూర్పుగోదావరి జిల్లాలో నక్సల్స్ ఎక్కడ ల్యాండ్ మైన్స్ పెట్టిన దాఖలాలు లేవు. మధ్యాహ్నం భోజనం తర్వాత అద్దె వ్యాన్ లో తాళ్లపాలెం బయల్దేరాము. ఏలేశ్వరం నుండి,నర్సీపట్నం మీదుగా మంచి తారురోడ్ ఉంది. ఆరోడ్డుకి అనుకొనే ఉండే శరభవరం దాటితే విశాఖ జిల్లా కాకరపల్లి, కొయ్యురు మండలం.అక్కడ కి రంప గ్రామం ఓ 8 కిలో మీటర్లు ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు అల్లూరి సీతారామరాజు ను పట్టుకొని చంపింది రంప గ్రామంలోనే. తాళ్లపాలెం శరభవరానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మధ్యలో బోయపాడు అనే గ్రామం. పేరుకే గ్రామం కానీ 50 ఇళ్లకు మించి ఉండవు. తాళ్లపాలెం కాస్త పెద్దది. అక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాల ఉంది. సన్నని కంకర రోడ్డు పైన మెటాడోర్ వ్యాన్ లో ఊళ్ళోకి వెళ్ళాం. అక్కడ నుంచి నేను ఎస్సై గారు, మా వెనక తుపాకులతో ఓ పది మంది సీఆర్పీఎఫ్ వాళ్లు. మమ్మల్ని చూసే సరికి ఆ ఊరి వాళ్ళు కంగారు పడుతున్నారు. కూంబింగ్ ఆపరేషన్ కోసం అప్పుడప్పుడు సీఆర్పీఎఫ్ వాళ్ళు వెళతారు. ఆప్పుడు నక్సల్స్ ఆచూకీ పేరుతో గిరిజనులను కొట్టడం అదీ చేస్తారు. ఆ భయంతో ఊరంతా ఒక చోటుకి చేరారు. బొండ్ల నాగరాజు ఆక్రమించిన చెరువు వద్దకు వెళదాం అని చెప్పి ఓ 15 మంది చెరువు క్రింద భూములున్న వాళ్లను రమ్మన్నాను. చెరువు వద్దకు వెళ్ళాం. సీఆర్పీఎఫ్ వాళ్ళు అప్రమత్తంగానే ఉన్నారు. వాళ్లలో నలుగురు నాలుగు దిక్కులా పరీక్షగా చూస్తున్నారు. వారికి ఏమి చెప్పి ఎస్సై గారు తీసుకు వచ్చారో నాకు తెలియదు. జనరల్ గా పై అధికార్ల ఆర్డర్స్ లేనిదే వారు ఎస్సై గారి తో రారు. కాకుంటే లోకల్ గా వారికి ఎస్సైగారి సహకారం చాలా అవసరం. బహుశా అందుకే వచ్చి ఉంటారేమో. ఓ పావు గంట నడిచి చెరువు వద్దకు చేరుకున్నాం. చెరువులో ఒక అర ఎకరం లో వరి పంట ఉంది. ఇంకా పొట్ట పోసుకొని దశకు రాలేదు కానీ మాంచి బలంగా ఉంది. దూరంగా కొండ పక్కన కొన్ని ఆవులు మేస్తున్నాయి. నాగరాజు ఊళ్ళో ఉన్నడా అని అడిగాను. లేడని చెప్పారు. సరే దూరంగా ఉన్న ఆ ఆవుల్ని, గిట్ట దూడలను తొలుకు రమ్మని చెప్పాను. ఆవుల్ని చెరువు వద్దకు తీసుకుని వచ్చిన తరువాత బొండ్ల నాగరాజు పండిస్తున్న వరి పంట మొత్తం ఆ అవులతో మేయించమని చెప్పాను. వాళ్ళు సందేహిస్తున్నారు.ఏంటి ఆలోచిస్తున్నారు. కొయ్యడం కంటే అవుళ్ళుతో మేపడమే మంచిది. ఆవుల్ని చెరువులోకి తోలమని మళ్ళీ చెప్పాను. వారిలో ఒక గిరిజనుడి నన్ను పక్కకు తీసుకు వెళ్లి, బాబయ్య నాగరాజు అన్నలు ఊళ్ళోకి వచ్చినప్పుడు వాళ్లకు భోజనాలు పెడతాడు. ఇప్పుడు వాడి చేను మేపితే అన్నలతో మమ్మల్ని కొట్టిస్తాడు అందుకే మా వాళ్ళు చేను మేపించడానికి జంకుతున్నారుఅని మెల్లగా చెప్పాడు. మీరు భయపడ వద్దు. ఎమ్మార్వో గారు వచ్చి మేపమని చెప్పారు కాబట్టి మేపాము అని చెప్పమని చెప్పాను. వాడి అర ఎకరం పంట కోసం మీరు 25 ఎకరాలు బీడు పెట్టుకుంటున్నారు. భయపడకండి.మళ్ళీ పంట వేస్తే ఎస్సైగారు చూసుకుంటారు అని చెప్పాను. వాడు చెరువులోకి వస్తే.లోపల పడేస్తాను వాణ్ణి అని ఎస్సై గారు భరోసా ఇవ్వడంతో ,ఆవుల్ని చెరువులోకి తోలి పంటను మొత్తం మేపేశారు.ఒక గంట పాటు మేము అక్కడ ఉండి వచ్చేసాము.తిరిగి వస్తుంటే మరొక రైతు పక్కకు పిలిచి,అయ్యా మీరు మా కోసం మంచి పనే చేశారు కానీ, వాడు అన్నలకు చెప్పి మిమ్మల్ని ఏదయినా చేయిస్తాడు అని అన్నాడు.అన్నలు ఎక్కువ మందికి మేలు చేస్తే ఒక్కడి కోసం ఎందుకు అడుగుతారు. పైగా చెరువు ఆక్రమించి మీకు పంట లేకుండా చేస్తున్నాడు అన్నలు అడిగితే నేను చూసుకుంటాను అని చెప్పి రాజవొమ్మంగి వచ్చేసాం. ఆ దెబ్బకు భయపడి నాగరాజు చెరువును వదిలి పెట్టాడు.తాళ్లపాలెం కు అన్నలు తరచు వస్తారని నాకు తెలుసు.
రాజ బాబూరావు అని ట్రైబల్ వెల్ఫేర్ అధికారి, నన్ను జీవులో ఎక్కించుకొని ఒకసారి తాళ్లపాకం ఆశ్రమ పాఠశాల తనిఖీకి వచ్చారు. ఒకసారి ఫారెస్ట్ కార్పొరేషన్ అధికారి ఇలాగే లో దొడ్డి అనే గ్రామం తీసుకు వెళ్ళాడు. నేనేమో ఆ గ్రామం వెళితే గ్రామస్తుల రెవెన్యూ సమస్యలు తెలుసుకోవచ్చు అని వెళ్ళేవాడిని. ఆ తరువాత తెలిసింది, వాళ్ళు అన్నల భయంతో తోడుగా తీసుకు వెళ్లారు అని. అమ్మిరేకుల, కిమిలిగడ్డ అనేవి రెండు గ్రామాలు కూడా విశాఖ జిల్లా సరిహద్దులో ఉండేవి. అమ్మిరేకుల గ్రామంలో ఇద్దరు రైతుల భూముల మధ్య సరిహద్దు విషయమై ఒక కొండ రెడ్డి కులస్థుడు ఫిర్యాదు చేశాడు. సర్వేయరు మస్తాను అని ఉండేవాడు. కోనసీమ అమలాపురం కు చెందినవాడు. ఒంటరిగానే రాజవొమ్మంగి లో ఉండేవాడు. కుటుంబం అమలాపురం లోనే ఉండేది. నెమ్మదిగా ఉండేవాడు. చాలా సిన్సియర్ గా పని చేసేవాడు. సైకిల్ పైనే తన చైన్ మాన్ అప్పారావు తో కలసి గ్రామాలకు వెళ్ళేవాడు. భూమి కొలిస్తే సరిహద్దు రైతు వజ్రపు అచ్చయ్య (వాల్మీకి), కొండరెడ్డి రైతు భూమిని ఆక్రమించి ఉన్నాడు. సరిహద్దులో పెద్ద చెట్లు కూడా పెరిగి ఉన్నాయి. మరొక సారి సర్వే చెయ్యమని చెప్పాను. ఎందుకంటే ఆ చెట్లు వయస్సే 30 సంవత్సరాలు పై బడి ఉంటుంది. మళ్ళీ సర్వే చేసి చెట్లతో పాటు కొంత భూమి కూడా కొండరెడ్డి కి కలుస్తుంది అని చెప్పాడు. అదే విషయం వజ్రపు అచ్చయ్య కు చెప్పాను. 30 ఏళ్లనుంచి మా నాన్న ఉన్నప్పటి నుంచి అలాగే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చి, హద్దులు తప్పు అంటే ఎలా నేను ఒప్పుకోను అని అచ్చయ్య గొడవ పెట్టాడు. అచ్చయ్య అన్న పేరు వజ్రపు కొండలరావు. అడ్డతీగలలో ఉంటాడు. చదువుకున్న వాడు. ఆఫీసుల చుట్టూ ప్రజల పనుల మీద తిరుగుతుంటారు.ఆ విధంగా నాకు పరిచయమ. అతనితో చెప్పి చూసాను. పెరిగిన చెట్లు కొట్టుకొని తీసుకుపొమ్మని అచ్చయ్యకు చెప్పాను. నెల రోజుల తర్వాత, కొండ రెడ్డి కులస్తునితో ఆ చెట్లు కొట్టించి అచ్చయ్య చేలో వేయించి కొత్తగా సరిహద్దు రాళ్లు పాతించి వచ్చేశాను. కంకిపాటి రామన్న పడాల్ అను అతను ఆ ఊరిపెద్ద. సార్ అచ్చయ్యతో ఎందుకు పెట్టుకున్నారు. వాడు అన్నలు తో స్నేహంగా ఉంటాడు. మీకు ఇబ్బంది కదా వాళ్ళు కలగ చేసుకుంటే అని అన్నాడు. వాళ్ళు అడిగితే నేను చెప్పుకుంటాలే అని బదులిచ్చాను. ఎలాగూ శరభవరం డిఆర్ డిపో సేల్స్ మేన్ గతంలోనే చెప్పాడు కదా అన్నలు ఒక సారి పిలుస్తారని.అలా పిలిచినప్పుడు, పై రెండు సంఘటనలు గురించి అడిగితే అప్పుడు చెప్పుకోవచ్చులే అని ఊరుకున్నాను. నేను రాజవొమ్మంగి లో ఉన్నంత కాలం నన్ను అన్నలు పిలవలేదు, నాకు ఎప్పుడూ తటస్థ పడలేదు. ఆ తర్వాత నేను రావులపాలెం బదిలీ పై వచ్చేసాను.బహుశా 1989 లో అనుకుంటా ,బొండ్ల నాగరాజు,ని, వజ్రపు అచ్చయ్యను రెండు నెలల వ్యవధిలో అన్నలే చంపినట్లు పేపర్ లో చదివాను.
సశేషం