లోకేష్ కు ఉండవల్లి కితాబు… ప్రముఖుల నుంచి ఉండవల్లికి బూతులు!
వైసిపికి విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కాబోయే ముఖ్యమంత్రి, ఎపి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు తొలిసారిగా కితాబునివ్వడం రాజకీయ వర్గాల్లో…
వైసిపికి విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కాబోయే ముఖ్యమంత్రి, ఎపి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు తొలిసారిగా కితాబునివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమ్మక్క-సారలమ్మ జాతరలో కోవా బన్ అమ్ముకుంటున్న కర్నూలు జిల్లాకు చెందిన వలీని యూట్యూబర్లు వేధించిన ఘటనపై లోకేష్ స్పందిస్తూ త్వరలోనే వలీని కలుస్తానని, ఆయన చేసిన కోవా బన్ ను రుచి చూస్తానని చెప్పడం ద్వారా మంచిపనిచేశారని ఉండవల్లి కితాబునిచ్చారు. బిజెపితో కలిసి పనిచేస్తున్నా లోకేష్ వలీకి అండగా నిలవడం గొప్పవిషయమన్నారు. రాష్ట్ర విభజనకు పుష్కరం పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల నెయ్యి కల్తీలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. దేవుడ్ని మోసం చేసే సాహసం నాయకులు చేయరన్నారు. రసాయనాలతో తయారైన ఆనెయ్యిలో అసలు కొవ్వే లేనపుడు జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు ఎక్కడి నుంచి వస్తాయని ఉండవల్లి ప్రశ్నించారు. ఇదే విషయాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు ములాఖత్ సందర్భంగా తాను ప్రస్తావిస్తే తనను ఫోన్ లో బూతులు తిడుతున్నారని ఉండవల్లి చెప్పారు. ట్రూ కాలర్ లో పరిశీలించగా, ప్రముఖులగా తేలిందని, వారి పేర్లన్నీ రాసిపెట్టుకుంటున్నానని వెల్లడించారు. కల్తీ నెయ్యి వ్యవహారం అంతా రాజకీయ రగడగా అభివర్ణించారు. నెయ్యిలో కొవ్వు కలవలేదన్న సిట్ నివేదిక నేపథ్యంలోనే టాయిలెట్ క్లీనింగ్ కు వినియోగించే రసాయనాలు కలిపారన్న ప్రచారం చేస్తున్నారని అయితే కోకోకోలాతో కూడా మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో చూపిస్తున్నారని, దాన్ని అంతా తాగుతున్నారు కదా అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. సిట్ నివేదిక ప్రకారం కల్తీ నెయ్యి కేసును కొనసాగించాలని, ఈవిషయంలో రాజకీయ ప్రమేయాన్ని, జోక్యాన్ని తగ్గించాలని ఉండవల్లి సూచించారు. రాజకీయంగా పరస్పరం కక్ష తీర్చుకునే రాజకీయాలు మంచిది కాదని ఉండవల్లి హితవు పలికారు.
రాష్ట్ర విభజనకు పుష్కరం….అపాయింట్ మెంట్ ఇవ్వని పవన్
ఎపి, తెలంగాణా విభజన జరిగి ఫిబ్రవరి 18 నాటికి పుష్కరం పూర్తయిందని ఉండవల్లి చెప్పారు. ఆర్టికల్ 100 విరుద్ధంగా మెజార్టీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా 2014లో రాష్ట్ర విభజన జరిగిన రోజును రాష్ట్ర చరిత్రలో, పార్లమెంటు చరిత్రలో చీకటిరోజుగా ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారని గుర్తు చేశారు. ఎపికి అన్యాయం జరిగిందని, వారే ప్రకటించినపుడు విభజన చట్టంలోని అంశాలు, బిజెపి ఇచ్చిన హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, ఎపికి న్యాయం చేసేందుకు కృషిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లకు విజ్ఞప్తి చేశారు. విభజన చట్ట ప్రకారం లక్ష 40వేల కోట్ల ఆస్తుల పంపకం జరగాల్సి ఉందని, తద్వారా ఎపికి 70-80వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని, దీంతో రెవెన్యూ లోటు పూడ్చుకోవచ్చన్నారు. ఈవిషయాలను వివరించేందుకు ఎపి పర్యాటక శాఖ మంత్రి, జనసేన నాయకుడు కందుల దుర్గేష్ ద్వారా పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కోరగా, ఆసక్తి చూపించలేదని ఉండవల్లి తెలిపారు. జగన్ కు రాజకీయ స్నేహితుడిగా భావించే కెసిఆర్ అధికారంలో ఉన్న ఆస్తుల పంపకం కొలిక్కిరాలేదని, చంద్రబాబుకు శిష్యుడైన తెలంగాణా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇప్పుడైనా ఆస్తుల పంపకాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు విచారణ లో ఉన్న రాష్ట్ర విభజన కేసులో పోరాడే ఓపిక తనకు లేదని, గతంలో తనకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర విభజన కేసులో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఈకేసులో ఇంప్లీడై అఫిడవిట్ దాఖలు చేయాలని ఉండవల్లి సూచించారు. తన కేసుకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం 2023లో అఫిడవిట్ దాఖలు చేసిందని, జగన్ వాదనకు మద్దతు ఇవ్వడం ఇష్టం లేకపోతే వేరుగా అఫిడవిట్ దాఖలు చేయవచ్చన్నారు. ఈకేసులో అఫిడవిట్ దాఖలు చేయమని స్పష్టంగా ప్రకటిస్తే ఇకపై దాని గురించి అడగనని ఉండవల్లి స్పష్టం చేశారు.
ఓ రహస్యాన్ని బయటపెట్టిన ఉండవల్లి
తెలంగాణా, ఆంధ్రా మధ్య ఆస్తుల పంపకంపై తెలంగాణా ప్రభుత్వాన్ని వైసిపి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గట్టిగా నిలదీయలేకపోవడానికి వెనుక ఉన్న రహస్యాన్ని ఈసందర్భంగా ఉండవల్లి బయటపెట్టారు. టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆస్తులతో పాటు, ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ ప్రధాన కార్యాలయం, వైసిపి అధినేత జగన్ కు చెందిన భారతీ సిమెంట్స్, సాక్షి పత్రిక ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోనే ఉన్నాయని, అందుకే విభజన చట్టం ప్రకారం ఆస్తుల పంపకం గురించి వారు గట్టిగా అడగలేకపోతున్నారన్నారు. హెరిటేజ్, భారతీ సిమెంట్స్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని ఎపిలో ఏర్పాటు చేసుకుంటే పన్నుల ద్వారా రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుందని సూచించారు.