నాడు రెడ్డి రాజ్యం…నేడు కమ్మ రాజ్యం! మరి రేపు..?!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలించిన ఐదేళ్ల కాలంలో రెడ్ల హవా కొనసాగగా…నేటి తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి పాలనలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలించిన ఐదేళ్ల కాలంలో రెడ్ల హవా కొనసాగగా…నేటి తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి పాలనలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ , ఆయన సామాజికవర్గం ఎక్కువగా ఉన్నారు కాబట్టి కాస్తో కూస్తో కాపులకు ప్రాధాన్యత లభిస్తోంది. ఆరోజు నీది…ఈ రోజు నాది అన్నట్లు నాడు రాజారెడ్డి రాజ్యాంగం అమలైతే…నేడు భవిష్యత్ ముఖ్యమంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రాజకీయ కక్ష సాధింపులు అప్పుడు…ఇప్పడూ ఒకే విధంగా కనిపిస్తున్నాయి. గతంలోనూ ఇప్పుడు కూడా ఇసుక, మద్యం రాష్ట్రానికి, పార్టీలకు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో ఇసుక, నాసిరకం మద్యం వ్యాపారాలు వస్థీకృతమై..పాలకపక్షంలోని కీలకనేతల జేబులు నింపగా, టిడిపి హయాంలో ఈవ్యాపారాల్లో కార్యకర్తల స్థాయిలో కూడా జేబులు నిండుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్న సామాజిక సైకోలు అప్పుడూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారిపై వైసిపి ప్రభుత్వం కేసులు పెట్టగా, నేడు అధికారంలోకి వచ్చిన కూటమి అదే పని చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మేనేజ్ మెంట్ పాలిటిక్స్ చేస్తారు కానీ కక్ష సాధింపు ధోరణికి కాస్త దూరంగా ఉంటారన్న వాదన ఉంది. అధికారాన్ని కైవసం చేసుకున్న నాటి నుంచి గత ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన కమ్మ సామాజిక వర్గీయులు, ఉడుకు రక్తంతో ఉన్న యువనాయకుడు లోకేష్ ఒత్తిళ్లతోనే రాష్ట్రంలో గత ప్రభుత్వపు ధోరణులు కొనసాగిస్తున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. పథకాల్లో తేడా తప్ప ఇరు ప్రభుత్వాల పాలనలో సామాన్యులకు పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదు. అయితే గత పాలనలో అమ్మఒడి….వంటి నగదు బదిలీ పథకాల వల్ల ప్రజల జేబుల్లో కాసిన్ని డబ్బులు అడేవి. తద్వారా బజార్లు కూడా సందడిగా కనిపించేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు పూర్తవుతున్నా ఒక్క నగదు బదిలీ పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజల చేతిలో డబ్బులు ఆడక పెద్దగా వ్యాపారాలు లేవని వర్తకులు వాపోతున్నారు.
మరోవైపు నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన…ప్రజల కోసం పనిచేయాల్సిన రాష్ట్రంలోని పత్రికలు, మీడియా సంస్థలు కూడా రాజకీయ పార్టీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. మీడియా సంస్థలు కూడా ఏదోఒక రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధిగా మారిపోయాయి. వైసిపి అధికారంలో ఉంటే నీలిమీడియా…తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఎల్లో మీడియా ప్రజలను మాయ చేసేందుకు ప్రయత్నిస్తాయి. అనుకూల పార్టీ అధికారంలో ఉంటే అంతా బాగున్నట్లు…నేటి దుస్థితికి నాటి ప్రభుత్వమే కారణమన్నట్లు, వ్యతిరేక ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు కథనాలు వండి వారుస్తూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నాయి. ఈనేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రజల సొంత గొంతుకు వినే అవకాశాలు ఉంటాయి. రాజకీయ కక్ష సాధింపుతో వీటిపై ఆంక్షలు విధిస్తే వాక్ స్వాతంత్ర్యానికే భంగం కలగవచ్చు. వ్యక్తిగత దూషణ, భూషణలను ఎవరూ అంగీకరించరు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు.
2019లో వైసిపి 151 సీట్ల మెజార్టీతో అధికారంలోకి రాగా 2024లో కూటమి ప్రభుత్వం 164 సీట్ల మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. దీన్ని బట్టి 2019లో టిడిపి, 2024లో వైసిపి ప్రభుత్వాల పాలనలో ప్రజలు విసిగిపోయి..మార్పును కోరుకున్నారన్న విషయం స్పష్టమవుతోంది. గత ప్రభుత్వంలో బాధితులే నేటి పాలకులయ్యారన్న లాజిక్ ను ఇరు వర్గాలు గుర్తించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా పాలకులు ఈవిషయాన్ని గుర్తెరిగి, కక్ష సాధింపు ధోరణులకు స్వస్తి పలికి, సామరస్య ప్రజా సంక్షేమ పాలనకు తెరతీస్తే భవిష్యత్ లో రాబోయే కొత్త ప్రభుత్వాలకు కూడా మార్గదర్శకంగా ఉండవచ్చు. లేనిపక్షంలో ఈప్రభుత్వంలో బాధితులు రేపు పాలకులైతే….ఇవే దృశ్యాలు మళ్లీమళ్లీ పునరావృతమవుతాయి.