మళ్లీ సోమవారం…పోలవరం…!

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును తొలిసారిగా 2022లో  ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉన్నతాధికారి, సీనియర్ జర్నలిస్టుతో కలిసి సందర్శించే అవకాశం లభించింది. అయితే ప్రజలు ఊహించిన దానికి…

 మళ్లీ సోమవారం…పోలవరం…!

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును తొలిసారిగా 2022లో  ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉన్నతాధికారి, సీనియర్ జర్నలిస్టుతో కలిసి సందర్శించే అవకాశం లభించింది. అయితే ప్రజలు ఊహించిన దానికి భిన్నంగా అక్కడి పరిస్థితులు ఉండటం ఆందోళన కలిగించింది. పోలవరం లాంటి బహుళార్థక సాధక జాతీయ ప్రాజెక్టును నిర్మిస్తున్న జాడలే ఆప్రాంతంలో లేవు.  కూలీలు, ఇంజనీర్ల హడావుడి, కోలాహాలం ఏమాత్రం కనిపించలేదు. వరదలకు దెబ్బతిన్న దిగువ కాఫర్ డ్యామ్ పునరుద్ధరణ పనులు, జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పనులు మాత్రమే చాలా నత్తనడకన జరుగుతున్నాయి. ఈసందర్భంగా నేను బతికుండగా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్న నమ్మకం లేదన్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలు గుర్తుకు వచ్చాయి. వైసిపి హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్న నమ్మకం ఆ ప్రభుత్వంతో పాటు, ప్రజలకు కూడా నమ్మకం లేకపోయింది. వారి మాటలు కూడా అలాగే సాగాయి. మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అయితే పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని స్పష్టంగా చెప్పేశారు. పైపెచ్చు వైసిపి హయాంలో పోలవరం ప్రాజెక్టు సందర్శన నిషేధం.

తాజాగా తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం…తాజాగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టును సందర్శంచి, లక్ష్యాన్ని నిర్ధేశించడం ప్రాజెక్టు పూర్తి చేయడం పట్ల కాస్త ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఒక సందర్శక ప్రాంతంగా మారిపోయింది. ప్రతీ సోమవారం చంద్రబాబునాయుడు ప్రాజెక్టును సందర్శించే వారు. తాజాగా సోమవారం నాడే ఆయన ప్రాజెక్టును సందర్శించడం యాధృచ్చికమా…లేక ప్రణాళికాబద్ధమేనా?.

ఈసందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ పోలవరం పూర్తి చేయాలన్న లక్ష్యంతో గతంలో 30 సార్లు పోలవరం వచ్చాను. 80 సార్లు వర్చువల్‌గా సమీక్షించా. అటువంటి ప్రాజెక్టును వైసీపీ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. 2020లో కాఫర్‌డ్యాం గ్యాప్‌ను పూడ్చకపోవడంతో భారీ వరదకు డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని, 2019లో మేం తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 అక్టోబరు నాటికి నీటిని నిల్వ చేసేలా, 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా నిర్ధేశించుకుని,  ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యంగా నిర్ధేశించారు. ఈ ప్రాజెక్ట్‌ తో 7లక్షల 20వేల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. 28 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. కొత్తగా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి రానుందని తెలిపారు.కాలంతో పరుగులు తీస్తూ పనులు చేయాలని ఆకాంక్షిస్తున్నామని.. దానికి అనుగుణంగానే నిర్దిష్ట గడువులోగా వాటిని పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించామని ప్రకటించారు.

ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలియజేసి మొదటి దశ నిర్మాణానికి రూ.12,157 కోట్లు సాధించామన్నారు. గత ఐదేళ్లలో ప్రాజెక్టు పనులు చేయకపోవడం వల్ల రూ.15 వేల కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే ఆ లాభం కూడా వచ్చి ఉండేదని, అది కూడా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అప్పట్లో డయాఫ్రం వాల్‌ రూ.440 కోట్లతో పూర్తి చేస్తే ప్రస్తుతం అది 990 కోట్లు ఖర్చు కానుంది. శాండ్‌ ఫిల్లింగ్‌కు రూ.350 కోట్లు అవుతుంది. కేంద్రం నుంచి రూ.8,242 కోట్లు వస్తే అందులో రూ.2,342 కోట్లు వైసిపి ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు 76.79 శాతం పూర్తయ్యాయని తెలిపారు. డిజైన్ల ఆమోదం, అనుమతులు, ఇతరత్రా అవసరాలపై ముందుచూపుతో వ్యవహరించాలని స్పష్టంచేశారు. నిర్టిష్ట కార్యాచరణ ప్రకటన ద్వారా పనులు శరవేగంగా పూర్తిచేసే అతిపెద్ద బాధ్యతను ఇంజనీరింగ్‌ అధికారులకు అప్పగించారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై కూడా చంద్రబాబు స్పందించారు. పోలవరం ఎత్తు తగ్గించాలని కేంద్రానికి ఎవరు లేఖలు రాశారు.. ఎవరు ఒప్పుకొన్నారని నిలదీశారు. ప్రాజెక్టును 45.75 మీటర్ల ఎత్తున నిర్మించేందుకే  కృషిచేస్తున్నామన్నారు.  ప్రాజెక్టులో ఒకేసారి నీరు నిల్వ చేయలేం. నిర్మాణం పూర్తయ్యాక నిపుణుల సలహా మేరకు దశల వారీగా నీటి నిల్వను పెంచుతూ పోతామని వివరించారు. గతంలోలా ఇకపై ప్రతీసోమవారం చంద్రబాబు  ప్రాజెక్టును సందర్శించి, దాన్ని పూర్తి చేసేందుకు పరుగులు పెట్టిస్తారేమో…ఆయన మాటల్లో ఆ విశ్వాసం కనిపించింది. అయితే క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతాయన్నది వేచిచూడాల్సిందే…

 

Leave a Reply