ఏకగ్రీవాలు…క్రాస్ ఓటింగ్..మధ్య కమల వికాసం?!

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థిగా బిజెపికి చెందిన రేలంగి శ్రీదేవి, వైసిపి అభ్యర్థిగా దాసి వెంకట్రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ…

 ఏకగ్రీవాలు…క్రాస్ ఓటింగ్..మధ్య కమల వికాసం?!

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థిగా బిజెపికి చెందిన రేలంగి శ్రీదేవి, వైసిపి అభ్యర్థిగా దాసి వెంకట్రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపి జివి హర్షకుమార్ పెద్దకోడలు బి అన్విత, స్వతంత్ర అభ్యర్థిగా అజ్జరపు వాసు మేయర్ రేసులో ఉన్నా సుమారు ఏడేళ్ల తరువాత జరుగుతున్న ఈఎన్నికల సరళిని పరిశీలిస్తుంటే ఏకపక్షంగా సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ రోజే ఇద్దరు తెలుగుదేశం అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికవడం ఒక విధమైన సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని విశ్లేషిస్తున్నారు. మరో రెండుమూడు డివిజన్లలో కూడా ఇదే పరిస్థితి కనిపించగా, చివరి నిమిషంలో వైసిపి నాయకులు అందుబాటులో ఉన్న అభ్యర్థిని రంగంలోకి దించి గండాన్ని గట్టెక్కినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈఎన్నికల్లో వైసిపి పార్టీలో అభ్యర్థుల ఎంపిక నుంచి సిటీలో ప్రచార బాధ్యతలను మాజీ ఎంపి భరత్ రామ్ తలెకెత్తుకున్న నేపథ్యంలో నాయకుల ప్రచారం వరకు సమన్వయం కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. వైసిపిలో నామినేషన్లు వేసేందుకు ముందుకు వచ్చిన వారికి టిక్కెట్లు లభించకపోవడం…కొన్నిచోట్ల నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు దొరకకపోవడం గమనార్హం. వైసిపిలో ఎవరి మద్దతుదారులకు వారు ప్రచారం చేసుకుంటున్నారు. వైసిపి మేయర్ అభ్యర్థి దాసి వెంకట్రావు నామినేషన్ల రోజు పార్టీలోని ప్రత్యర్థులైన భరత్, జక్కంపూడి రాజా, గణేష్, వైసిపి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చినా వారు ఒకటో రెండో మినహా సిటీలో ప్రచారానికి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం సాగుతోంది. కూటమి పార్టీలు వివిధ సామాజిక, వృత్తి వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తుండగా, వైసిపి ఈవిషయంలో వెనుకబడి ఉందని చెబుతున్నారు. కీలకమైన పోల్ మేనేజ్ మెంట్ విషయంలో పార్టీ నేతల వ్యవహారశైలిని బట్టి వైసిపి భవిష్యత్ తేలిపోనుంది. మరోవైపు గాజు గ్లాసు పార్టీలో కూడా సమన్వయలోపం కనిపిస్తోంది. నగరానికే చెందిన ఎపి పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, నియోజకవర్గ ఇన్చార్జి అత్తి సత్యనారాయణ ప్రచారానికి కాస్త దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తోంది.
రాజకీయ అరంగేట్రమే పోరాటంతో మొదలు పెట్టిన స్వతంత్ర మేయర్ అభ్యర్థి అజ్జరపు వాసు ఒంటరి పోరు సాగిస్తున్నారు. 2007 నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా టిడిపి టిక్కెట్టు కోసం ప్రయత్నించి విఫలమై తిరుగుబాటుదారుగా మారిన వాసు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అదే పోరాటపటిమతో వైసిపికి తన బలాన్ని చూపించాలని ప్రధాన అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. వైసిపి మేయర్ అభ్యర్థిగా తన పేరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు నమ్మించి భరత్ మోసం చేశారని వాసు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోసం డబ్బు కూడా సిద్ధం చేసుకున్న తరువాత నమ్మకద్రోహానికి పాల్పడ్డారంటూ భరత్ ను వీడియో ముఖంగా బండబూతులు తిట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ప్రజాబలాన్ని నిరూపించుకునేందుకే మేయర్ బరిలో నిలిచినట్లు స్పష్టం చేస్తున్నారు.
క్రాస్ ఓటింగ్ అంశం రాజమహేంద్రవరం రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కూటమి పార్టీలు, వైసిపి కార్పొరేటర్ అభ్యర్థులు తమ డివిజన్లలో ఎంతవరకు తమ పార్టీ మేయర్ అభ్యర్థికి కూడా ఓటు వేయమని చెబుతారన్నదానిపైనా…పోలింగ్ ముందురోజు డబ్బు పంపకాలపైనా క్రాస్ ఓటింగ్ అధారపడి ఉంటుంది. మతతత్వ పార్టీగా ముద్రపడిన బిజెపి మేయర్ అభ్యర్థి ఓట్లను కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వైసిపి చీల్చే అవకాశం ఉన్నా వారు ఒక కూటమిగా పోటీ చేయకపోవడం బిజెపికి కలిసి వచ్చే అంశం. మరోవైపు అజ్జరపు వాసుకు తెలుగుదేశం పార్టీ, వైసిపిలో పాత పరిచయాలు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేయర్ ఓటు వాసుకు వేసేందుకు కొంతమంది కూటమి , వైసిపి నాయకులు కూడా హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే దాసి వెంకట్రావు కన్నా వాసుయే కూటమి మేయర్ అభ్యర్థికి గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అగ్రవర్ణాలకు అన్యాయం
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో అగ్రవర్ణాలకు అన్యాయం జరిగిందన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. ముఖ్యంగా వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులకు తగిన ప్రాతినిధ్యం లభించలేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రధాన పార్టీలేవీ బ్రాహ్మణులు, క్షత్రియులను గుర్తించి, ఒక్క సీటు కూడా కేటాయించ లేదు. వైశ్యులు, బ్రాహ్మణులు ఎక్కువగా ఉండే పాత 22వ డివిజన్ లో టిడిపి కాపు అభ్యర్థిని రంగంలోకి దించడంతో స్థానిక వైశ్యులు, బ్రాహ్మణులు అసంతృప్తితో ఉన్నారు. బ్రాహ్మణులు నిర్ణాయక ఓటర్లుగా ఉన్న పాత 37వ డివిజన్ లో టిడిపికి చెందిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నిమిషకవి వెంకటేష్ తన సతీమణిని తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దింపారు. పాత 4వ డివిజన్ లో జనసేన అభ్యర్థి వై శ్రీనివాస్ ఎదురీదాల్సి వస్తోంది. తనకు టిక్కెట్ దక్కకపోవడంతో క్షత్రియ సామాజికవర్గానికి చెందిన మాజీ టిడిపి కార్పొరేటర్ కోసూరి చండీప్రియ తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగి, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలా పలుచోట్ల తిరుగుబాటుదారులు పోటీలో నిలవడం కూటమి, వైసిపి పార్టీలకు కొంత తలనొప్పిగా మారింది.
మరోవైపు మొన్నటి వరకు రేలంగి శ్రీదేవి ఆర్థికంగా నిలవలేరన్న ప్రచారం ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి వినిపించకపోవడం విశేషం. అనంతపురం చేదు ఫలితం పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో బిజెపితో పాటు కూటమి పార్టీలు కూడా సమన్వయంతో పనిచేస్తుండటం రేలంగికి కలిసి వచ్చే అంశం. బిజెపి ఎపి ఇన్చార్జి అరవింద్ సింగ్ బదోరియాతో పాటు, రాయలసీమ నుంచి కూడా బిజెపి శ్రేణులు తరలివచ్చాయి. బదోరియా రాజమహేంద్రవరంలోనే మకాం వేసి కూటమి నాయకులు, శ్రేణులను సమన్వయం చేసే పనిలో ఉన్నారు. బిజెపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తన శిష్యురాలు రేలంగి శ్రీదేవిని మేయర్ గా గెలిపించేందుకు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. అయితే ఇష్టం లేని పెళ్లికి వచ్చినట్లు రాజమహేంద్రవరం ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహారం ఉందని బీజేపితో పాటు, కూటమిలో కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఏది ఏమైనా క్రాస్ ఓటింగ్ ను నివారింగలిగితే రేలంగి శ్రీదేవిని రాజమహేంద్రవరం మేయర్ పీఠం ఎక్కే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

Leave a Reply